ఎవరికి హోమ్‌ క్వారంటైన్‌?

ABN , First Publish Date - 2020-07-14T18:47:44+05:30 IST

కరోనాతో హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితం అయ్యారా? ఎలాగూ సోకింది, కాబట్టి మందులు వాడుతూ హాయిగా బయట తిరిగేయవచ్చు అనుకోకూడదు! కరోనా మహమ్మారిని సమూలంగా

ఎవరికి హోమ్‌ క్వారంటైన్‌?

ఆంధ్రజ్యోతి(14-07-2020)

ఇంట్లోనే ఇలా ఉందాం!

కరోనాతో హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితం అయ్యారా? ఎలాగూ సోకింది, కాబట్టి మందులు వాడుతూ హాయిగా బయట తిరిగేయవచ్చు అనుకోకూడదు! కరోనా మహమ్మారిని సమూలంగా అంతం చేయాలంటే.. వైద్యుల సలహాలు, సూచనలు కచ్చితంగా పాటించాలి! కరోనా బాధితులు, సహాయకులు హోమ్‌ క్వారంటైన్‌లో ఎలా ఉండాలో చెప్పే గైడ్‌ ఇది...


హోమ్ క్వారంటైన్ గైడ్

ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ఎన్ని రక్షణ చర్యలు పాటించినా కరోనా సోకే వీలు లేకపోలేదు. అయితే పాజిటివ్‌ ఫలితం వచ్చినంత మాత్రాన మానసికంగా కుంగిపోయి, భయం పెంచుకోకూడదు. వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేసే బదులు, హోమ్‌ క్వారంటైన్‌ సూచిస్తే.... మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించాలి. కొద్ది రోజుల విశ్రాంతి, స్వల్ప చికిత్సలతో నయం అయ్యే వీలు ఉండబట్టే మీరు హోమ్‌ క్వారంటైన్‌ అర్హత సాధించారని గ్రహించాలి. అయితే హోమ్‌ క్వారంటైన్‌ కాలంలో వైద్యులు సూచించే నియమాలు తు.చ. తప్పక పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీతో పాటు మీ కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారికి మీ నుంచి కరోనా వైరస్‌ సోకకుండా అడ్డుకట్ట వేయడం కోసమే హోమ్‌ క్వారంటైన్‌ అనే విషయం గ్రహించాలి! నిజానికి ఆటలమ్మ (చికెన్‌పాక్స్‌) సోకినా ఇతరులకు దూరం పాటించడం, గదికే పరిమితం కావడం లాంటి ఇదే రకమైన విధానాన్ని అనుసరిస్తాం. కాబట్టి కరోనాతో హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితమైతే, అర్థం లేని భయాలకు లోను కాకుండా, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగే యోధులుగా మిమ్మల్ని మీరు భావించాలి!



ఎవరికి హోమ్‌ క్వారంటైన్‌?

కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయిన ప్రతి ఒక్కరినీ ఆస్పత్రిలో చేర్చుకునే పరిస్థితి లేదు. కరోనా పాజిటివ్‌ ఫలితం వచ్చిన బాఽధితులను వర్గీకరించి, ఎవరికి ఆస్పత్రిలో చికిత్స అవసరమో, ఎవరికి హోమ్‌ క్వారంటైన్‌ను సూచించవచ్చో వైద్యులు నిర్ణయిస్తారు.

 

వీరికి ఆస్పత్రి చికిత్స!

విపరీతమైన జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న బాధితులు

ఊపిరి అందకపోవడం లాంటి శ్వాసకోస సమస్యలతో పరిస్థితి విషమించినవారు

కరోనా లక్షణాలు కలిగి ఉండి, తీవ్రత క్రమేపీ పెరుగుతున్నవారు


వీరికి హోమ్‌ క్వారంటైన్‌!

ఎటువంటి పూర్వ ఆరోగ్య సమస్యలూ లేకుండా కరోనా లక్షణాలు కూడా బయల్పడని పాజిటివ్‌ ఫలితం వచ్చిన వారు

కరోనా లక్షణాలు కలిగి ఉండీ, అనారోగ్య పరిస్థితి తీవ్రం కాకుండా స్థిరంగా ఉన్న కరోనా పాజిటివ్‌ ఫలితం వచ్చిన వారు



ఎప్పుడు ప్రమాదం?

