Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండంత విశ్వాసం

రోస్‌హిల్స్‌పై మేరీమాత ఉత్సవం రేపు 

ఏటా డిసెంబరు 8న క్రైస్తవుల పండుగ

ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ

కుల,మతాలకు అతీతంగా పలువురు రాక

విశాఖపట్నం, డిసెంబరు 6: ఒకప్పుడు ఓ ఇంగ్లీష్‌ దొర విడిది ఆ భవనం...నేడు లక్షలాది మంది భక్తులు కొండంత విశ్వాసాన్ని గుండెల్లో నింపుకొని భక్తిప్రపత్తులతో మేరీ మాతను పూజించే ప్రార్థనా మందిరం. విశాఖ నగరం వన్‌టౌన్‌ పాత పోస్టాఫీసు  సమీపంలోని రోస్‌హిల్స్‌ (కొండగుడి) విశాఖ నగరవాసులకు పరిచయం అక్కర్లేని ప్రార్థనా స్థలం. ఇక్కడ కొలువుదీరిన అమలోద్భవి (విశాఖ పురి మేరీమాత) క్రైస్తవులే కాదు, కొందరు క్రైస్తవేతరులు విశ్వాస దేవత.


ఏటా డిసెంబరు 8వ తేదీ కొండపై ఉత్సవ సందడి కనువిందు చేస్తుంది. నవంబరు 29వ తేదీన ఇందుకు శ్రీకారం చుట్టి తొమ్మిది రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు అమలోద్భవి పండుగ ప్రత్యేకం. 155 ఏళ్ల చరిత్ర కలిగిన రోస్‌హిల్స్‌పై అమలోద్భవి మాత దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి విశ్వాసకులు క్యూ కడతారు. కులమతలాలకు అతీతంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర వర్గాలు మేరీమాత దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుతారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు తలనీలాలు, మొక్కుబడులు సమర్పించుకుంటారు.


ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

ఈ ఏడాది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. విశ్వాసకులంతా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని, మాస్క్‌ తప్పనిసరని నిర్వాహకులు స్పష్టం చేశారు. బుధవారం (8న) ఉదయం 4.30 గంటలకు, 5.15 గంటలకు, 6 గంటలకు దేవాలయంలో, గుహవద్ద దివ్యపూజలు నిర్వహిస్తారు. మళ్లీ ఉదయం 10, 11, 12 గంటలకు దివ్యపూజ ఉంటుంది. సాయంత్రం 3 గంటలకు ఆరాధన, 5, 6 గంటలకు దివ్యపూజ ఉంటుంది.


భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణలను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే ఆధ్యాత్మిక వస్తువులు, పుస్తకాలు, తినుబండారాలకు ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విశ్వాసకుల కోసం సమీపంలోని సెయింట్‌ అలోసిస్‌ పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేశారు. కాగా, కొండగుడి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి పాతపోస్టాఫీస్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.   


కొండగుడి పండుగ సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు : ఏడీసీపీ

కొండగుడి ఉత్సవం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఏడీసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విశ్వాసకులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. జగదాంబా జంక్షన్‌ నుంచి వచ్చే విశ్వాసకులు తమ వాహనాల్లో టౌన్‌ కొత్తరోడ్డు వద్ద కుడివైపు మలుపుతిరిగి సీహార్స్‌ జంక్షన్‌ మీదుగా పప్పుల గోదాము వద్దకు చేరుకుని రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్క్‌ చేయాలని సూచించారు.


అలాగే కాన్వెంటు కూడలి నుంచి వచ్చే వాహన చోదకులు పోర్టు మెయిన్‌ గేటు వైపు, ఫిసింగ్‌హార్బర్‌ నుంచి వచ్చే చోదకులు పాతపోస్టాఫీసు మీదుగా వచ్చి గోపాల్‌ ఆటో జంక్షన్‌ వద్ద టర్న్‌ తీసుకుని సీహార్స్‌ జంక్షన్‌ పప్పుల గోదాము వద్దకు చేరుకోవాలని సూచించారు. విశ్వాసకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. భద్రతా ఏర్పాట్లకు 200 మంది పోలీసులను నియమించారు.

Advertisement
Advertisement