కామెంట్రీ ప్యానల్‌లో దక్కని చోటు.. టీవీ షోలలో చెప్పుకుంటానన్న మంజ్రేకర్

ABN , First Publish Date - 2020-09-19T01:04:32+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపు (శనివారం) ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 8 జట్లు చాలా రోజుల

కామెంట్రీ ప్యానల్‌లో దక్కని చోటు.. టీవీ షోలలో చెప్పుకుంటానన్న మంజ్రేకర్

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపు (శనివారం) ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే 8 జట్లు చాలా రోజుల క్రితమే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. శిక్షణలో మునిగితేలాయి. శనివారం ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది.  అయితే, తన కామెంటరీతో అలరించే సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఈసారి ఐపీఎల్‌లో కనిపించకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించే అంశమే. 


మంజ్రేకర్ గతేడాది చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బీసీసీఐ అతడిపై వేటేసింది. రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ (ముక్కల చెక్కలు) ఆటగాడని మంజ్రేకర్ సంబోధించాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. సహ కామెంటేటర్ హర్షా భోగ్లేపైనా విమర్శల వర్షం కురిసింది.


కామెంటరీ ప్యానల్ నుంచి తనను తొలగించిన తర్వాత బీసీసీఐకి మంజ్రేకర్ పలు లేఖలు రాశాడు. ఈమెయిల్స్ పంపాడు. తనను తిరిగి కామెంటరీ ప్యానల్‌లో చేర్చుకోవాలని అభ్యర్థించాడు. బోర్డు మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ బోర్డు అతడి అభ్యర్థనను పట్టించుకోలేదు. ఐపీఎల్ కవరేజీ నుంచి మంజ్రేకర్‌ను పక్కనపెట్టింది.  


 ఇదే విషయమై మంజ్రేకర్‌ను ప్రశ్నించినప్పుడు స్పందించేందుకు తిరస్కరించాడు. అయితే, టోర్నమెంట్ సందర్భంగా పలు మీడియా హౌస్‌లతో కలిసి పనిచేస్తానని మాత్రం చెప్పుకొచ్చాడు. ‘‘దానిపై వ్యాఖ్యానించకపోవడమే మంచిది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో కలిసి వారి ప్రీమ్యాచ్, పోస్టు మ్యాచ్‌ షోలలో పూర్తి సమయం పనిచేస్తా. న్యూస్ చానల్‌తో చర్చలు చివరి దశలో ఉన్నాయి. కాలమ్‌లు కూడా రాస్తున్నా. ఎఫ్ఎం రేడియోలకు అప్‌డేట్స్ ఇస్తా’’ అని పేర్కొన్నాడు . 


విమర్శల విషయంలో భారతీయులు చాలా సున్నితంగా ఉంటారని మంజ్రేకర్ అన్నాడు. రవీంద్ర జడేజా విషయంలో చేసిన ‘బిట్స్ అండ్ పీసెస్’ వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ ఒకసారి భారత ఆటగాళ్లను ‘మైదానంలోని గాడిదలు’ (డాంకీస్ ఆన్ ద ఫీల్డ్) అన్నాడని ఉదహరించాడు. ఇంగ్లిష్ విషయంలో అర్థం చేసుకోవడంలో అప్పుడెలాంటి తప్పు జరిగిందో తన విషయంలోనూ అలానే  జరిగిందని వివరించాడు. 


ఓసారి సచిన్ విషయంలోనూ అలాగే జరిగిందన్నాడు. ‘ఎలిఫెంట్ ఇన్‌ ద రూం’  అని అంటే సచిన్‌ను ‘ఐరావతం’తో పోల్చానని జనాలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు జడేజా విషయంలోనూ అదే జరిగిందని, అతడిని తాను తక్కువ చేసి మాట్లాడినట్టు భ్రమ పడ్డారని మంజ్రేకర్ పేర్కొన్నాడు.  

Updated Date - 2020-09-19T01:04:32+05:30 IST