క్వారంటైన్‌లో ఉన్న సమయంలో ప్రతి రోజూ లక్షణాలను నిశితంగా గమనించుకుంటూ ఉండాలి. వాటిలో తేడాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు తెలియపరుస్తూ ఉండాలి. కొన్ని లక్షణాలు వ్యాధి తీవ్రమవుతోంది అనడానికి సంకేతాలు. అవేంటంటే...


శరీర ఉష్ణోగ్రతలో తేడాలు

విపరీతమైన బలహీనత

దగ్గు, గొంతునొప్పి లాంటి కొత్త లక్షణాలు తలెత్తడం

అప్పటికే ఉన్న లక్షణాలు తీవ్రమవడం

ఛాతీలో నొప్పి, నొక్కినట్టు అనిపించడం

తికమకకు లోనవడం పెదవులు, ముఖం నీలంగా మారడం

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


ఆ 17 రోజులు...

హోమ్‌ క్వారంటైన్‌ కాల పరిమితి 17 రోజులు. హోమ్‌ క్వారంటైన్‌ మొదలైనప్పటి నుంచి ఐదవ రోజు, తిరిగి 14వ రోజు ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వచ్చి రెండు సార్లు కరోనా పరీక్ష చేస్తారు. రెండు సార్లూ నెగటివ్‌ ఫలితం వస్తే, 17వ రోజు నుంచి పూర్వపు జీవనశైలిని కొనసాగించవచ్చు. క్వారంటైన్‌ సమయంలో ఆరోగ్య కార్యకర్తలు బాధితులతో ప్రతి రోజూ ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉంటూ, ఆరోగ్యస్థితిని వాకబు చేస్తూ ఉంటారు. లక్షణాల తీవ్రతను గమనిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ ద్వారా బాధితుల కదలికలనూ హెల్త్‌కేర్‌ నిపుణులు గమనిస్తూ ఉంటారు. కాబట్టి హోమ్‌ క్వారంటైన్‌ సురక్షితమైన చికిత్సా విధానంగా బాధితులు భావించాలి.


సహాయకులకు సోకితే?

రోగితో దూరం పాటిస్తూ, మాస్క్‌, గ్లౌజులు ధరిస్తూ సేవలు అందిస్తే సహాయకులకు వైరస్‌ సోకే అవకాశాలు తక్కువ. అయితే కొంతమంది సహాయకులకు పొరపాటున వైరస్‌ సోకే వీలూ లేకపోలేదు. ఇలాంటప్పుడు సహాయకులు ఇలా నడుచుకోవాలి.


దగ్గు, జ్వరం, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం లాంటి కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించిన వెంటనే తనను తాను ఐసొలేట్‌ చేసుకోవాలి.

పి.సి.ఆర్‌ టెస్ట్‌ అనేది కరోనాను కచ్చితంగా నిర్థారించే పరీక్షే అయినా కరోనా సోకిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాతే ఆ టెస్ట్‌ పాజిటివ్‌ ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈలోగా ఇంట్లోని ఇతరులకూ కరోనా సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సహాయకులు కరోనా సోకిందని అనుమానం వచ్చిన వెంటనే హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాధితుల వ్యక్తిగత వైద్యులతో ఫోన్‌లో సంప్రతించి, వాడవలసిన మందుల గురించి తెలుసుకుని, చికిత్స మొదలుపెట్టాలి.

అలాగే పి.సి.ఆర్‌ కంటే ముందే కరోనా ఇన్‌ఫెక్షన్‌ను కనిపెట్టే వీలున్న ఛాతీ ఎక్స్‌రే, సి.టి. స్కానింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

అవసరాన్ని బట్టి పి.సి.ఆర్‌ ప్రొఫైల్‌ చేయించుకుని, తగిన చికిత్స తీసుకోవాలి.


- డాక్టర్‌ చైతన్య చల్లా, జనరల్‌ ఫిజీషియన్‌,

క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌, హైదరాబాద్‌.



ఆహారనియమాలు...


తినవలసినవి: బ్రౌన్‌రైస్‌, గోధుమపిండితో తయారయ్యే చపాతీలు, రోటీలు

బీన్స్‌, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు ఫ తాజా పండ్లు, కూరగాయలు

రోజు మొత్తంలో రెండు లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలి

విటమిన్‌ సి ఉండే పుల్లని పండ్లు తినాలి.

అల్లం, వెల్లుల్లి, పసుపు వేసి వండిన వంటకాలు తినాలి.

ఇంట్లో వండిన ఆహారమే తినాలి.

వారంలో మూడు రోజులు తాజా మాంసాహారం, చేపలు, గుడ్లు తినాలి.

