కొండ మొదలుకే ఎసరు

ABN , First Publish Date - 2021-09-18T06:10:00+05:30 IST

కొండమొదలుకే ఎసరు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఉంది. 2017లో ప్రభుత్వానికి, ఆదివాసీలకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హైకోర్టులో వేసిన కేసును గిరిజనులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఒప్పందం ప్రకారం 440 మంది నిర్వాసితులకు 426 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని చెప్పినా ఇంతవరకు కదలిక లేకపోవడం గమనార్హం.

కొండ మొదలుకే ఎసరు
కొండపై ఆదివాసీలు వేసుకున్న గుడిసెలు

  • 440 మంది నిర్వాసితులకు 426 ఎకరాల భూమి హుష్‌కాకి
  • ఒప్పందం ప్రకారం హైకోర్టులో కేసు ఉపసంహరించుకున్న ఆదివాసీలు
  • అయినా ఒప్పందం అమలు చేయని ప్రభుత్వం
  • అందుకే వరదలొచ్చినా కదలని గిరిజనులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కొండమొదలుకే ఎసరు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఉంది. 2017లో ప్రభుత్వానికి, ఆదివాసీలకు  మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హైకోర్టులో వేసిన కేసును గిరిజనులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఒప్పందం ప్రకారం 440 మంది నిర్వాసితులకు 426 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని చెప్పినా ఇంతవరకు కదలిక లేకపోవడం గమనార్హం. అందుకే ఎంత పెద్ద వరద వచ్చినా, ఇళ్లన్నీ మునిగిపోయినా, ప్రభుత్వం వరద బాధితులకు చేయవలసిన కనీస సహాయం చేయకపోయినా వారంతా కొండ మీదే ఉండిపోతున్నారు. గత ప్రభుత్వం కొంతమేర వరద సహాయం అయినా చేసేది. వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని ఆదివాసీ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.  

దేవీపట్నం మండలంలో చాలా దూరంలో ఉన్న గ్రామం కొండమొదలు. పోలవరం ముంపు గ్రామాల్లో ఇది ఒకటి. దీని పరిధిలో 11 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 440 కుటుంబాలు ఉన్నాయి. గతంలో లాంచీల మీద ప్రయాణం చేయవలసి వచ్చేది. లాంచీలను ఆపేశారు. అడవిలో సుమారు 45 కిలోమీటర్ల మేర ఓ మార్గం ఉంది. ఇటీవల అదీ  పాడైపోయింది. ఇవాళ కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏదైనా వాహనం దొరికితే దానిని ఎక్కి రంపచోడవరం రావాలి. నిత్యావసర సరుకులు, అధికార పనులు ఏమైనా ఇదే పద్ధతి. ఇవాళ ఆధార్‌ అప్డేషన్‌, కేవైసీ నమోదు కోసం ఇక్కడి  ప్రజలు రంపచోడవరం రావడానికి నరకం అనుభవిస్తున్నారు. తహశీల్దార్‌ కార్యాలయానికైతే గోకవరం వచ్చి అక్కడి నుంచి  ఇందుకూరుపేట వెళ్లాలి. ఇన్ని కష్టాలు పడుతున్నా అక్కడి నుంచి ప్రజలు కదలట్లేదు. దీనికి  కారణం  ఆదివాసీలు, ప్రభుత్వం మధ్యన జరిగిన ఒప్పందం అమలు జరగకపోవడమే.

ఏమిటా ఒప్పందం

ఆదివాసీలు  2017కు ముందు పోరాడి 426 ఎకరాల భూమిని దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు వీరి పక్షాన నిలిచింది.  పోలవరం ప్రాజెక్టు వల్ల ఇక్కడి గ్రామాలన్నీ ఖాళీ చేయవలసి రావడంతో అధికారులు ఈ భూముల్లో లేని గిరిజనేతరుల పేర్లను పరిహారం జాబితాలో చేర్చడంతో ఆదివాసీలు హైకోర్టును  ఆశ్రయించారు. దీంతో భూసేకరణపై  స్టే కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ చేపట్టడం కోసం  2017లో రంపచోడం ఐటీడీఏ అధికారులు, రెవెన్యూ అధికారులు  ఆదివాసీ పెద్దలతో  సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం కొండమొదలు గ్రామ పంచాయతీ పరిధిలోని తాడివాడ, మెట్టగూడెం, పెద్దగూడెం, కొక్కెర గూడెం, కొత్తగూడెం, కత్తనాపల్లి,  సోమర్లపాడు, నడిపూడి, తెలిపేరు తదితర గ్రామాల పరిధిలో 35 ఏళ్లుగా  అనుభవంతో 426 ఎకరాల్లో సేద్యం చేస్తున్న 440మంది నిర్వాసిత కుటుంబాలకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాక ముసురుమిల్లి ప్రాజెక్టు కింద ఓజుబంద, జియ్యంపాలెం, జగ్గంపాలెం, రాజవరం, నేలదోనెలపల్లి,  ఫోక్స్‌పేట, యర్రంపాలెం గ్రామాల్లో వారు ఎంచుకున్న చోటే భూములు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలోని బెనిఫిట్స్‌ అన్నీ అర్హత ప్రకారం ఇవ్వడానికి కూడా ఒప్పందం కుదిరింది. అంతేకాక వారు సేద్యం చేసుకుంటున్న 150 ఎకరాలకు కూడా పరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఆదివాసీలు హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మాత్రం ఒప్పందాన్ని అమలు చేయట్లేదు. దీంతో ఒప్పందం ప్రకారం అన్నీ అమలు చేసిన తర్వాతే తాము ఇక్కడి నుంచి కదులుతామని కొందమొదలు ప్రజలు భీష్మించుకుని కూర్చున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో కొండల మీద గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి మరి.

Updated Date - 2021-09-18T06:10:00+05:30 IST