నేటి నుంచి పాఠశాలలకు సెలవు

ABN , First Publish Date - 2021-04-20T04:43:30+05:30 IST

కరోనా వైరస్‌ రెండోదశ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు అమలు చేయనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం ప్రకటించారు.

నేటి నుంచి పాఠశాలలకు సెలవు
ప్రత్యేక బస్సులో స్వగ్రామాలకు పయనమవుతున్న విద్యార్థులు

- 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు అమలు
గుజరాతీపేట, ఏప్రిల్‌ 19 :
కరోనా వైరస్‌ రెండోదశ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు అమలు చేయనుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం ప్రకటించారు. జిల్లాలో 2,362 ప్రాథమిక, 419 ప్రాథమికోన్నత, 493 ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 119 ప్రాథమిక, 198 యూపీ, 237 హైస్కూళ్లు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తంగా 3,77,592 మంది విద్యార్దులు చదువుతున్నారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. గత మార్చిలోనే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పదోతరగతి పరీక్షలను సైతం రద్దు చేసింది. జూన్‌లో పునఃప్రారంభించాల్సిన పాఠశాలలను.. కరోనా ప్రభావంతో వాయిదా వేసింది. నవంబరు నుంచి విడతల వారీగా పాఠశాలలు తెరిచింది.  కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ.. తరగతులు నిర్వహిస్తోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9 తరగతులు, మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతులకు బోధన చేపడుతోంది. పదోతరగతి విద్యార్థులకు మాత్రం క్రమంగా తరగతులు నిర్వహిస్తోంది. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా భారిన పడుతున్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడం లేదు. తాజాగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతుండడంతో ప్రభుత్వం 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి సెలవులు ప్రకటించింది. పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను మాత్రం షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలని యోచిస్తోంది.

విద్యార్థుల ఇంటిబాట
మెళియాపుట్టి: ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఇంటిబాట పట్టారు. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలలకు వచ్చి తమ పిల్లలను తీసుకెళ్లారు.
 
స్వగ్రామాలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో తరగతులను సోమవారం నుంచి రద్దు చేసేశారు. కొద్దిరోజుల కిందట పీయూసీ-2 విద్యార్థులను పంపించేయగా, తాజాగా పీయూసీ-1 విద్యార్థులను స్వగ్రామాలకు పంపించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా రెండోదశ వ్యాప్తి క్యాంపస్‌లో మొత్తం తరగతులన్నీ రద్దుచేసి, ఆన్‌లైన్‌ తరగతులకే ప్రాఽధాన్యం ఇస్తున్నారు. పీయూసీ-1 విద్యార్థుల్లో బాలికలు 504 మంది, బాలురు 591 మంది ఉన్నారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తామని డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జగదీశ్వరరావు తెలిపారు. కాగా ఇటీవల కొవిడ్‌ బారిన పడిన విద్యార్థులకు రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకొని క్యాంపస్‌కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, ఎచ్చెర్ల పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వడ్డాది కిశోర్‌కుమార్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించారు.
 
బీఆర్‌ఏయూలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బోధనా సిబ్బంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో మంగళవారం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు అనుమతితో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 వరకు ఈ విధానంలో బోధన కొనసాగుతుంది. బోధనేతర సిబ్బంది రోజు విడిచి రోజు 50 శాతం మంది చొప్పున వర్సిటీకి హాజరై విధులు నిర్వహించనున్నారు. వర్సిటీలో పాలనా విధులను నిర్వహిస్తున్న అధికారులు ప్రతి రోజు వర్సిటీకి హాజరుకానున్నారు.

Updated Date - 2021-04-20T04:43:30+05:30 IST