ఏదో ఒకరోజు సీఎం అవుతానని మీ అమ్మకు చెప్పు.. కాలేజీ రోజుల్లో భార్యతో చెప్పిన హిమంత!

ABN , First Publish Date - 2021-05-11T03:09:17+05:30 IST

‘‘మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రిని అవుతానని..’’ అసోం కొత్త సీఎం హిమంత బిశ్వ శర్మ తన కాలేజీ రోజుల్లో రినికి భూయాన్‌ అనే అమ్మాయికి ...

ఏదో ఒకరోజు సీఎం అవుతానని మీ అమ్మకు చెప్పు.. కాలేజీ రోజుల్లో భార్యతో చెప్పిన హిమంత!

గువహటి: ‘‘మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రిని అవుతానని..’’ అసోం కొత్త సీఎం హిమంత బిశ్వ శర్మ తన కాలేజీ రోజుల్లో రినికి భూయాన్‌ అనే అమ్మాయికి చెప్పిన మాటలివి.. ఆమే తర్వాత ఆయన జీవిత భాగస్వామి అయ్యారు. గువహటిలోని కాటన్ కాలేజీలో హిమంత చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజం కావడంతో.. రినికి భూయాన్ నాటి జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే హిమంత అందరి దృష్టిని ఆకర్షించేవారనీ.. భవిష్యత్తులో ఏదో ఒకటి చేయాలన్ని తపన ఆయనలో కనపించేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంకి 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మేము తొలిసారి కలుసుకున్నప్పుడు ఆయనకు 22 ఏళ్లు. నాకు 17 సంవత్సరాలు. ఆయన భవిష్యత్తు గురించి అడిగితే నేను మా తల్లికి ఏం చెప్పాలని అడిగాను. నేను అసోంకి ముఖ్యమంత్రిని అవుతానని ఆమెతో చెప్పు- అన్నారు. ఈ మాట వినగానే తొలుత ఆశ్చర్యానికి గురయ్యాను. అయితే ఆయనకంటూ స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయనీ.. బలమైన సంకల్పంతో రాష్ట్రం కోసం కలలు కంటున్నారనీ తర్వాత అర్థమైంది...’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. 


‘‘ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు పెళ్లైంది. తర్వాత ఆయన మంత్రి అయ్యారు. ఇక నాటి నుంచి రాజకీయాల్లోనే జీవితం సాగుతోంది. కానీ ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే... ఆ దృశ్యాన్ని నేను నమ్మలేకపోయాను..’’ అని భూయాన్ పేర్కొన్నారు. గత రాత్రి ఆయన తనకు సీఎం పదవి వచ్చిందని చెప్పినా తాను నమ్మలేకపోయానన్నారు. ‘‘గత రాత్రి ఆయన నాతో మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి హోదాలో..’’ అన్నారు. ‘‘ఎవరు?’’ అన్నాను. ‘‘నేనే’’ అని ఆయన అన్నారు. అయితే నేను ఎప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా ఊహించుకోలేదు. ఎప్పుడు నాకు హిమంతగానే కనిపిస్తారు. ముఖ్యమంత్రి హిమంత అని అర్థం చేసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది’’ అంటూ ఆమె నవ్వులు చిందించారు. 


హిమంత శర్మ సతీమణి ప్రస్తుతం మీడియా వ్యవస్థాపకురాలిగా కొనసాగుతున్నారు. వీరికి 19 ఏళ్ల కుమారుడు నందిల్ బిశ్వ శర్మ, 17 ఏళ్ల సుకన్య శర్మ ఉన్నారు. హిమంత గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కాటన్ కాలేజీలోనే సాగింది. ప్రభుత్వ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ చదివిన ఆయన.. గువహటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 


Updated Date - 2021-05-11T03:09:17+05:30 IST