భారీగా పెరిగిన యూఎస్ విమాన టికెట్ల రేట్లు.. విద్యార్థులపై భారం!

ABN , First Publish Date - 2021-07-21T20:10:43+05:30 IST

అమెరికా వెళ్లే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే మన విద్యార్థులకు షాక్ తగిలినట్లైంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తుండడం, ఇదే సమయంలో భారత్ నుంచి యూఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

భారీగా పెరిగిన యూఎస్ విమాన టికెట్ల రేట్లు.. విద్యార్థులపై భారం!

న్యూఢిల్లీ: అమెరికా వెళ్లే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే మన విద్యార్థులకు షాక్ తగిలినట్లైంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తుండడం, ఇదే సమయంలో భారత్ నుంచి యూఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఇండియాతో పాటు యూఎస్‌లోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాలు వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించాయి. అటు వచ్చే నెల నుంచి యూఎస్‌లోని యూనివర్శిటీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 


ఈ నేపథ్యంలో మొదట విద్యార్థులకు మాత్రమే వీసాలు జారీ చేస్తున్నాయి. ఈసారి భారత విద్యార్థులకు భారీ సంఖ్యలో వీసాలు జారీ అయినట్లు సమాచారం. ఇప్పుడు వీరందరూ అగ్రరాజ్యం వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడం, విమాన సర్వీసులు తక్కువగా ఉండడంతో విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి యూఎస్ వెళ్లేందుకు ఎకానమీ తరగతి టికెట్‌ ధర రూ.60 వేలుగా ఉంటే.. ప్రస్తుతం ఈ ధర రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది. అయితే, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా, ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో మాత్రం ఈ టికెట్‌ ధర రూ.90 వేలుగా ఉంది.

Updated Date - 2021-07-21T20:10:43+05:30 IST