నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి హైవే..!

ABN , First Publish Date - 2021-10-19T06:32:31+05:30 IST

నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ మీదుగా జగిత్యాల్‌ జిల్లా రాయికల్‌ వరకు రెండుదశల్లో నిర్మించ తలపెట్టిన నేషనల్‌ హైవే నంబర్‌ 61 నిర్మాణ వ్యవహారం ప్రస్తుతం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి హైవే..!
61వ జాతీయ రహదారి

కనకాపూర్‌ టూ ఖానాపూర్‌ రోడ్డుకు ఇంకా లభించని మోక్షం 

ఎన్‌జీటీ ట్రిబ్యునల్‌లో కేసుతో అనుమతులకు జాప్యం 

3వేల చెట్ల నరికివేతపై తీవ్ర అభ్యంతరాలు 

జిల్లాలో ఎన్‌టీజీ కమిటీ పర్యటన 

తలకిందులుకానున్న హైవే అంచనా వ్యయం 

నిర్మల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ నుంచి ఖానాపూర్‌ మీదుగా జగిత్యాల్‌ జిల్లా రాయికల్‌ వరకు రెండుదశల్లో నిర్మించ తలపెట్టిన నేషనల్‌ హైవే నంబర్‌ 61 నిర్మాణ వ్యవహారం ప్రస్తుతం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. దాదాపు రూ.100 కోట్లతో కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు మొదటిదశ కింద నిర్మించ తలపెట్టిన హైవే నిర్మాణ పనులకు మొదటస్టేజ్‌ - 1 కింద అనుమతి లభించింది. అయితే ఈ అనుమతులతో సంబంధిత యంత్రాంగం ప్రాథమిక పనులను మొదలుపెట్టింది. అలాగే రోడ్డుకు ఇరువైపులా గల 3వేల చెట్లను కూడా తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చెట్ల తొలగింపుకు ఎలాంటి అనుమతులు లేని కారణంగా చెట్లను తొలగించడం కుదరలేదు. జాతీయస్థాయిలో ఓ ఇంగ్లీష్‌ దినపత్రిక ఈ హైవే నిర్మాణం కోసం దాదాపు 3వేల చెట్లను తొలగించాల్సి వస్తోందని, దీనిపై అధికారులు కూడా కసరత్తు జరుపుతున్నారంటూ కథనం వెలువడింది. ఈ కథనాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సుమోటోగా స్వీకరించి సంబంధిత యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే వరకు హైవేపనులు మొదలుకావడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. అయితే 3 వేల చెట్లు తొలగించాల్సి వస్తుందన్న  వ్యవహారాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సీరియస్‌గా తీసుకోవడం ఆందోళన రేకేత్తిస్తోంది. చెట్ల తొలగించే అంశంపై ఎన్‌జీటీ తన విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. దీని కోసం గానూ ఎన్‌జీటీ చెట్లు తొలగించే అవకాశం ఉన్న ప్రదేశాలను , అలాగే చెట్ల నరికివేతతో పర్యావరణానికి ఎంత మేరకు నష్టం వాటిల్లనుందన్న అంశాన్ని పరిశీలించేందుకు ఎన్‌జీటీ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం జిల్లాకు కొద్ది రోజుల్లోనే రానున్నట్లు అదికారులు చెబుతున్నారు. ఈ కమిటీ సభ్యులు జిల్లాలోని కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు గల రోడ్డుపై ఉన్న చెట్లను స్వయంగా పరిశీలించనున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు సంబంధించిన నిపుణుల కమిటీ తన తనిఖీ అనంతరం రూపొందించే నివేదిక ఆధారంగానే ఈ హైవే రోడ్డుకు అనుమతుల వ్యవహారం ఆధారపడి ఉందంటున్నారు. ఈ నిపుణుల కమిటీ అందించే నివేదిక ఒకవేళ చెట్ల నరికివేతను వ్యతిరేకించడమే కాకుండా పర్యావరణానికి నష్టం జరగవచ్చని సూచిస్తే ఇక సెకండ్‌స్టేజ్‌ అనుమతి లభించడం కష్టమవుతోందంటున్నారు. కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు మొత్తం 21.1 కిలోమీటర్ల పొడవు ఉండగా ఇందులో నుంచి 7.7 కిలో మీటర్ల భూభాగం అటవీశాఖకు చెందినది. మిగతా 13.4 కిలోమీటర్ల విస్తీర్ణం నాన్‌ఫారెస్ట్‌ ఏరియాగా గుర్తించారు. నాన్‌ఫారెస్ట్‌ ఏరియాలో రోడ్డు నిర్మాణానికి స్టేజ్‌ - 1 పేరిట అనుమతి లబించింది. మిగతా 7.7 కిలోమీటర్ల అటవీభూమికి సంబంధించి అనుమతి లభిస్తే గాని రోడ్డు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టడం సాధ్యం కాదంటున్నారు. 

