ఇదేం పని సారూ...

ABN , First Publish Date - 2020-08-12T16:51:36+05:30 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్నతాధికారి అవినీతి లీలలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పాలనా యంత్రాంగానికి ఆదర్శనీయంగా ఉండాల్సిన సదరు ఉన్నతాధికారి.. అడ్డదారుల్లో సంపాదనకు తెగించడం

ఇదేం పని సారూ...

మునిసిపాలిటీ మరుగుదొడ్ల నిధులకు కన్నం

తీర్మానాలు లేకుండానే అడ్వాన్స్‌గా రూ.40 లక్షలు  

9 రోజుల డ్రోన్ల అద్దె రూ.10.38 లక్షలు

‘ఫ్రెష్‌’ పేరుతో మరిన్ని లీలలు

హైపోక్లోరైడ్‌కు జీహెచ్‌ఎంసీ స్థాయి చెల్లింపు


భూపాలపల్లి (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఉన్నతాధికారి అవినీతి లీలలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పాలనా యంత్రాంగానికి ఆదర్శనీయంగా ఉండాల్సిన సదరు ఉన్నతాధికారి.. అడ్డదారుల్లో సంపాదనకు తెగించడం విస్తుగొలుపుతోంది. ‘కరోనా ఖర్చుల్లోనూ కక్కుర్తి’ అనే శీర్షికతో మంగళవారం ఆంధ్రజ్యోతి జిల్లా అనుబంధంలో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఇక కరోనా ఖర్చుల్లో కమీషన్ల కక్కుర్తికి అలవాటుపడిన ఉన్నతాధికారి... మునిసిపల్‌ నిఽధులకు కూడా ఎసరు పెట్టినట్టు తాజాగా తెలిసింది.  చివరికి మరుగుదొడ్లను కూడా వదలకుండా కమీషన్ల దందాసాగిస్తున్నారు. టెండర్లు లేవు, కౌన్సిల్‌ ఆమోదం లేదు, తీర్మానాల ఊసే లేదు. అయినా ఏకంగా రూ. 40 లక్షలకు పైగా నిఽధులు అడ్వాన్స్‌గా చెల్లించారు.  మునిసిపాలిటీలో డ్రోన్ల అద్దెలో డ్రామా.. ‘ఫ్రెష్‌’ పేరిట దగా.. పిచికారీకి అధిక ధరల చెల్లింపులతో సర్కారు సొమ్ముకు కన్నం వేస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారి కావటంతో ఎవరూ ఎదిరించలేని స్థితి నెలకొందని చెబుతున్నారు.


ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో సుమారు లక్ష జనాభా ఉన్నప్పటికీ మరుగుదొడ్లు సరిగా లేవు. దీంతో మొదటి విడతలో 15 చోట్ల ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి పట్టణ ప్రగతి-2లో సుమారు రూ.1.35కోట్లు కేటాయించారు. దీంతో ఆ ఉన్నతాధికారి కన్ను ఈ మరుగుదొడ్లపై పడింది. 


పట్టణంలో మునిసిపల్‌ నిధులతో మరుగుదొడ్లు నిర్మించాలంటే నిబంధనల మేరకు మొదట కౌన్సిల్‌ తీర్మానం చేయాలి. ఆ తర్వాత టెండర్లు ఆహ్వానించాలి. కౌన్సిల్‌ ఆమోదంతో పనులు చేపట్టిన తర్వాత విడతల వారీగా నిధులను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయి తే ఆ ఉన్నతాధికారి ఎవరికీ చెప్పకుండా కిందిస్థాయి అధికారులను బెదిరించి ఏకంగా రూ.40 లక్షల నిధులను చెక్కు రూపంలో పది రోజుల క్రితమే ఓ ‘జిత్తు’లోడి చేతిలో పెట్టినట్టు సమాచారం. టెండర్లు లేవు... కనీసం కౌన్సిల్‌ ఆమోదం లేదు.. పనులు   ప్రారంభం కాలేదు.. కానీ, ఏకంగా రూ.40 లక్షలు చేయటంపై కౌన్సిలర్లు అవాక్కవుతున్నారు. 


