హిందూస్థానీ సంగీతం

ABN , First Publish Date - 2020-06-05T06:00:45+05:30 IST

ఆయన కేమి? ఆయన ధన్యజీవి. ఆయన సంగీత కళను ఆరాధించారు. ఆ తల్లి ఆయనను కటాక్షించింది. నవ యౌవనంలోనే మహా విద్వాంసుడుగా ఆయనకు పేరు వచ్చింది. ప్రజలు ఆదరించారు. గౌరవించారు. ప్రభుత్వాలు అభిమానించాయి. సత్కరించాయి...

హిందూస్థానీ సంగీతం

ఆయనది స్థూలకాయం, గండు మఖం, బుగ్గ మీసాలు, చుడీదార్ పైజమాపైన లక్నో చికాణ్ అల్లికలున్న లాల్చీ వేసుకునేవారు. ఏ ముల్తానీ రాగంలోనో ఆయన ఒక ఖయాల్ పాడినా, తమ సమ్ముఖంలోని గాయకుని మూర్తిని సభికులు మరచిపోయేవారు, తమను తామే మరచిపోయేవారు.


ఆయన కేమి? ఆయన ధన్యజీవి. ఆయన సంగీత కళను ఆరాధించారు. ఆ తల్లి ఆయనను కటాక్షించింది. నవ యౌవనంలోనే మహా విద్వాంసుడుగా ఆయనకు పేరు వచ్చింది. ప్రజలు ఆదరించారు. గౌరవించారు. ప్రభుత్వాలు అభిమానించాయి. సత్కరించాయి. ఇంతటి ధన్యజీవి కాబట్టి, ఎట్టి వెలితి మనస్సులో లేకుండానే ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ నిన్న హైదరాబాద్‌లో కన్నుమూసివుండాలి. కాగా, వెలితి మన సంగీత ప్రపంచంలోనే. రసిక జనహృదంతరాళాలలోనే. ఆ వెలితి ఇంతలో తీరదు. బహుశా ఎంతలోనూ తీరదు. హిందూస్తానీ సంగీతంలో ఆయనకు ఆయనే సాటి.


హిందూ మహమ్మదీయ మతాలు భిన్నమైనవి కాబట్టి, ఆ మతస్థుల సంస్కృతులు భిన్నమైనవి కాక తప్పదని వాదించింది ఒక్క మహమ్మదాలీ జిన్నా మాత్రమే కాదు; ఒక వినాయక్ దామోదర్ సావర్కార్ మాత్రమే కాదు. అట్టివారు పెక్కుమంది ఇదివరలో వున్నారు. ఇప్పుడు కూడావున్నారు. ఈ వాద తిరస్కృతికి ప్రధానంగా పేర్కొనదగింది హిందూస్తానీ సంగీతమే. కర్ణాటక సంగీతం అన్య ప్రభావాలను కొన్నింటిని అంతర్లీనం చేసుకొనడం ద్వారా రూపొందినట్టిదే హిందూస్తానీ సంగీతం. హిందువుల వలె, మహ మ్మదీయులు భక్తి శ్రద్ధలతో పరిపోషించడం ద్వారా పరిఢవిల్లినట్టిదే హిందూస్తానీ సంగీతం. 


కేవలం సంగీతంలోనే కాదు, చిత్ర వాస్తుకళలలో కూడా హిందూ ముస్లిం ప్రభావాల సమ్మేళనం ద్వారా కొత్త బాణీలు తలయెత్తాయి. ఇట్టి పరిణామాలకు దోహదం కూర్చినప్పుడే జాతి, మత, కుల విభేదాలకు అతీతమైన సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పెంపొందుతుంది. మనం లక్షించవలసిన, సాధించవలసిన ఈ సర్వాంగ సుందర భారతీయ సంస్కృతి పరిపోషణకై తన జీవితాన్ని సంగీత కళారంగంలో ధారవోసిన మహామహుడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్. అఫ్ఘానిస్తాన్ రాజు ఆయన సంగీతానికి ముగ్ధుడై తన ఆస్థాన సంగీత విద్వాంసుడుగా వుండిపోవలసిందిగా ఆయనను అభ్యర్థించాడు. కాని, భారతదేశం పట్ల ప్రేమతో ఆ పదవిని స్వీకరించడానికి ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సమ్మతించలేదు.


తాను జన్మించింది భారతదేశంలో, సంగీత విద్యలో పాండిత్యాన్ని గడించింది భారతదేశంలో, అందువల్ల భారతదేశానికే సేవచేస్తూ అక్కడనే కన్నుమూయడం తనకు భావ్యమని ఆయన విశ్వసించారు, అంతే చేశారు. ఆయనది స్థూలకాయం, గండు మఖం, బుగ్గ మీసాలు, చుడీదార్ పైజమా పైన లక్నో చికాణ్ అల్లికలున్న లాల్చీ వేసుకునేవారు. ఏ ముల్తానీ రాగంలోనో ఆయన ఒక ఖయాల్ పాడినా, తమ సమ్ముఖంలోని గాయకుని మూర్తిని సభికులు మరచిపోయేవారు, తమను తామే మరచిపోయేవారు. ‘సంగీతమే నాకు శ్వాస, సంగీతమే నాకు సర్వస్వం, సంగీతం లేకపోతే నా జీవితం దుర్భరం. సరిగమలను పలుకుతూనే కన్ను మూయాలని నా కోర్కె’ అని ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ ఆ మధ్య ఒక సందర్భంలో చెప్పారు. ఆ సప్తస్వరాలను పైకి కాకపోయినా మనస్సులో పలుకుతూ ఆయన నిన్న కన్ను మూసి వుండాలి.

1968 ఏప్రిల్ 25 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘ఉస్తాద్ బడే గులాం అలీఖాన్’ నుంచి

Updated Date - 2020-06-05T06:00:45+05:30 IST