నాడు-నేడు పనుల్లోనూ నొక్కుడు

ABN , First Publish Date - 2020-06-06T08:58:45+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాల పునరుద్ధరణ కార్యక్రమం ‘నాడు- నేడు’ కొత్తపల్లి

నాడు-నేడు పనుల్లోనూ నొక్కుడు

50 శాతం పైబడి అధిక చెల్లింపులు 

అధికారుల అండదండలున్నాయని ఆరోపణలు


కొత్తపల్లి, జూన్‌ 5: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాల పునరుద్ధరణ కార్యక్రమం ‘నాడు- నేడు’ కొత్తపల్లి మండలంలో అక్రమాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మండలంలో 21 పాఠశాలను ఈ పథకం కింద ఆధునికీకరించాలని నిర్ణయించగా, ఆయా పాఠశాలల్లోని అవసరాలను గుర్తించి ఒక్కొక్క పాఠశాలకు సుమారు 20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు మంజూరు చేసింది. అయితే ఈ పాఠశాలకు మెటీరియల్‌ కొనుగోలు చేసే విషయంలో కొంద రు ప్రధానోపాధ్యాయులు, కమిటీ సభ్యులు, అధికారులు ఏకమై అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఇతర మండలాలతో పోల్చినప్పడు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో మెటల్‌ కొనుగోలుకు అధికంగా సొమ్ములు చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం.


5 యూనిట్లు అంటే 15 మెట్రిక్‌ టన్నుల 20 ఎంఎం క్వారీ మెటల్‌  సరఫరాకు రూ. 16 వేల నుంచి రూ.16,500 వరకు చెల్లించాల్సి ఉండగా రూ.24,100కు కొనుగోలు చేసినట్టు చూపారని తెలిసింది. ఉన్నతాధికారులకు దొరకుండా ఉండేందుకు ఇక్కడే అధికారులంతా రింగై అన్ని పాఠశాలల నుంచి ఒకే రకమైన చెల్లింపులు ఒకే వ్యక్తికి చేసినట్టు చెబుతున్నారు. 40ఎంఎం క్వారీ మెటల్‌ చెల్లింపు విషయంలో కూడా ఇదే మాదిరిగా 40శాతం పైబడి అధిక చెల్లింపులు జరిగిపోయాయి. తొలివిడతగా ఇప్పటికే మండలంలోని అన్ని పాఠశాలలకు ఒక విడత మెటల్‌ సరఫరా జరిగిపోయింది. తద్వారా నాడు- నేడు నిధులు సుమారు రూ. 30లక్షల పైబడి చేతులు మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటుక సరఫరా విషయలో కూడా అదనపు చెల్లింపులు జరిగినట్టు తెలిసింది. వెయ్యి ఇటుక రూ. 4 వేల నుంచి రూ.4,500లోపు ధరకు లభిస్తుండగా రూ.6వేల ధరను అన్ని పాఠశాలల నుంచి గుత్తగా చెల్లించేశారు.


మిగిలిన మండలాల్లో కంటే ఇక్కడ అత్యధిక ధర చెల్లించే విషయంలో జిల్లా ఉన్నతాఽధికారి ఒకరి అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పనుల నాణ్యత వాటి పట్ల అంచనా వ్యయాలను తగ్గించేందుకు రివర్స్‌ టెండరింగ్‌  నిర్వహిస్తుండగా ఈ మండలంలో మాత్రం హైస్పీడ్‌ టెండరింగ్‌ నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు-నేడు నిధుల వినియో గం, చెల్లింపుల విషయంలో ఏడుగురు సభ్యులతో కూడిన తల్లిదండ్రుల కమిటీకి తొలివిడతలో చెక్‌పవర్‌ కల్పించారు. వీరిలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సర్వశిక్షఅభియాన్‌కు చెందిన జేఈఈ, పేరెంటు కమిటీ చైర్మన్‌, మరొక నలుగురు పేరెంట్స్‌కమిటీ సభ్యులు సంయుక్తంగా ఈ చెక్‌పవర్‌ను కలిగి ఉండాలని తొలిదశలో నిర్ణయించారు.


కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ చెక్‌పవర్‌ను వీరిలో నుంచి ఐదుగురు సభ్యులకు పరిమితం చేస్తూ జీవో నెంబర్‌ 20 ద్వారా వెసులుబాటు కల్పించారు. దీన్ని కొందరు అధికారులు, ప్రధానోపాధ్యాయులు, మరింత వెసులుబాటును కల్పించుకున్నారు. ఐదుగురు సభ్యులుండాలనే నిబంధనను తుంగలోకి తొక్కి కేవలం ముగ్గురు సభ్యులతో బ్యాంక్‌ లావాదేవీలను నిర్వహించేస్తున్నారు. ఇదే విషయంపై ఎంఈవో కోటి అబ్బులను సంప్రదించినపుడు మండలంలో తొలివిడత 21 పాఠశాల భవనాల ఆధునికీకరణకు రూ. 3.80 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. చెల్లింపుల విషయంలో అక్ర మాలు జరిగితే ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నా రు. తాను కేవలం పనులను పర్యవేక్షిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - 2020-06-06T08:58:45+05:30 IST