Abn logo
Aug 4 2021 @ 00:38AM

రొయ్యల సాగుకు సెలవేనా?

ముదినేపల్లి మండలం ఉప్పరగూడెం వద్ద ఖాళీ చేసిన రొయ్యల చెరువు

క్రాప్‌ హాలీడే దిశగా ఆక్వా రైతులు 

వరుస నష్టాలే కారణం


ముదినేపల్లి, ఆగస్టు 3 : గతంలో సాధారణ రైతులను కూడా కోటీశ్వరులను చేసిన రొయ్యల సాగు ఇప్పుడు రైతులను కలవరపెడుతోంది. వరస నష్టాలవైపు పయనిస్తున్న రొయ్యల పెంపకం రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంది. ఒకసారి దెబ్బతిన్నా మరోసారైనా లాభాలు వస్తాయన్న ఆశతో ఈ రంగంలో కొనసాగుతున్న రైతులు రెండు, మూడు సంవత్సరాలుగా వరస నష్టాలు సంభవించడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. తరచూ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, వైరస్‌ సోకటం, వ్యాధులు సంక్రమించటం లాంటి కారణాలతో నష్టాలు సంభవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముదినేపల్లి ప్రాంత ఆక్వా రైతులు రొయ్యల సాగులో స్వచ్ఛందంగా క్రాప్‌ హాలిడేను పాటించేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న రైతులు రొయ్యల పెంపకాన్ని వదిలేసి, తమ చెరువులను ఇతరులకు లీజుకు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌కు చాలా మంది రైతులు తమ చెరువులను ఖాళీగా ఉంచేశారు. కొత్తగా చెరువులను తవ్వినవారు సెప్టెంబరు నెలాఖరు వరకు వేచి చూడాలన్న ధోరణిలో ఉన్నారు. ముదినేపల్లి ప్రాంతంలో కొందరు తమ చెరువులను ఎండగట్టి, మెటీరియల్‌ను ఇళ్లకు చేర్చారు. వైరస్‌తో రొయ్యలు చనిపోతుండటం, మార్కెట్‌లో రొయ్యలకు ధరలు లేకపోవటం, మేత ధరలు, లీజులు పెరగటం, ఎగుమతులు పడిపోవటం లాంటి కారణాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఆక్వా రైతులు ప్రస్తుతం ఒక సీజన్‌కు సాగు నిలిపివేస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. 


కోలుకోలేని నష్టం 

రొయ్యల సాగు నష్టాల ఊబిలో చిక్కుకుంది. పెట్టుబడులు పెరిగిపోయాయి. తరచూ వైరస్‌ను ఎదుర్కోవటం కష్టంగా ఉంది. రొయ్యల పెంపకాన్ని కొనసాగించాలా? వద్దా అన్న సందిగ్ధతను ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఆక్వా రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే సాగు కష్టమే.  - రెడ్డి నాగరాజు, ఆక్వా రైతు, 

స్తంభం చెరువు