ఉన్నత విద్య.. ఉత్త ముచ్చటేనా?

ABN , First Publish Date - 2021-12-06T03:54:46+05:30 IST

మారుమూల మండలమైన బెజ్జూరులో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేకమంది పేద విద్యార్థులు ఇంటర్‌తోనే చదువును ఆపేస్తున్నారు.

ఉన్నత విద్య.. ఉత్త ముచ్చటేనా?
బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

- ఇంటర్‌తోనే అటకెక్కుతున్న చదువులు

- ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం విద్యార్థుల నిరీక్షణ

- చదువు‘కొనే’ స్థోమత లేక మాధ్యమిక విద్యతోనే సరి

బెజ్జూరు, డిసెంబరు 4: మారుమూల మండలమైన బెజ్జూరులో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేకమంది పేద విద్యార్థులు ఇంటర్‌తోనే చదువును ఆపేస్తున్నారు. ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న మండలాల్లో డిగ్రీ కళాశాలలను నెలకొల్పు తామని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అనేకమంది విద్యారులు డిగ్రీ చదువు‘కొన’లేక ఇంటర్‌తోనే ముగించేస్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి దండ్రులు కష్టపడి ఇంటర్‌ వరకు చదివించినా అందుబాటులో డిగ్రీ కళాశాల లేకపోవడంతో అక్కడి వరకే చదువును ఆపివేయిస్తున్నారు. ఇంటర్‌ తర్వాత చదువుకోవాలని ఉన్నా అందుబాటులో కళాశాల లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న విద్యార్థులు పట్టణ ప్రాంతాలైన కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కరీంనగర్‌, హన్మకొండ, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. 

బాలికలు ఇంటివద్దే..

బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 99 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 99మంది ఇంటర్‌లో ఉత్తీర్ణుల య్యారు. వీరంతా డిగ్రీలో చేరేందుకు ఆసక్తి ఉందంటూ తమ అభి ప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఉమ్మడి మండలంలో 23 గ్రామపంచా యతీల్లోని గ్రామాల వారు మండల కేంద్రానికి చేరుకోవాలంటే సరైన సదుపాయాలు లేవు. ఇక పట్టణాలకు వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఇటువంటి చోట డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద, గిరిజన విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చదువును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మాత్రం చదువును ఇంటర్‌తోనే ఆపేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు పట్టణప్రాంతాల్లో బాలికలను చదివించలేక ఇంటి వద్దనే ఉంచుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతోనే గ్రామాల్లో బాలికలు చదువుకు దూరం అవుతున్నారు.

వాగ్ధానాలకే పరిమితం..

అందరికీ అందుబాటులో ఉన్నత చదువులంటూ పాలకులు చేసిన వాగ్ధానాలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడంలేదు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విద్యాకుసుమాలు వికసించే అవ కాశాలు ఉన్నాయి. అయితే పాలకులు మాత్రం ఉన్నత విద్య పట్ల ప్రచారం చేయడం తప్ప ఆచరణలో అమలు చేయడం లేదన్న ఆరోప ణలు ఉన్నాయి. ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ఉచిత చదువులంటూ అనేకమార్లు ప్రచారాలు చేసిందే తప్ప ఆచరణలో అమలు చేయలేదు. దీంతో దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతూనే ఉన్నారు. మారుమూల మండలమైన బెజ్జూరులో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే పెంచికలపేట, చింతలమానేపల్లి, మండలాలతో పాటు పలు గ్రామాల వారికి సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషిచేసి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. 

కళాశాల లేకపోవడం దురదృష్టకరం..

  - అంజలి, ఇంటర్మీడియట్‌ విద్యార్థిని

మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడం దురదృష్టకరం. ఇంటర్‌ అయ్యాక డిగ్రీ చదివేందుకు పట్టణ ప్రాంతాలకు వెళ్లలేని స్థితి. కళాశాల అందుబాటులో ఉంటే ఉన్నత చదువులు కొనసాగుతాయి. డిగ్రీ చద వాలంటే కాగజ్‌నగర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. అధికారులు స్పందించి ఇక్కడ డిగ్రీకళాశాల ఏర్పాటు చేయాలి. 

పట్టణాల్లో ఉండి చదివే స్థోమత లేదు..

- సుష్మ, ఇంటర్మీడియట్‌ విద్యార్థిని

పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువు చదివే స్థోమత లేదు. బెజ్జూరు నుంచి పట్టణాలకు వెళ్లాలంటే అధిక ఖర్చులు అవుతాయి. దీంతో తాము ఇంటర్‌వరకే చదువు ఆపాల్సి వస్తోంది. కాగజ్‌నగర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి మాకు లేదు. అధికారులు స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుంది.

Updated Date - 2021-12-06T03:54:46+05:30 IST