డ్రోన్ల అద్దె రూ.10.38 లక్షలు

కరోనా వైరస్‌ వ్యాప్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో హైపోక్లోరైడ్‌ను పిచాకారీ చేశారు. అందులో భాగంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు తొమ్మిది రోజుల పాటు రెండు డ్రోన్లను వినియోగించి  హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఏకంగా రూ.10,38,400 మునిసిపాలిటీ నిధులను డ్రోన్ల అద్దె రూపంలో చెల్లించారు. హైపోక్లోరైడ్‌ ధర అదనమే. డ్రోన్లకే ఇంత పెద్ద మొత్తంలో చెల్లించటమేమిటనే అనుమానాలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి. అయితే ఈ డ్రోన్ల దందా వెనక నుంచి నడిపించింది ఆ ఉన్నతాధికారి బినామీ అనే ఆరోపణలు వస్తున్నాయి. అద్దె రూంలో చెల్లించిన మొత్తంతో మునిసిపాలిటీకి సొంతంగా రెండుమూడు డ్రోన్లను కొనుగోలు చేసుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. 


పేరొకరికి.. నష్టం మునిసిపాలిటీకి..

భూపాలపల్లి పట్టణంలో కరోనా వైరస్‌ ఉధృతంగా  ఉంది.  మార్చి, ఏప్రిల్‌లో ఢిల్లీ మర్కజ్‌ కేసుల నేపథ్యంలో సుభా్‌షకాలనీ, ఎండీక్వార్టర్‌ తదితర ఏరియాలను రెడ్‌ జోన్లుగా ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో ‘ఫ్రెష్‌’ పేరుతో ఏర్పాటు చేసిన వాహనం ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు 400కు పైగానే ఉన్నాయి. ఏ కాలనీ కూడా రెడ్‌ జోన్‌గా లేదు. అయినా ఇప్పుడో మరో ఫ్రెష్‌ వాహనం ఏర్పాటైంది.  వాహనం ద్వారా వచ్చే లాభం ఫ్రెష్‌కు పోతుంది. వాహనం అద్దె మాత్రం మునిసిపాలిటీ నుంచి చెల్లిస్తున్నారు. అద్దె రోజుకు రూ.వెయ్యి  ,డ్రైవర్‌కు జీతం రూ.500 చెల్తిస్తున్నారు. అంటే.. రోజుకు రూ.1,500 భారం మునిసిపాలిటీపైనే పడుతోంది. ఇంకా డీజిల్‌ ఖర్చులు అదనమే.  


జీహెచ్‌ఎంసీ రేంజ్‌లో....

కరోనా నిర్మూలనకు పట్టణంలో పరిసరాలను పరిఽశుభ్రంగా ఉంచేందుకు హైపోక్లోరైడ్‌ పిచికారీ చేశారు. నాణ్యత గల ఈ ద్రావణం  బయట మార్కెట్‌లో లీటర్‌కు సుమారు రూ.70కు లభిస్తోంది. అయితే.. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వినియోగించిన నాణ్యతతో హైపోక్లోరైడ్‌ను అదే ఽధరకు లీటరుకు రూ.136.95 చెల్లించి కొనుగోలు చేశారు. 2,500 లీటర్ల హైపోక్లోరైడ్‌కు మునిసిపాలిటీ నుంచి రూ.3,42,375 చెల్లించినట్టు బిల్లులు కూడా డ్రా చేసుకున్నారు. పిచికారీ చేసింది ఎక్కడో.. ఏ మందు పిచికారీ చేశారో మాత్రం ఎవరికీ తెలియదు. నిధులు మాత్రం దళారి చక్రం తిప్పి తీసుకెళ్లినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2020-08-12T16:51:36+05:30 IST