ఇరుకు ఇళ్లల్లో ఆగమాగం

ABN , First Publish Date - 2021-05-11T06:13:33+05:30 IST

ఓ ఆటో డ్రైవర్‌

ఇరుకు ఇళ్లల్లో ఆగమాగం

హోంక్వారంటైన్ ఎలా..?

హైదరాబాద్‌ సిటీ, మే10 (ఆంధ్రజ్యోతి)

ఓ ఆటో డ్రైవర్‌ తన ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి పాతబస్తీలోని తలాబ్‌కట్టలో నివసిస్తున్నాడు. ఓ చిన్నపాటి గదిలో ఉండే ఆ కుటుంబానిది రెక్కాడితే కానీ డొక్కాడదు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలోనూ ఆటోను నడిపేందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎంతో మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన అతడికి ఇటీవల కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో చిన్నపాటి గదిలో ఎవరు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 


అంబర్‌పేట గోల్నాకలో గల ఓ గార్బేజ్‌లో మెకానిక్‌గా పని చేసే వ్యక్తి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి నగరానికి ఉపాధి కోసం వచ్చాడు. స్థానికంగానే అద్దెకు ఓ గదిని తీసుకొని భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారు నివసించే ఇంట్లో మరో మూడు కుటుంబాలు ఉన్నాయి. అందరికీ ఒకటే బాత్రూమ్‌. భర్తకు చేదోడుగా భార్య కూడా స్థానికంగా పలు ఇళ్లలో పాచిపనులు చేస్తోంది. పాచిపనులు చేసే ఓ ఇంట్లో కుటుంబానికి కరోనా రాగా, అక్కడ పనులు చేసినందుకు మెకానిక్‌ భార్యకు జలుబు, జ్వరంతో బాధపడింది. దాంతో ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలనే బాధ వారిని తొలిచివేస్తోంది. 


నగరంలోని పలు ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలో, అద్దె గదుల్లో నివసించే చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే హోం క్వారంటైన్‌  జీవన్మరణ సమస్యగా మారుతోంది. 


హోం క్వారంటైన్‌ కోసం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కొన్నేళ్ల క్రితం గుర్తించిన నోటిఫైడ్‌ మురికివాడలు 1400కు పైగా ఉన్నాయి. ఇవేగాకుండా హైదరాబాద్‌ మహా నగర విస్తరణలో అనేక ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు వెలిశాయి. అనేక ప్రాంతాల్లో ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకొని వచ్చిన కుటుంబాలు ఇళ్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉండే జనాభాలో అత్యధిక శాతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారేనని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అద్దె ఇళ్లలో, ఇరుకు గదుల్లో నివసిస్తున్న కుటుంబాల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా హోం క్వారంటైన్‌ చేసుకోవడానికి సరైన వసతులు లేవు. ఒకే గదిలో భార్య, పిల్లలతో నివసించే ఆ కుటుంబాలు హోం క్వారంటైన్‌ చేసుకోవాలంటే సతమతమవుతున్నాయి. పిల్లలు, భార్యను ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇళ్లకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంధువులు సైతం రానియ్యకపోతే వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. 


సరైన సమాచారం తెలియదు

నగరంలోని బస్తీ దవాఖానాల నుంచి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులతో పాలు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద పెద్దఎత్తున కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఎక్కడ ఉంటారు..? హోం క్వారంటైన్‌ చేసుకోవడానికి సరైన వసతులున్నాయా..? అని ఆరా తీసేవారు లేరు. పాజిటివ్‌ అని తేలితే అవసరమైన మందులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. నగరంలో ఏయే ప్రాంతాల్లో కరోనా రోగులకు ఉచితంగా ప్రభుత్వం హోం క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది..? ఇక స్వచ్ఛంద సంస్థలు ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. ఎలాంటి వసతులు కల్పిస్తారనే సమాచారం ఆయా పరీక్షా కేంద్రాల వద్ద లేదు. దీంతో పాజిటివ్‌ తేలగానే రోగులు ఇళ్లకు వెళ్తున్నారు. వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లకు వెళ్ళేందుకు జంకుతున్నారు. ఆస్పత్రుల్లో ఉండడం వల్ల ఇంకేం సమస్యలు ఎదురవుతాయోనని ఆవైపు వెళ్లేందుకు వెనుకడుగేస్తున్నారు. 

Updated Date - 2021-05-11T06:13:33+05:30 IST