చరిత్ర వేట

ABN , First Publish Date - 2020-09-10T06:31:47+05:30 IST

మాజీప్రధాని పి.వి. నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ, తెలంగాణ శాసనసభ మంగళవారం నాడు తీర్మానం చేసింది. ఆరునెలల...

చరిత్ర వేట

మాజీప్రధాని పి.వి. నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ, తెలంగాణ శాసనసభ మంగళవారం నాడు తీర్మానం చేసింది. ఆరునెలల తరువాత అనేక సమస్యల మధ్య సమావేశమవుతున్న చట్టసభలలో ఈ తీర్మానాన్ని రెండో రోజునే ప్రవేశపెట్టి, ఆమోదింపజేయడం వెనుక ప్రభుత్వానికి ఈ విషయంలో ఉన్న పట్టింపు అర్థమవుతుంది. పి.వి. నరసింహారావు 99వ జయంతి నాటి నుంచి ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించడం, అందుకోసం ఒక కమిటీ ఏర్పడి వేగంగా పనిచేయడం, రకరకాల కార్యక్రమాలను నిర్వహించడం– అందరికీ తెలిసిన పరిణామాలే. తాజాగా శాసనసభ తీర్మానం ఆ క్రమాన్ని మరింత బలపరిచింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పి.వి. పేరు పెట్టాలని కూడా తీర్మానంలో కోరారు. 


ఒకానొక చారిత్రక సందర్భంలో పి.వి. నిర్వహించిన పాత్రకు, మొత్తంగా సుదీర్ఘమైన రాజకీయ జీవితానికి, వ్యక్తిగతంగా ఆయనలోని పాండిత్యానికి– ఎన్ని బిరుదాలనైనా ఇవ్వవచ్చు. భారతరత్నకు ఆయన అర్హుడు కారని ఎవరూ అనలేరు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తుంటే, ఆ పార్టీకి వ్యవస్థాపకులు పి.వి.యేనేమో అని తెలియనివారికి అనుమానం కలుగుతుంది. నరసింహారావు ప్రత్యేక తెలంగాణవాది కారు అన్న సంగతి తెలిసిందే. తొలి దశ తెలంగాణ ఉద్యమం అనంతరం, నాటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన పి.వి. నరసింహారావు, బలమైన జై ఆంధ్ర ఉద్యమం కారణంగా కొద్దికాలానికే రాజీనామా చేయవలసి వచ్చింది. ఉన్న కొద్దికాలంలో చేసిన భూసంస్కరణల కారణంగా కూడా ఆయనకు రాజకీయ శత్రువులు పెరిగిపోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక, ఆయన కార్యస్థానం దేశ రాజధానికి మారిపోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమంపై ఎక్కడా ఆయన అభిప్రాయం చెప్పలేదు. కేవలం తెలంగాణకు చెందిన వ్యక్తిగానే పరిగణించి తెలంగాణ ప్రభుత్వం ఆయనను గౌరవిస్తున్నదా? అది ఒక కారణం కావచ్చును. కాంగ్రెస్‌ పార్టీ పి.వి.తో అమర్యాదగా వ్యవహరించడం ముఖ్యమైన కారణం. తన రాజకీయ ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడానికి పి.వి. స్మరణ పనికి వస్తుందని కెసిఆర్‌ భావిస్తూ ఉండవచ్చు.


పి.వి. నరసింహారావు స్మృతిని కైవసం చేసుకోవడానికి బిజెపి కూడా ప్రయత్నించింది. సర్దార్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ చరిత్ర నుంచి తప్పించి, తమ ఖాతాలోకి విజయవంతంగా మళ్లించగలిగిన బిజెపికి, నరసింహారావు కూడా ఒక లక్ష్యం అయ్యారు. ఆయన హయాంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరగడం, ఆర్థిక సంస్కరణలు అమలుజరపడం, మితవాద రాజకీయాలపై పెద్దగా వ్యతిరేకత లేదన్న అభిప్రాయం ప్రచారంలో ఉండడం–ఇవన్నీ పి.వి.ని అభిమానించడానికి బిజెపికి కారణాలయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా పి.వి.కి పెద్దగా జనామోద ప్రఖ్యాతి లేకపోవడం వల్ల, పటేల్‌ వల్ల కలిగినంత ప్రయోజనం రాదన్న ఎరుక కూడా ఆ పార్టీకి ఉన్నది. ఇంతలో పి.వి. జన్మప్రాంతం తెలంగాణయే ఆయన స్మృతిపై అధికారాన్ని ప్రకటించుకోవడంతో, పోటీ నుంచి బిజెపి వైదొలగవలసి వచ్చింది. జాతీయసంస్థగా కాంగ్రెస్‌ వంశావళిలో ఉన్నంతమంది నేతలు తమ పరంపరలో లేరన్న బాధ బిజెపికి ఉన్నది. తగినంత చరిత్ర లేకపోవడం రాజకీయపక్షాలను చాలా బాధిస్తుంది. 


