వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన హోం మంత్రి అలీ

ABN , First Publish Date - 2020-10-18T22:57:25+05:30 IST

గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే.

వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన హోం మంత్రి అలీ

హైదరాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆదివారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ భారీ వర్షాల గురైన ప్రాంతాలను సందర్శించారు. ఆజంపూర ప్రాంతంలోని జీహెచ్ఎంసీ కాలనీ తదితర ఏరియాల్లో మంత్రి  పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.


ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ... వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు వర్షాలకు గురైన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని స్థానికులకు మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారని మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు.



Updated Date - 2020-10-18T22:57:25+05:30 IST