ఇవి...ఇంటి స్నాక్స్‌ !

ABN , First Publish Date - 2020-02-22T06:11:52+05:30 IST

బయట ఫుడ్‌ కన్నా ఇంటిఫుడ్‌ ఆరోగ్యకరం అని తెలిసినా కొన్నింటిని ఎలా తయారు చేయాలో తెలియదు.

ఇవి...ఇంటి స్నాక్స్‌ !

బయట ఫుడ్‌ కన్నా ఇంటిఫుడ్‌ ఆరోగ్యకరం అని తెలిసినా కొన్నింటిని ఎలా తయారు చేయాలో తెలియదు. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్‌ తయారీ తల్లులకు ఒకరకంగా పరీక్షే. డ్రైఫ్రూట్స్‌తో ఇంట్లోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ ఎన్నో తయారుచేయొచ్చు. చిక్కీ, కోఫ్తా, కేక్‌, కబాబ్‌, లడ్డూ... ఈ హెల్దీ స్నాక్స్‌ చేసి పిల్లల ముందు పెట్టండి. పిల్లలే కాదు... వీటిని ఇంటిల్లిపాది కూడా ఇష్టపడతారు!


డ్రై ఫ్రూట్‌ చిక్కీ

కావలసినవి

వేరుసెనగలు - 100 గ్రాములు, జీడిపప్పు - 100 గ్రాములు, వాల్‌నట్స్‌ - 100  గ్రాములు, బాదం - 50 గ్రాములు, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - 350గ్రా., తేనె - 350గ్రా., వెన్న - రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, తినేసోడా - అర టీస్పూన్‌.


తయారీ

  • వేరుసెనగలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌, బాదం, సోంపును చిన్నమంటపై వేగించాలి. 
  • తరువాత ఆ మిశ్రమంలో పంచదార, తేనె, నీళ్లు పోసి ఉడికించాలి.
  • మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.
  • ఇప్పుడు స్టవ్‌పై నుంచి దింపి నిమ్మరసం, వెన్న, తినేసోడా వేసి కలియబెట్టాలి. 
  • దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి. 
  • చల్లారి, గట్టిగా అయిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.
  • వీటిని డబ్బాలో భద్రపరిచి పిల్లలకు అప్పుడప్పుడు ఇస్తుంటే ఇష్టంగా తింటారు.


ఆల్మండ్‌ కోఫ్తా

కావలసినవి

బంగాళదుంపలు - నాలుగు, జాజికాయ పొడి - చిటికెడు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - ముప్పావు కప్పు, పిండి - ఒక కప్పు, కోడిగుడ్లు - మూడు, ఉప్పు - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, బ్రెడ్‌ ముక్కలు - కొన్ని. 


తయారీ

  • ముందుగా బంగాళదుంపలు ఉడికించాలి. 
  • పొట్టు తీసి గుజ్జుగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • అందులో బాదం పలుకులు, ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి, పాలు, పిండి, రెండు కోడిగుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పావుగంట పాటు పెట్టాలి. 
  • తరువాత కోఫ్తాలుగా కట్‌ చేసుకోవాలి. 
  • ఒక ప్లేటులో పొడి పిండి, మరొక ప్లేటులో కోడిగుడ్డు సొన, ఇంకో ప్లేటులో బ్రెడ్‌ ముక్కలు తీసుకోవాలి.
  • ఒక్కో కోఫ్తాను తీసుకుంటూ పిండిలో అద్ది, కోడిగుడ్డు సొనలో అద్దాలి. తరువాత బ్రెడ్‌ముక్కలపై దొర్లించాలి. 
  • ఈ కోఫ్తాలను ప్రీ హీట్‌ ఓవెన్‌లో పెట్టి ఉడికించి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


ఫ్లమ్‌ కేక్‌

కావలసినవి

వెన్న - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, కోడిగుడ్లు - ఆరు, బాదం - 125గ్రా., వెనిలా ఎసెన్స్‌ - రెండు టీస్పూన్లు, మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ - రెండున్నర కప్పులు, పిండి - రెండు కప్పులు, కేక్‌ టిన్‌ - ఒకటి.


తయారీ

  • రెండు టేబుల్‌స్పూన్ల మైదాను ఒక పాత్రలో తీసుకుని అందులో మిక్స్‌డ్‌ ఫ్రూట్స్‌ ముక్కలు, బాదం వేసి బాగా కలపాలి.
  • ఈ పిండిలో వెన్న, పంచదార (తీపిని బట్టి తీసుకోవాలి), కోడిగుడ్లు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లోకి తీసుకుని ప్రీ హీటెడ్‌ ఓవెన్‌లో 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించాలి.
  • బేకరీలోలాగే నోరూరించే ప్లమ్‌ కేక్‌ రెడీ అయిన తర్వాత దాన్ని ముక్కలుగా కోసి ఇవ్వాలి. 


డ్రై ఫ్రూట్‌ లడ్డూ

కావలసినవి

ఖర్జూరం - పావు కప్పు, జీడిపప్పు - పావుకప్పు, బాదం - పావుకప్పు, పిస్తా - పావుకప్పు, డ్రై అప్రికాట్స్‌ - ఆరు, డ్రై ఫిగ్స్‌ - నాలుగు, ఎండు కొబ్బరి - రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - ఒకటీస్పూన్‌.


తయారీ

  • ముందుగా ఒక పాత్రలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు బాగా వేగించాలి. 
  • తరువాత పిస్తా వేసి మరో రెండు నిమిషాలు వేగించి వీటన్నింటి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తరువాత అప్రికాట్స్‌, ఫిగ్స్‌ కాస్త వేడి అయ్యేలా వేగించాలి.  
  • ఖర్జూరం, అప్రికాట్స్‌, ఫిగ్స్‌ను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. 
  • ఈ మిశ్రమంలో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కలపాలి. 
  • ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి. 
  • ఎండుకొబ్బరి, నువ్వులు లడ్డూలపై అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి.
  • ఈ డ్రై ఫ్రూట్‌ లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు.


దహీ అంజీర్‌ కబాబ్‌

కావలసినవి

అంజీర్‌ - 100గ్రా., పెరుగు - 250గ్రా., పనీర్‌ - 400గ్రా., సెనగపిండి - 150గ్రా., బ్రెడ్‌ ముక్కలు - కొన్ని, అల్లం  - చిన్నముక్క, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒకకట్ట, నెయ్యి - 200గ్రా., గరంమసాలా- ఒక టీస్పూన్‌, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ

  • ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో పనీర్‌, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరంమసాల, యాలకుల పొడి,  జీలకర్రపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతులోకి తీసుకుంటూ వేగించిన సెనగపిండి, బ్రెడ్‌ ముక్కలతో కలపాలి.
  • చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో అంజీర్‌ పెట్టి కబాబ్‌లుగా చేసుకోవాలి.
  • ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చిన్నమంటపై ఈ కబాబ్‌లను గోధుమ వర్ణంలోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి.
  • పుదీనా చట్నీ కాంబినేషన్‌లో ఇవి బాగుంటాయి. 

Updated Date - 2020-02-22T06:11:52+05:30 IST