ఇకపై ఇంటిలోనే...హోం క్వారంటైన్‌కే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-06-07T06:44:01+05:30 IST

జిల్లాకు వచ్చే వలస కూలీలను ఇప్పటివరకూ క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు.

ఇకపై ఇంటిలోనే...హోం క్వారంటైన్‌కే ప్రాధాన్యం

బయటి క్వారంటైన్‌ కేంద్రాలకు స్వస్తి

కంటైన్‌మెంట్‌ జోన్‌లూ నిలుపుదల

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికే పునరావాసం

వ్యయ భారంతోనే నిర్ణయమా?


కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య తగ్గనుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని హోం క్వారంటైన్‌కు పరిమితం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌కు... లేకుంటే గృహ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మాత్రం కొద్దిరోజులు పునరావాసం కల్పిస్తారు. వ్యయభారంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంటైన్‌మెంట్‌ జోన్‌లనూ తగ్గించనున్నారు. 


(విజయగనరం-ఆంధ్రజ్యోతి)/గరుగుబిల్లి, జూన్‌ 6 :

జిల్లాకు వచ్చే వలస కూలీలను ఇప్పటివరకూ క్వారంటైన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ వసతి, భోజనం అందించారు. వారికి ఆరోగ్య పరీక్షలు చేశాక వైరస్‌ పాజిటివ్‌ వస్తే కొవిడ్‌ ఆస్పత్రికి వైద్యం కోసం తరలించే వారు. నెగిటివ్‌ వచ్చిన వారికి 14 రోజులు అన్ని సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇంటికి పంపేవారు. ఈ విధంగా దాదాపు రెండు నెలలుగా జిల్లాకు వస్తున్న వలసదారులు క్వారంటైన్‌ కేంద్రాల్లోనే తల దాచుకుంటున్నారు. వారు పల్లెలకు వచ్చేందుకు స్థానికులు కూడా అంగీకరించకపోవడంతో అధికారులే క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించేవారు. అక్కడ పౌష్టికాహారం అందించేవారు. ఈ విధానానికి శనివారంతో ప్రభుత్వం స్వస్తి పలికింది. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న ఒక్కొక్కరిపై అధికంగా వ్యయం అవుతోందని భావించి కేంద్రాలను నిలిపేయాలని ఆదేశించినట్లు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ప్రధాన గ్రామాలు.. మండలాల్లో  విస్తరించి ఉన్న 50కి పైగా కేంద్రాలను మూసి వేస్తున్నారు.


గరుగుబల్లి మండలానికి సంబంధించి క్వారంటైన్‌ కేంద్రంగా ఉన్న ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలకు వచ్చిన సుమారు 171 మంది వలస జీవులకు శనివారం వైద్య పరీక్షలు చేశారు. ప్రత్యేక బస్సుల్లో స్వగృహాలకు తరలించేందుకు తహసీల్దార్‌ వీవీ సన్యాశిశర్మ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇకపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస కూలీలను గుర్తించి   సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అప్పగించనున్నారు. తహసీల్దార్‌, ఎంపీడీవో, వైద్యాధికారులు సమన్వయంతో పరీక్షలు నిర్వహించి ఆయా గ్రామాల్లోనే ఇంటికే పరిమితమయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. వీరంతా నిర్ణీత సమయం వరకూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. 


నిలిచిపోయిన కంటైన్‌మెంట్‌ జోన్లు

కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడే గ్రామాల్లో ఇకపై కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేదు. గతంలో చెక్‌పోస్టులు, బారికేడ్ల ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించేవారు. ఇకపై పాజిటివ్‌ కేసులు నమోదైన వారిని కొవిడ్‌ ఆసుపత్రికి తరలించడం వరకే అధికారుల బాధ్యత. కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన గ్రామాల్లో ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని... ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 


ఆరు రాష్ట్రాల వారికే క్వారంటైన్‌

చెన్నయ్‌, గుజరాత్‌, న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలకే క్వారంటైన్‌లో ఉండే అవకాశం కల్పించనున్నారు. వీరికి పరీక్షలు నిర్వహించాక వారం రోజులే పునరావాసం కల్పిస్తారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి ఆధారాలను నిశితంగా పరిశీలించాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునరావాసం కల్పిస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలసలు మాత్రం తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షించుకోవాలి. అనంతరం ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. సంబంధిత వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట్రావు వద్ద ప్రస్తావించగా చిన్నచిన్న క్వారంటైన్‌ కేంద్రాలన్నీ ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. జేఎన్‌టీయూ, బొబ్బిలి, పార్వతీపురంలోని కొన్ని క్వారంటైన్‌ కేంద్రాలు కొనసాగుతాయని వెల్లడించారు.

Updated Date - 2020-06-07T06:44:01+05:30 IST