హితోపదేశం

ABN , First Publish Date - 2020-03-22T09:07:46+05:30 IST

విభీషణుడు పుట్టింది రాక్షస వంశంలోనే అయినా అతనికి రాక్షసబుద్ధులు అబ్బలేదు. పైగా సత్వగుణ సంపన్నుడిగా, యథార్ధవాదిగా, ధర్మాత్ముడిగా...

హితోపదేశం

విభీషణుడు పుట్టింది రాక్షస వంశంలోనే అయినా అతనికి రాక్షసబుద్ధులు అబ్బలేదు. పైగా సత్వగుణ సంపన్నుడిగా, యథార్ధవాదిగా, ధర్మాత్ముడిగా విభీషణుడు పేరు పొందాడు. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించాలని, అమితబల పరాక్రమవంతుడైన శ్రీరాముణ్ణి యుద్ధంలో ఓడించలేమని, రాక్షసజాతికి, లంకానగరానికి హాని తలపెట్టే విధంగా ప్రవర్తించవద్దని రావణునికి హితోపదేశం చేశాడు. అయినా రావణుడు వినిపించుకోలేదు. శ్రీరామదూతయైున హనుమంతుడు లంకలో ప్రవేశించి అశోకవనాన్ని విధ్వంసం చేసి కొంతమంది రావణపుత్రులను, మంత్రికుమారులను సంహరించినందుకు రావణుడు ఆగ్రహోదగ్రుడై హనుమంతుని వధించమని ఆజ్ఞాపించాడు. దూతవధకు పూనుకోవడం సముచితం కాదని, హద్దుమీరిన దూతను శిక్షించే పద్ధతులను వివరించి రావణుని శాంతింపజేశాడు విభీషణుడు.


దాంతో ప్రత్యక్షంగా రాక్షసజాతి హితానికి, పరోక్షంగా హనుమంతుని క్షేమానికి కారకుడయ్యాడు. రావణుడేమో విభీషణుని నిండుసభలో పరిపరి విధాలుగా అవమానించాడు. చివరకు విభీషణుడు ‘‘ఓ లంకాధిపా! నీ మనసుకు నచ్చేవిధంగా మాట్లాడేవారు అందరూ నీకు ప్రమాదాన్ని కలిగించే వారే. నీ మేలు కోరుతున్ననన్ను అవమానిస్తున్నావు. నీవు శౌర్య పరాక్రమాలు కలవాడవు. బలవంతుడవు, అస్త్రవిద్యలో ఆరితేరినవాడవు, యుద్ధవిద్యలలో నేర్పు కలవాడవు. ఎన్నెన్నో విజయాలను సాధించావు. కానీ కామక్రోధాలకు వశుడవై తప్పులు చేశావు. అందువల్ల రామబాణ ప్రవాహంలో ఇసుక వంతెన వలె కొట్టుకొనిపోయే పరిస్థితి నీకు ఏర్పడింది.’’ అని రావణునితోచెప్పాడు.


  • ‘‘శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే
  • కాలభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః

‘‘ఓ జ్యేష్ఠ సోదరా! నీకు కష్టకాలము దాపురించినది. నీ మేలు కోరి నేను చెప్పేమాటలను పెడచెవిన పెడుతున్నావు. నిన్ను, ఈ లంకానగరాన్ని, రాక్షస సమూహాన్ని వదలి వెళుతున్నాను’’ అని తెలిపి విభీషణుడు ధర్మరక్షకుడైన శ్రీరాముణ్ణి ఆశ్రయించాడు.

దుర్బుద్ధితో సోదరుని పక్షాన్ని వదలి పరపక్షాన్ని ఆశ్రయించి స్వధర్మాన్ని విస్మరించి రాక్షస జాతి వినాశనానికి ప్రయత్నిస్తున్నావని రావణ పుత్రుడైన ఇంద్రజిత్తు నిందించాడు. 


‘‘వేదాధ్యయనం, గొప్పనైన తపశ్శక్తి, శస్త్రాస్త్ర నైపుణ్యం వంటి సద్గుణాలు రావణునిలో ఉన్నప్పటికీ విషం కలసిన భోజనంలో ఎన్ని రుచికర పదార్థాలున్నా అవి ఎలా నిష్ప్రయోజనమో ఆత్మవినాశకరమైన దోషాలతో కూడిన రావణుని గుణాలు కూడా నిరుపయోగంగా మారాయనే సత్యాన్ని తెలుసుకో. ధర్మ మార్గావలంబిని అయిన నేను ధర్మమూర్తియైున శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించాను నాలో ఏ స్వార్థచింతనా లేదనే సత్యాన్ని గ్రహించకుండా నన్ను నిందించడం సరికాదు’’ అంటూ ఇంద్రజిత్తుకు విభీషణుడు సదుపదేశం చేశాడు. విభీషణోపదేశములు ఆనాటి వారికే కాక క్షమార్హములు కాని దోషాలను చేసే నేటి వారందరికీవర్తిస్తాయనడంలో ఏ సందేహమూ లేదు. మనం శ్రీరాముడి గుణాలను ఆదర్శంగా గ్రహిస్తూ, రావణుని దోషాలను అనుసరించకుండా మన జీవితాలకు ఒక సార్థకతను సాధించుకుందాం.

- సముద్రాల శఠగోపాచార్యులు

Updated Date - 2020-03-22T09:07:46+05:30 IST