Abn logo
Aug 2 2020 @ 02:37AM

షిప్‌యార్డుకు ఘన చరిత్ర!

  • 72 ఏళ్ల క్రితం ప్రధాని నెహ్రూతో తొలి నౌక జలప్రవేశం
  • 3 రకాల సబ్‌మెరైన్ల రిపేరు సామర్థ్యం దీని ప్రత్యేకత
  • 191 నౌకల నిర్మాణం.. 2వేల నౌకలకు మరమ్మతులు

విశాఖపట్నం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ నిర్మించిన తొలి నౌక జల ఉషను 1948 మార్చి 14న అప్పటి ప్రధాని నెహ్రూ చేతులమీదుగా జలప్రవేశం చేయించారు. దేశంలో మూడు రకాల సబ్‌మెరైన్లకు రిపేరు చేయగల సామర్థ్యం కలిగిన షిప్‌యార్డు ఇదొక్కటే.. ఇప్పటివరకు ఈ షిప్‌యార్డులో 191 నౌకలను నిర్మించారు. రెండు వేలకు పైగా నౌకలు, సబ్‌మెరైన్లకు మరమ్మతులు నిర్వహించారు. భారత నౌకదళానికి అవసరమైన యుద్ధనౌకలు, గస్తీనౌకలు, సర్వే నౌకలతోపాటు కోస్టుగార్డుకు అవసరమైన పెట్రోలింగ్‌ వెసల్స్‌ను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. సముద్రంలో డ్రిల్లింగ్‌, డ్రెడ్జింగ్‌ చేసే నౌకలను షిప్‌యార్డు తయారు చేసి.. ఓఎన్‌జీసీ, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఇస్తుంటుంది. ఇటీవలే సింధువీర్‌ సబ్‌మెరైన్‌కు రూ.500 కోట్లతో రీఫిట్‌ పనులు పూర్తి చేసి అందించింది. కాగా, చాలాకాలం నుంచి సరైన ఆర్డర్లు లేక నష్టాల్లో ఉన్న సంస్థను.. సీఎండీగా శరత్‌బాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒడ్డుకు చేర్చారు. రక్షణ శాఖ నుంచి ఆర్డర్ల కోసం ప్రైవేటు సంస్థలతో పోటీ పడి మరీ కొన్నింటిని సాధించారు. ఆయన ఇంకో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Advertisement
Advertisement
Advertisement