హైటెన్షన్‌!

ABN , First Publish Date - 2021-01-11T07:12:27+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ, ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు సోమవారం ఎలాంటి తీర్పు ఇస్తుందా అని అన్ని వర్గాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

హైటెన్షన్‌!

  • తీర్పు ఎలా వచ్చినా చరిత్రే!
  • షెడ్యూల్‌ విడుదలయ్యాక ఇంతవరకు కోర్టుల జోక్యం లేదు
  • వాయిదా వేయాలన్నా సంచలనమే!
  • అటు ప్రభుత్వ సహాయ నిరాకరణ
  • ఇటు ఎలక్షన్లకే కట్టుబడ్డ ఎస్‌ఈసీ
  • కమిషనర్‌ రమేశ్‌కుమార్‌పై ఉద్యోగ సంఘాల నేతల విమర్శలు
  • సహకరించని యంత్రాంగంపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవచ్చు!
  • అందుకు ప్రభుత్వం నిరాకరిస్తే గవర్నర్‌, రాష్ట్రపతికి ఫిర్యాదు
  • రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం!
  • న్యాయ నిపుణుల మనోగతం

ఓవైపు.. పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందేనంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. మరోవైపు.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థల ఎన్నికలకూ సహకరించేది లేదని భీష్మించుకుని కూర్చున్న వైసీపీ ప్రభుత్వం.. వీరిలో ఎవరి వాదన నెగ్గుతుంది.. ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది సోమవారం తేలే  అవకాశాలు ఉన్నాయి. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది సంచలనమే అవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. సర్కారు సహకరించకపోతే అది చివరకు రాజ్యాంగ సంక్షోభానికి దారితీయొచ్చని ఆందోళన చెందుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠ, ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు సోమవారం ఎలాంటి తీర్పు ఇస్తుందా అని అన్ని వర్గాలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం, ఇప్పుడు జరపలేమని రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకిస్తుండడం.. మంత్రులు, వైసీపీ నేతలు కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండడం.. ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రభుత్వానికి మద్దతిస్తుండడం తదితర పరిణామాలే దీనికి కార ణం. ప్రస్తుత పరిస్థితి నిమ్మగడ్డ వర్సెస్‌ జగన్‌ సర్కారు అన్నట్లుగా మారిపోయింది. నిరుడు కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదావేయడంతో సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం అదేసాకుతో ఎన్నికలు జరుపలేమని వాదిస్తోంది. రాష్ట్రమంతా కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారం దీనిపై ధర్మాసనం విచారణ జరిపి తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి.


ఆ తీర్పు ఎలా వచ్చినా అదొక చరి త్ర అవుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఇం తవరకు చరిత్రలోనే జరగలేదు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు ఆదేశిస్తే.. అది సంచలనమే అవుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. అలా కాకుండా స్థానిక ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్‌ఈసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే.. ఇందుకు సుముఖంగా లేని ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కీలకంగా మారింది. ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ చేస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. 


అంతా ఎస్‌ఈసీ చేతిలోనే...

రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ఎన్నికలను వాయిదా వేసిన సందర్భా లు మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా జరగలేదని నిపుణు లు అంటున్నారు. కరోనా కారణంగా నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసిన విషయం విదితమే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం కోర్టుకెళ్లినా.. ఎస్‌ఈసీ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థించింది. షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది.. ఎన్నికలు వాయిదా వేయాలన్నా, నిలిపివేయాలన్నా.. ఎస్‌ఈసీ చేతిలోనే ఉంది. రెండేళ్ల కింద పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఎస్‌ఈసీకి వ్యతిరేకంగా ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో జరగాల్సిందేనని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల విషయంలోనూ జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  


పోకచెక్కలా ఉద్యోగులు, అధికారులు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ.. ఈ నెల 9వ తేదీ నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చినట్లయింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దలు సహకరించే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని అధికార యంత్రాంగాన్ని కూడా వారు ఆదేశించే అవకాశాలున్నాయని.. ప్రభుత్వ పరిస్థితిని గమనిస్తున్న వారు చెబుతున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి తలెత్తుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన అధికారాలు కలిగి ఉంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్నికల ప్రక్రియకు సహకరించని ఉద్యోగులు, అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవచ్చు. దీంతో వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారవుతుందని నిపుణులు అంటున్నారు.


అధికారాలకు ఎస్‌ఈసీ పదును..

ప్రస్తుత తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ఎన్నికల సంఘం తనకున్న అధికారాలకు పదును పెడుతోంది. గత ఏడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విఫలమైన గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని, ఓ సీఐను సస్పెండ్‌ చేయాలని అప్పట్లో ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రప్రభుత్వం పెడచెవినిపెట్టింది. గుంటూరు రూరల్‌ ఎస్సీని మాత్రం పరిపాలనాపరమైన సర్దుబాట్ల కోసం ఇటీవల బదిలీ చేశారు. మిగతావారిపై ఏ చర్యలూ తీసుకోలేదు. అందుకే కమిషనర్‌ నిమ్మగడ్డ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలని, ఆ అధికారులను బదిలీ చేయాలని మరోసారి గుర్తుచేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించే తీరును బట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ఉంటాయని అంటున్నారు. కాగా.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కొందరు ఎస్‌ఈసీపై అవాకులు చవాకులు పేలారు. ఎన్నికలకు సహకరించబోమని కొంత మంది ఉద్యోగ నేతలు మరో అడుగు ముందుకేసి ప్రకటించారు. మరో సంఘమైతే పరోక్షంగా ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీ వారిపై చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఉద్యోగులంతా తన పరిధిలోకి వచ్చినందున.. గీత దాటిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎస్‌ఈసీ సునిశితంగా పరిశీలిస్తోంది. 


సహాయ నిరాకరణ జరిగితే..

షెడ్యూల్‌ విడుదలైనందున ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టు తీర్పు ఇస్తే తప్ప.. ఎన్నికలు అనివార్యం. ఈ సందర్భంలో రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే ఎస్‌ఈసీ తనకున్న అధికారాలను వినియోగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని.. ఈ ఆదేశాలను అమలు చేయకుంటే గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే జరిగితే రాజ్యాంగ బద్ధ విధుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు అవుతుందని.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగి.. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతుందని ఆందోళన చెందుతున్నారు. కోర్టు తీర్పు ఎవరికి ప్రతికూలంగా ఉన్నా.. వారు మళ్లీ హైకోర్టునో, సుప్రీంకోర్టునో ఆశ్రయించే అవకాశముందని అంటున్నారు.

Updated Date - 2021-01-11T07:12:27+05:30 IST