కీలకం కానున్న నిపుణుల కమిటీ నివేదిక

కాగా అటవీభూమిలో సంబంధిత అధికారుల సూచనతో కాంట్రాక్టర్‌ 3వేల చెట్లను తొలగించాలని మొదట భావించారు. అయితే అంశం జాతీయస్థాయి ఆంగ్లపత్రికల్లో కథనాల రూపంలో వెలువడిన కారణంగా ఎన్‌జీటీ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఈ విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకే కాకుండా వాస్తవాలను తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో మినిస్ర్టీ ఆఫ్‌ ఎన్విరాల్‌మెంటల్‌ ఫారెస్ట్‌ ఆండ్‌ క్లైమెట్‌ చేంజ్‌కు సంబంధించిన ఉన్నతాధికారి, నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌కు సంబందించిన సీనియర్‌ అధికారి, వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన సీనియర్‌ అధికారితో పాటు రాష్ర్టానికి చెందిన పీసీసీఎఫ్‌ అధికారి సభ్యులుగా ఉన్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. కాగా ఈ అధికారుల్లో ఒకరు న్యూఢిల్లీకి చెందిన వారు కాగా మరొకరు డెహ్రాడూన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లోనే జిల్లాలోని కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు గల 7.7 కిలో మీటర్ల అటవీభూమిలో చెట్లను తొలగించే అవకాశం ఉన్న ప్రదేశాలను స్వయంగా పరిశీలించి విచారణ జరపనున్నారు. ఈ విచారణ ఆధారం గా ఉన్నతాధికారులు ప్రత్యేకనివేదిక రూపొందించి అనుమతులపై సిఫారసులు చేయనున్నారు. 

తలకిందులుకానున్న అంచనాలు

కాగా కనకాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు నిర్మించ తలపెట్టిన హైవే రోడ్డు అంచనావ్యయం రూ.100 కోట్లుగా ఖరారు చేశారు. అయితే దాదాపు రెండేళ్ల నుంచి అనుమతుల విషయమై ఊగిసలాట కొనసాగుతున్నందున రూ.100 కోట్ల అంచనాలు నాలుగింతలు కానున్నాయంటున్నారు. ఇప్పటికే దాదాపు రూ.3,4 కోట్ల రూపాయలతో కల్వర్టులు, తదితర నిర్మాణాల కోసం వ్యయం చేశారు. అయితే దాదాపు 7.7 కిలోమీటర్ల అటవీభూమిలో చెట్లను తొలగించాలని తీసుకున్న నిర్ణయం కారణంగా స్టేజ్‌ - 2 అనుమతులు లభించడం లేదంటున్నారు. దీంతో పాటు చెట్ల నరికివేత వ్యవహారం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు చేరుకోవడంతో ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు పనులు చేయడం సాధ్యం కాదంటున్నారు. అయితే మిగతా 13.4 కిలోమీటర్ల నాన్‌ఫారెస్ట్‌ భూమిలో చేపట్టే రోడ్ల పనులకు సైతం చెట్ల తొలగింపు వ్యవహారం ఆటంకాలు కలిగిస్తోందంటున్నారు. ఈ ప్రాంతమంతా కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలో ఉన్న కారణంగా ఎన్‌జీటీ సైతం ప్రతి విషయాన్ని లోతుగా విచారించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దీని కారణంగా హైవే రోడ్డు నిర్మాణ అంచనాలు నాలుగింతలైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్‌జీటీ నిర్ణయం మేరకే పనులు

 నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకే పనులు చేపడతాం. ప్రస్తుతం ఎన్‌జీటీలో కేసు కొనసాగుతున్న కారణంగా అటవీభూమిపై అనుమతి లభించలేదు. కొద్దిరోజుల్లోనే అనుమతి లబించే అవకాశం ఉంది. జాతీయస్థాయి ఉన్నతాదికారుల కమిటీ పర్యటించి నివేదికలు అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా పనులు జరుగుతాయి. 

సుభాష్‌, ఆర్‌ అండ్‌ బీ నేషనల్‌ హైవే డీఈ


Updated Date - 2021-10-19T06:32:31+05:30 IST