మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలి: రాహుల్

ABN , First Publish Date - 2020-08-02T20:18:56+05:30 IST

ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని విడుదల..

మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలి: రాహుల్

న్యూఢిల్లీ: ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు డిమాండ్ చేశారు. ఆమె నిర్బంధాన్ని భారత ప్రభుత్వం పొడిగించడాన్ని రాహుల్ తప్పుపట్టారు. ముఫ్తీని విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.


'భారత ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. రాజకీయ నేతలను భారత ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తోంది. మెహబూబా ముఫ్తీని తక్షణమే విడుదల చేయాలి' అని రాహుల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


దీనికి ముందు, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సైతం ఇదే డిమాండ్ చేశారు. పీఎస్ఏ కింద మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని పొడిగించడం చట్టాన్ని పరిహసించడమేనని, ప్రతి పౌరునికి ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని ఆయన తప్పుపట్టారు.


పీఎస్ఏ కింద ముఫ్తీ నిర్బంధాన్ని కేంద్రం మరో మూడు నెలల పాటు శుక్రవారంనాడు పొడిగించింది. దీనికి ముందు మే 5న మరో మూడు నెలల పాటు పొడిగించారు. కశ్మీరుకు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను గత ఏడాది కేంద్ర రద్దు చేసిన నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నాయకులను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.

Updated Date - 2020-08-02T20:18:56+05:30 IST