భారతీయ జనతాపార్టీకి తెలంగాణ విషయంలో ఆసక్తి, అవకాశాలూ ఉన్నాయి కానీ, చరిత్ర లేదు. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉండడం వల్ల మతపరమైన సమస్యలు, వాటిని ఆధారం చేసుకుని చేయగలిగే రాజకీయాలు ఉంటాయి. కానీ, తెలంగాణ అంటే నిజాం వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, విప్లవ పోరాటాలు–ఇట్లా చెప్పుకుంటారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో కలసి పనిచేసిన చరిత్ర ఉన్నది కానీ, నిజాం పాలన నాటికి బిజెపి లేకపోగా, దాని పూర్వ రూపాలు కూడా తెలంగాణలో లేవు. అందుకని ఇప్పుడు తెలంగాణలో చరిత్రను తమ ఖాతాలోకి మళ్లించుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. సెప్టెంబర్‌ 17 సమీపిస్తున్నందున, అధికారిక విమోచన దినం కోసం ఉద్యమించాలని కోరుతూ బిజెపి నేతలు చేస్తున్న పర్యటనలు, దర్శిస్తున్న ప్రాంతాలు, సన్మానిస్తున్న వ్యక్తులు అన్నీ, అందరూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రాంతాలు, ఆ ఉద్యమకారుల కుటుంబాలు. నిజానికి, ఆనాడు నిజాముకు, ఆయనకు అండగా ఉండిన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వారెవరూ మతప్రాతిపదికతో పోరాడలేదు. పైగా, పోరాటంలో ఎందరో ముస్లిములున్నారు, శత్రు శిబిరంలో హిందూ భూస్వాములున్నారు. కానీ, ఆనాటి చరిత్రను ఒక మతస్థుని పాలనపై ఇతర మతస్థుల పోరాటంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.


దురదృష్టకరమైన ఆ ప్రయత్నం కంటె, మరింత విషాదం ఏమిటంటే, తమ చరిత్రను తన్నుకుపోతుంటే, కమ్యూనిస్టులు నిస్సహాయులుగా మిగిలిపోవడం. వారెంతగా చరిత్రావశిష్టులుగా మిగిలిపోయారంటే, ఆ మిగిలిన ప్రతిష్ఠను కూడా ఇతరులకు అప్పగిస్తున్నారు. పటేల్‌ను, పి.వి.ని కోల్పోయిన కాంగ్రెస్‌ కంటె ఈ కమ్యూనిస్టుల పరిస్థితి మరింత దయనీయం, అధ్వాన్నం. 


ఎవరి చరిత్రను వాళ్లు కాపాడుకోవాలి. లేకపోతే, మరెవరో వచ్చి చరిత్రను అపహరిస్తారు. పి.వి. నరసింహారావును తమ చరిత్రలో భాగం చేసుకోవడం ద్వారా కెసిఆర్‌ పి.వి. చరిత్రలో తనను భాగం చేసుకుంటున్నారు. నిజామును పోరాడిన గతం, స్వయంగా భూస్వామి అయి కూడా భూన్యాయం చేసిన గతం, తీవ్రత లేని మితవాదపు గతం– అన్నీ రేపు కాంగ్రెస్‌నే కాదు, బిజెపిని ఎదుర్కొనడానికి కూడా ఉపయోగపడతాయని ఆయన ఉద్దేశ్యం కావచ్చు.

Updated Date - 2020-09-10T06:31:47+05:30 IST