కొవ్వులు, నూనెలు తగ్గించాలి


తినకూడనివి: మైదా, వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్‌

కూల్‌డ్రింక్స్‌, ప్యాకేజ్డ్‌ డ్రింక్స్‌

చీజ్‌, పామాయిల్‌, కొబ్బరినూనె, బటర్‌

మాంసాహారం వేయించి తినకూడదు.



వెలి కాదు... కావలి!

కరోనా సోకిన వ్యక్తులతో పాటు వారి కుటుంబాలను వెలి వేయడం సరి కాదు. కరోనా సోకిన వ్యక్తి గురించి తెలియగానే... ‘ఎక్కడ తిరిగి అంటించుకున్నాడో? ఎంతమందికి అంటించాడో?’ అని బాధితుడి మీద నెపాలు మోపడం కూడా సరి కాదు.  ఇన్‌ఫ్లుయెంజా, ఫ్లూ మాదిరిగానే తేలికగా సోకే ఓ వైరస్‌ కరోనా. బాధితులు హోమ్‌ క్వారంటైన్‌లో భాగంగా, తమను తాము ఒక గదికే పరిమితం చేసుకోవడం ద్వారా, చుట్టూ ఉన్న సమాజానికి వ్యాధి వ్యాప్తి చెందకుండా, తన వరకే పరిమితం చేసుకుంటున్నారనే నిజాన్ని ఇతరులు గ్రహించాలి.



తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

హోమ్‌ క్వారంటైన్‌లో నడుచుకోవలసిన తీరు గురించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అవేంటంటే....


కుటుంబ సభ్యులు: ఒక వ్యక్తి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నప్పుడు, అదే ఇంట్లో ఉండే ఇతర కుటుంబసభ్యుల్లో పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు, తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు ఉంటే వాళ్లను దూరంగా ఉన్న ఇతర బంధువుల ఇళ్లకు పంపించేయాలి. 

బాధితులు: హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఒకే గదికి 17 రోజుల పాటు పరిమితమై ఉండాలి. ఆ గదికి అటాచ్డ్‌ బాత్రూమ్‌తో పాటు, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా రెండు కిటికీలు ఉండాలి. గది విశాలంగా, అటాచ్డ్‌ బాత్రూమ్‌ సౌకర్యం కలిగి ఉండాలి. కరోనా బాధితుల విసర్జకాల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది కాబట్టి గదికి అటాచ్డ్‌ బాత్రూమ్‌ ఉండడం తప్పనిసరి. ఆరోగ్యసేతు యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని, అన్నివేళల్లో యాప్‌ పనిచేసేలా చూసుకోవాలి.

సహాయకులు: కరోనా బాధితులకు సపర్యలు చేసే సహాయకులు యౌవనవంతులై ఉండాలి. వీరిలో వ్యాధినిరోధకశక్తి ఎక్కువ కాబట్టి ఈ వయసువారే సహాయకులుగా ఉండడం ముఖ్యం. క్వారంటైన్‌లో ఉన్న 17 రోజులూ వీళ్లే బాధితులకు సేవలు అందిస్తూ ఉండాలి.



బాధితుల కోసం...

సహాయకులు గదిలోకి వస్తున్న ప్రతిసారీ మూడు పొరల మాస్క్‌ లేదా ఎన్‌ - 95 మాస్క్‌ ధరిస్తూ ఉండాలి.

ప్రతి రోజూ మాస్క్‌ మారుస్తూ ఉండాలి.

తొలగించిన మాస్క్‌ను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి, సహాయకులు తీసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలి.

సాధారణ ఫినాయిల్‌ లేదా లైజాల్‌ లాంటి డిజ్‌ ఇన్‌ఫెక్టెంట్‌తో గదిని ప్రతి రోజూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 

సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంటూ, కాలక్షేపం కలిగించే పనుల్లో నిమగ్నమవ్వాలి.

కుటుంబసభ్యులకు కనిపించేలా గది తలుపు తెరచి ఉంచి, మాట్లాడుకోవచ్చు. అయితే కచ్చితంగా ఆరు అడుగుల దూరం పాటించాలి.

కరోనా సోకిందనే బెంగ, భయం, ఆందోళనలు మానుకోవాలి.

లక్షణాల తీరు గమనించుకుంటూ, మార్పులను ఎప్పటికప్పుడు వైద్యుల దృష్టికి తీసుకువెళుతూ ఉండాలి.



బాధితులకు మానసిక తోడ్పాటు!

