జాతీయ రహదారిపై స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2021-07-30T05:12:47+05:30 IST

జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై డీజిల్‌, పెట్రోల్‌, తారు, కిరోసిన్‌ను అక్రమ కొనుగోలు, అమ్మకం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ మలిక గర్గ్‌ హెచ్చరించారు.

జాతీయ రహదారిపై స్పెషల్‌ డ్రైవ్‌
స్వాధీనం చేసుకున్న తారుడబ్బాలు, ఆయిల్‌క్యాన్‌లతో ఎస్‌పీ మలికగర్గ్‌

రూ.9.85 లక్షల విలువ చేసే తారు, డీజిల్‌, కిరోసిన్‌,పెట్రోల్‌ స్వాధీనం

ఎస్‌పీ మలికగర్గ్‌  వెల్లడి

పంగులూరు, జూలై 29 : జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై డీజిల్‌, పెట్రోల్‌, తారు, కిరోసిన్‌ను అక్రమ కొనుగోలు, అమ్మకం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పీ మలిక గర్గ్‌  హెచ్చరించారు. ఆయిల్‌ అక్రమ అమ్మకాలపై ఎస్‌బీ ఫీల్డ్‌ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసిన డీజిల్‌, పెట్రోల్‌, కిరోసిన్‌తో పాటు తారుకు సంబంధించిన వివరాలను ఎస్‌పీ వెల్లడించారు. మండలంలోని రేణంగివరం పోలీస్‌ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎస్‌బీ ఫీల్డ్‌ సిబ్బంది అక్రమ ఆయిల్‌ అమ్మకాలు చేసే వారి నుంచి 1097 లీటర్ల డీజిల్‌, 200 లీటర్ల పెట్రోల్‌, 100 లీటర్ల కిరోసిన్‌, 122 డ్రమ్ముల తారు స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ రూ. 9,85,154 లు ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మార్టూరు, జె.పంగులూరు, మేదరమిట్ల, మద్దిపాడు, ఉలవపాడు మండలాల పరిధిలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు తమ లారీలను ఆపి వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం లారీలో ఉన్న డీజిల్‌ను తీసి అక్రమ అమ్మకందారులకు విక్రయించి అతి తక్కువ ధర ఉన్న కిరోసిన్‌ను లారీ  ట్యాంకర్లలో నింపుకు వెళుతున్నారని, ఇలా కొనుగోలు చేసిన ఆయిల్‌ను వాహనదారులకు మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. అంతేగాక లారీలలో ఆయిల్‌ దొంగతనం చేసే వారినుంచి అక్రమ వ్యాపారులు ఆయిల్‌  తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు మండలాల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 15 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్‌పీ తెలిపారు. ఇలాంటి అక్రమ వ్యాపారం చేసే వారితో శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు నేరాలు చోటు చేసుకున్న  సందర్భాలున్నాయన్నారు. అక్రమంగా ఆయిల్‌ అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయిల్‌ అక్రమదారులపై దాడులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌, ఇంకొల్లు సీఐ పి. సుబ్బారావు, ఇంకొల్లు, యద్దనపూడి ఎస్‌ఐలు చెంచుప్రసాద్‌, చౌదరి పాల్గొన్నారు. 

కోటి మందితో దిశా యాప్‌ నమోదు 

సచివాలయాలలో పనిచేసే మహిళా పోలీసులు ప్రతి మహిళతో దిశాయాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించే పనికి శ్రీకారం చుట్టాలని, కోటి మందికి దిశాయాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం లక్ష్యంగా పనిచేయాలని ఎస్‌పీ మలికగర్గ్‌ సూచించారు. ముందుగా రేణంగివరం పోలీస్‌ స్టేసన్‌ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం  మండలంలో పనిచేసే మహిళా పోలీ్‌సలతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నేరం జరిగినపుడు పోలీస్‌ అధికారులు వచ్చేవరకు ఉన్న ఆధారాలను కాపాడాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎస్‌ఐలకు సమాచారమివ్వాలని, మహిళల భద్రతపై అవగాహన కలిగించాలని సూచించారు.

Updated Date - 2021-07-30T05:12:47+05:30 IST