నేటి నుంచి హిందూపురంలో సడలింపు

ABN , First Publish Date - 2020-06-01T10:01:48+05:30 IST

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన హిందూపురంలో సోమవారం నుంచి కొన్ని ప్రాంతాలకు లాక్‌డౌన్‌

నేటి నుంచి హిందూపురంలో సడలింపు

కొన్ని ప్రాంతాలకే వర్తింపు 

9 నుంచి ఒంటిగంట వరకు నిత్యావసర సరుకుల షాపులకే 


హిందూపురం టౌన్‌, మే 31 : కరోనా హాట్‌స్పాట్‌గా మారిన హిందూపురంలో సోమవారం నుంచి కొన్ని ప్రాంతాలకు లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇస్తున్నట్లు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి,  అదనపు ఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ఆదివారం రాత్రి వారు మునిసిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో 18 ప్రాంతాలకు సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు.  ఉదయం 9నుంచి ఒంటి గంట వరకు మాత్రమే షాపులు తెరుచుకోవచ్చని అందులో కూడా నిత్యావసర సరుకులు, హార్డ్‌వేర్‌కు సంబంధించి షాపులు తెరువవచ్చన్నారు.


ఈ సమయంలో కేంద్రం సడలించిన నిబంధనలు వర్తిస్తాయన్నారు. అయితే దుకాణాల వద్దకు వచ్చేవారి వివరాలు, ఫోన్‌నంబర్లు నమోదు చేసుకోవాలని, మాస్కు ధరించి వస్తేనే నిత్యావసర సరుకులు అందించాలన్నారు. లేదంటే వినియోగదారుడికి జరిమానా విధించి సంబంధి త షాపును సీజ్‌ చేస్తామన్నారు. దుకాణాలకు వచ్చేవారు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లను దుకాణదారులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 65ఏళ్ల పైబడిన వారు, 10 ఏళ్లలోపు వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు తున్నవారు బయటికి రాకూడదన్నారు.


కంటైన్మెంట్‌ జోన్ల నుంచి సడలించిన ప్రాంతాలివే

 1వ వార్డులోని ఎస్సీకాలనీ, చౌడేశ్వరీకాలనీ-1, ఆబాద్‌ పేట, ధర్మపురం-1, 8, 9, 10 వార్డులైన శ్రీకంఠపురం, లక్ష్మీపురం, డీఆర్‌కాలనీ, 13వ వార్డు సడ్లపల్లి, హౌసింగ్‌ బోర్డు కాలనీ, కోట ఏరియా -1, బోయపేట, ఇందిరానగర్‌, నింకంపల్లి -1, మోతుకపల్లి, దండురోడ్డు, అరవిందనగర్‌, ముద్దిరెడ్డిపల్లి, సింగిరెడ్డిపల్లి, ప్రాంతాలలో సడలింపులు ఇచ్చామని తెలిపారు. త్యాగరాజ్‌నగర్‌, మోడల్‌కాలనీ-2, సత్యనారాయణపేట, ఢంకా, టిప్పుఖాన్‌స్ర్టీట్‌, ఆజాద్‌నగర్‌, అంబేడ్కర్‌నగర్‌ ప్రాంతాలు పూర్తి కంటైన్మెంట్‌జోన్లుగా ఉన్నాయని తెలిపారు.


మిగిలిన ప్రాంతాల్లో కూడా కేసులు రాకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తామన్నారు.  కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్‌బాషా, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ము నిసిపల్‌ కమిషనర్‌ భవనీప్రసాద్‌, సీఐలు మన్సూరుద్దీన్‌, బాలమద్దిలేటి, శ్రీనివాసులు, ధరణికిషోర్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T10:01:48+05:30 IST