కూలిన హెచ్చెల్సీ వంతెన

ABN , First Publish Date - 2022-01-18T06:40:36+05:30 IST

మండలంలోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) 115-167వ కిలోమీటర్‌ వద్ద సోమవారం మల్లికేతి వంతెన కూలి.. మహిళా కూలీల వ్యాన అందులో చిక్కుకుంది.

కూలిన హెచ్చెల్సీ వంతెన

మహిళా కూలీ గల్లంతు... ఆమె కుమార్తె సహా 29 మంది సురక్షితం

బొమ్మనహాళ్‌, జనవరి 17: మండలంలోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) 115-167వ కిలోమీటర్‌ వద్ద సోమవారం మల్లికేతి వంతెన కూలి.. మహిళా కూలీల వ్యాన అందులో చిక్కుకుంది. ఓ మహిళా కూలీ కాలువ నీటిలో గల్లంతు కాగా.. ఆమె కుమార్తె సహా 29 మంది సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామానికి చెందిన 30 మంది వ్యవసాయ కూలీలు మినీ వ్యానలో సోమవారం హెచ్చెల్సీ అవతల వున్న వేరుశనగ పొలంలో కలుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వ్యాన.. హెచ్చెల్సీ వంతెన దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. వ్యాన కాలువలో ఇరుక్కుపోయింది. కూలీల తోపులాటలో ఉద్దేహాళ్‌ గ్రామానికి చెందిన బోయ సావిత్రి (34) కాలువలో గల్లంతైంది. కూలీలు కేకలు వేయడంతో సమీప పొలాల్లోని రైతులు పరిగెత్తుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూలీలను ఒడ్డుకు లాగారు. డ్రైవర్‌ వన్నూరుస్వామి కూడా బయటపడ్డాడు. గల్లంతైన సావిత్రి కూతురు గంగమ్మ కూడా తల్లితో కలిసి పనులకు వెళ్లింది. కళ్లెదుటే తల్లి సావిత్రి గల్లంతవడంతో కూతురు గంగమ్మ కన్నీరుమున్నీరైంది. విషయం తెలుసుకున్న డీ హీరేహాళ్‌ ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కూలీలతో వివరాలు సేకరించారు. కాలువలో గల్లంతైన సావిత్రి కోసం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. సావిత్రికి భర్త వరదరాజులు ఉన్నాడు. 

Updated Date - 2022-01-18T06:40:36+05:30 IST