25,000.. దేశంలో ఒక్క రోజే అత్యధిక కేసులు

ABN , First Publish Date - 2020-07-10T07:28:28+05:30 IST

దేశంలో కరోనా ఉధృతమవుతోంది. గురువారం అత్యధిక స్థాయిలో 24,879 కేసులు నమోదయ్యాయని, 487 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. క్రితం రోజుతో పోలిస్తే 2,127 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి...

25,000.. దేశంలో ఒక్క రోజే అత్యధిక కేసులు


  • కరోనాతో మరో 487 మంది మృతి
  • సామాజిక వ్యాప్తి లేదు.. స్థానిక వ్యాప్తే: కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా ఉధృతమవుతోంది. గురువారం అత్యధిక స్థాయిలో 24,879 కేసులు నమోదయ్యాయని, 487 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. క్రితం రోజుతో పోలిస్తే  2,127 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.  కాగా, పరిస్థితి అంచనాకు ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 5 గంటల వరకు 55 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోదీ నియోజకవర్గం వారాణసీ సహా కాన్పూర్‌, ఝాన్సీల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. 


పశ్చిమబెంగాల్‌లోనూ వైరస్‌ విజృంభిస్తోంది. గురువారం కర్ణాటకలో 2,282 కొత్త కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. తమిళనాడులో తాజాగా 4,231 కేసులు వచ్చాయి. రోజూ 20 వేలపైగా కేసులు నమోదవుతున్నా దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్రం అంటోంది.  కొన్ని ప్రాంతాల్లో ‘స్థానికంగా వ్యాప్తి’తో కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓఎస్డీ రాజేష్‌ భూషణ్‌ ఈ మేరకు అన్నారు. ‘733పైగా జిల్లాలున్న దేశంలో 49 జిల్లాల నుంచే 80 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సామాజిక  వ్యాప్తి ఉందనలేం’ అని రాజేష్‌ భూషణ్‌ అన్నారు. గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి అనే అంశంపై డబ్ల్యూహెచ్‌వో నుంచి నిర్దిష్టమైన సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.


Updated Date - 2020-07-10T07:28:28+05:30 IST