కరోనా బాధితులకు ఇంటికే ఆహారం

ABN , First Publish Date - 2021-05-08T08:26:44+05:30 IST

కాలే కడుపుకి పట్టెడన్నం దొరికితే అన్నార్తులకు ఎంతో తృప్తి! కరోనా సోకి.. ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారిలో ఎంతోమంది జ్వరం, నిస్సత్తువతో వండుకునేందుకు ఒళ్లు సహకరించక పస్తులుంటున్నారు.

కరోనా బాధితులకు ఇంటికే ఆహారం

  • పోలీసుల ఆదర్శం.. ‘సేవా ఆహార్‌’ 

హైదరాబాద్‌ సిటీ, మే 7 (ఆంధ్రజ్యోతి): కాలే కడుపుకి పట్టెడన్నం దొరికితే అన్నార్తులకు ఎంతో తృప్తి! కరోనా సోకి.. ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారిలో ఎంతోమంది జ్వరం, నిస్సత్తువతో వండుకునేందుకు ఒళ్లు సహకరించక పస్తులుంటున్నారు. ఇలాంటి వారికి పూర్తి ఉచితంగా ఓ పూట కడుపునిండా అన్నం పెట్టి.. ఆకలి తీర్చేందుకు పోలీసులు మానవతా ధృక్పథంతో ముందుకొచ్చారు. కోరిన బాధితులకు నేరుగా ఇంటికే ఆహారాన్ని పంపేందుకుగాను ‘సేవా ఆహార్‌’ పేరుతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ పథకాన్ని ప్రారంభించారు. ఐదురోజుల పాటు ప్రయోగాత్మకంగా సాగిన ఈ పథకం ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలవుతోంది. ఈ పథకం కింద ఓ ఇంటికి గరిష్ఠంగా ఐదురోజుల పాటు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తారు. గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సేవలు అందిస్తున్న ఈ పథకం ద్వారా రోజుకు సుమారు 2వేల మందికి ఓ పూట ఆహారం అందుతోంది. 


ఇలా ఆర్డర్‌ చేయాలి! 

‘సేవా ఆహార్‌’ పథకాన్ని ప్రస్తుతానికి వాట్సాప్‌ నంబరు 7799616163 ద్వారా అమలు చేస్తున్నారు. భోజనం కావాలనుకునే కరోనా బాధితులు, ఉదయం ఏడు గంటల్లోపు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది. పేరు, చిరునామా, లొకేషన్‌ తప్పనిసరి. అలాగే ఇంట్లో ఎంతమందికి పాజిటివ్‌ ఉంది.. పాజిటివ్‌ వచ్చిన తేదీ.. గరిష్ఠంగా ఐదురోజుల్లో ఎన్నిరోజుల పాటు భోజనం కావాలి అనే వివరాలను పొందుపర్చాలి. ఉదయం ఏడు గంటల తర్వాత వచ్చిన ఆర్డర్‌కు మరుసటి రోజుకోసం పరిగణిస్తారు. ఆర్డర్‌ మేరకు ఉదయం నుంచే వంటలు మొదలుపెట్టి ఆ రోజు అందించాల్సిన ప్యాకెట్లను సిద్ధం చేస్తారు. అనంతరం ఒంటి గంటలోపు నేరుగా ఇళ్ల వద్దకే పార్శిళ్లు పంపుతారు. ఇందుకుగాను ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ సేవలు తీసుకుంటున్నారు. వంటల తయారీలో పోషకాహార నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సోకిన వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు కలగరాదనే ఉద్దేశంతో ‘సేవా ఆహార్‌’ను ప్రారంభించినట్లు డీఐజీ సుమతి చెప్పారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు... మరి కొంతమంది సేవా దృక్పథం కలిగిన వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమం మరింత పక్కాగా అమలు చేసేందుకుగాను ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-05-08T08:26:44+05:30 IST