17 రోజుల పాటు ఒక గదికే పరిమితం కావడం కొంత కష్టమే! ఇంతటి దీర్ఘమైన హోమ్‌ క్వారంటైన్‌ మనసు మీద కూడాప్రభావం చూపిస్తుంది. కాబట్టి సహాయకులు, కుటుంబసభ్యులు బాధితులకు ఒంటరివారమనే భావన కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ, కుంగుబాటుకు లోనవకుండా చూసుకోవాలి. దూరం పాటిస్తూనే, కబుర్లతో బాధితులకు కాలక్షేపం కలిగించాలి. కరోనా కూడా మిగతా వ్యాధుల లాంటిదే! అయితే వేగంగా వ్యాప్తి చెందే వీలు ఉంది కాబట్టే ఇలా క్వారంటైన్‌కు పరిమితం చేయవలసి వచ్చిందనే వాస్తవాన్ని బాధితులకు అర్థమయ్యేలా వివరించాలి. మరీ ముఖ్యంగా వ్యాధి సోకింది కాబట్టి క్వారంటైన్‌లో ఉంచడం కాదు, ఆ వ్యాధి ఇతరులకు సోకకుండా కట్టడి చేయడానికే క్వారంటైన్‌ అనే విషయాన్ని గ్రహించేలా చేయాలి.


సహాయకుల కోసం...

హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి సేవలు చేయడం, అవసరాలు తీర్చడం సహాయకుల విధి. ఈ క్రమంలో కరోనా సోకే వీలు లేకుండా, ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందే వీలు లేకుండా సహాయకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....


వీలైనంత తక్కువ సార్లు బాధితుల గదిలోకి వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి.

బాధితులను తరచుగా తాకకూడదు.

బాధితుల చెమట, ఉమ్మి, కఫం, మలమూత్రాలు శరీరానికి తగలకుండా చూసుకోవాలి.

గదిలోకి వెళ్లే ప్రతిసారీ మూడు పొరలు ఉండే మాస్క్‌ ధరించాలి.

సాధ్యమైనంత వరకూ ఎక్కువగా తాకే వీలున్న తలుపు గడియ, స్విచ్‌లు లాంటి వాటిని తాకకుండా చూసుకోవాలి.

చేతులకు డిస్పోజబుల్‌ గ్లౌజులు తప్పక ధరించాలి. 

గది నుంచి బయటకు వచ్చిన వెంటనే గ్లౌజులు, మాస్క్‌లను తొలగించి, గది బయట ఉంచిన చెత్త డబ్బాలో వేసుకోవాలి. 

అత్యధిక ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన వేడిగా ఉండే ఇంటి భోజనం బాధితులకు అందించాలి.

బాధితులు భోజనం చేసిన తర్వాత, ఆ పాత్రలను డెట్టాల్‌ కలిపిన నీళ్లలో అరగంట పాటు నానబెట్టి, శుభ్రం చేయాలి.

బాధితుల దుస్తులు, దుప్పట్లను కూడా విడిగా డెట్టాల్‌ కలిపిన వేడినీళ్లలో అరగంట పాటు నానబెట్టి, ఉతికి, ఎండలో ఆరబెట్టాలి.

గదిని శుభ్రం చేసే పనిని బాధితులకే అప్పగించాలి. 

బాధితులు ఉపయోగించిన మాస్క్‌లను ఇంటి బయటకు తీసుకువెళ్లి, ఎప్పటికప్పుడు కాల్చేస్తూ ఉండాలి.



మీరు అదృష్టవంతులు!

నిజానికి హోమ్‌ క్వారంటైన్‌ అర్హత పొందిన వారు, తమను తాము అదృష్టవంతులుగా భావించాలి. వ్యాధి ముదిరిపోకుండా, తగ్గే వీలు ఉన్నందువల్లే వైద్యులు హోమ్‌ క్వారంటైన్‌ సూచించారని అర్థం చేసుకోవాలి. వ్యాధిని అణచివేసే వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉండబట్టి, స్వల్ప చికిత్స, విశ్రాంతితో వైరస్‌ పూర్తిగా అంతం అయ్యే వీలు ఉండబట్టే తమకు హోమ్‌ క్వారంటైన్‌ సూచించారనీ గ్రహించాలి. హోమ్‌ క్వారంటైన్‌ ఉద్దేశం, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా నియంత్రించడమే అనే నిజాన్ని బాధితులు అర్థం చేసుకోవాలి.


Updated Date - 2020-07-14T18:47:44+05:30 IST