కట్టడి చేయకుంటే కరోనా బ్లాస్ట్‌

ABN , First Publish Date - 2021-04-09T08:22:30+05:30 IST

వేగంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేయకపోతే కరోనా బ్లాస్ట్‌ అయ్యే ప్రమాదముందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బార్లు, పబ్బులు, వైన్‌షాపుల వద్ద

కట్టడి చేయకుంటే కరోనా బ్లాస్ట్‌

శరవేగంగా విస్తరిస్తున్న సెకండ్‌ వేవ్‌..

4924 ఐసీయూ పడకల్లో ఇప్పటికే 1344 నిండాయ్‌ 

శుభకార్యాలపై పరిమితి సరే.. థియేటర్లు, క్లబ్బులపై ఆంక్షలెందుకు లేవు? 

హాట్‌స్పాట్‌లను గుర్తించి రాకపోకలు నియంత్రించండి 

వైన్‌షాపులు, బార్లు, పబ్బుల వద్ద నియంత్రణ ఏదీ? 

ఉల్లంఘించే హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లపై కేసులు పెట్టండి

మాస్కులు ధరించని వారు గ్రేటర్‌లోనే లక్షల్లో  

పోలీసుల్లో ఉదాసీనత ఎందుకు?: హైకోర్టు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వేగంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేయకపోతే కరోనా బ్లాస్ట్‌ అయ్యే ప్రమాదముందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బార్లు, పబ్బులు, వైన్‌షాపుల వద్ద నియంత్రణ కొరవడిందని ఆక్షేపించింది. వివాహాది శుభకార్యాలకు 200 మంది అతిథులను మించకుండా ఆంక్షలు విధిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. యువతను ఆకర్షించే సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, స్విమ్మింగ్‌పూల్స్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన వ్యాజ్యాల్లో ప్రధానమైన రెండింటిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిల ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలో 4924 ఐసీయూ పడకలు ఉన్నాయని, వాటిలో 1344 ఇప్పటికే నిండాయని చెబుతున్నారని, అన్ని పడకలకు ఆక్సిజన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. 


ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలు

‘‘రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఆశించిన మేరకు చేయడం లేదు. కచ్చితమైన ఫలితాలిచ్చే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచుతామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ చెబుతున్నారే తప్ప ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల్లో సరాసరి 20ు కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా మిగిలిన జిల్లాల్లో 5-10ు లోపే ఆర్టీపీసీఆర్‌ టెస్టులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా నిబంధనల ప్రకారం కరోనా పరీక్షల్లో 70ు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాల్సి ఉంది. బహిరంగ స్థలాలు, హోటళ్లు, సినిమాహాళ్లు తదితర ప్రాంతాల్లో సీలింగ్‌ విధించాలి. 50ు ఆక్యుపెన్సీ గరిష్ఠంగా 200 మందికి మించకుండా ఉండాలి. మే నెలలో వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి.


కొవిడ్‌-19 రూల్స్‌ను ఉల్లంఘించే హోటళ్లు, ఫంక్షన్‌హాళ్ల లైసెన్సులు రద్దు చేయాలి. నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వైన్స్‌షాపులు, బార్లు, పబ్బులు, సినిమా థియేటర్ల వద్ద కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని సూచించింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(డీఎం) చట్టంలోని సెక్షన్‌ 17 ప్రకారం అంటువ్యాధులు ప్రబలకుండా నిపుణులతో అడ్వైజరీ కమిటీ వేయాలని స్పష్టం చేసింది.


పోలీసులూ.. ఉపేక్షించొద్దు

2020 మార్చి 24 నుంచి 2021 ఏప్రిల్‌ 1 మధ్య ఐపీసీ కింద 13,219 మందిపైన, డీఎం యాక్టు కింద 8417 మందిపై, మాస్కులు ధరించని 1,64,467 మందిపై కేసులు నమోదు చేశామని నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించని వారిపై 2456, గుమిగూడిన ఘటనలపై 322, బహిరంగ స్థలాల్లో ఉమ్మిన వారిపై 6, మద్యం సేవించడం, పాన్‌, గుట్కా, పొగాకు వినియోగించిన వారిపై 27,023 కేసులు నమోదు చేసి 62,220మందిని అరెస్టు చేసి రూ.58,92,87,854 జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ గణాంకాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా తక్కువ అని తెలిపింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో నిఘాపెడితే మాస్కులు ధరించకుండా బయట తిరిగేవారు లక్షల్లో ఉంటారని అభిప్రాయపడింది.


మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని తాము చెప్పడం లేదని, కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపట్ల చర్యలు తీసుకోవాలని తెలిపింది. వైన్‌షాపులు, బార్లు, హోటళ్ల వద్ద నిఘా పెంచాలని సూచించింది. తదుపరి విచారణ నాటికి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, ఎంతమందిపై కేసులు పెట్టారు? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని డీజీపీకి స్పష్టం చేసింది. 


నైట్‌ షెల్టర్స్‌లో పరిస్థితి ఏమిటి? 

వ్యాజ్యాల విచారణ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌, డీజీపీలు వేర్వేరుగా ఇచ్చారు. ఈ వ్యాజ్యాల్లో అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వివరణ ఇస్తూ వివాహాది శుభకార్యాలకు 200 మంది అతిథిలకు మించకుండా చేసుకోడానికి అనుమతించినట్లు తెలిపారు. స్పందించిన ధర్మాసనం శుభకార్యాలకు, పండుగలపై ఆంక్షలు విధించి యువతను ఆకర్షించే సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, స్విమింగ్‌పూల్స్‌పై ఆంక్షలు ఎందుకు పెట్టడం లేదని ఆక్షేపించింది.


నైట్‌ షెల్టర్స్‌లో ఉంటున్న వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెం. 36, 45లలోని పబ్బుల వద్ద యువకులు గుమిగూడు తున్నారని న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు నిఘాపెట్టి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు చేయాలన్నారు. సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచంద్ర కల్పించుకుంటూ మాల్స్‌లోని థియేటర్లలో రోజు 6, 7 షోలు వేస్తున్నారని, ఒకదాని తర్వాత మరొకటి 5 నిమిషాల తేడాతో వేస్తున్నారని, సరైన శానిటైజేషన్‌ చేయకపోవడం వల్ల సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాల్లో న్యాయవాదుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న కోర్టు సమగ్ర వివరాలతో ఏప్రిల్‌ 14లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.’’హాట్‌స్పాట్‌లు గుర్తించండి

కరోనా కేసులు అధికంగా ఉన్నప్రాంతాలను గుర్తించి మైక్రో కంటైన్మెంట్‌/కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించాలని సూచించింది. హాట్‌స్పాట్‌లను గుర్తించి.. ఆ ప్రాంతాల్లో రాకపోకలను నియత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. అత్యవసరం ఉన్నవారికి పాస్‌ ఇవ్వాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో కరోనా పరీక్షలు పెంచాలని తెలిపింది.పట్టణ ప్రాంతాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపిస్తోందని కేంద్రం చెబుతోందని ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారు తమ వెంట ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు ఉంటేనే రానివ్వాలని స్పష్టం చేసింది. సీరో సర్వే పూర్తయిన తర్వాత నివేదికను కోర్టుముందుంచాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-04-09T08:22:30+05:30 IST