యూఏఈలో ఉపాధి కోల్పోయి బస్‌స్టాండ్‌లో రాత్రులు గడిపిన భార‌త‌ కార్మికుడు.. చివ‌ర‌కు

ABN , First Publish Date - 2020-07-08T17:14:38+05:30 IST

ఉపాధి కోల్పోయి, నిరాశ్ర‌యుడై ఏకంగా రెండు నెల‌ల పాటు అబుధాబి బ‌స్‌స్టేష‌న్‌లో గ‌డిపిన భార‌త కార్మికుడిని యూఏఈలోని ప్ర‌వాసులు ఆదుకున్నారు.

యూఏఈలో ఉపాధి కోల్పోయి బస్‌స్టాండ్‌లో రాత్రులు గడిపిన భార‌త‌ కార్మికుడు.. చివ‌ర‌కు

యూఏఈ: ఉపాధి కోల్పోయి, నిరాశ్ర‌యుడై ఏకంగా రెండు నెల‌ల పాటు అబుధాబి బ‌స్‌స్టేష‌న్‌లో గ‌డిపిన భార‌త కార్మికుడిని యూఏఈలోని ప్ర‌వాసులు ఆదుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే... మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం మౌ టౌన్‌కు చెందిన గోబరి సహాని గతేడాది ఏప్రిల్‌లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. విజిటింగ్‌ వీసాపై అక్క‌డికెళ్లిన అత‌ను ఓ భ‌వ‌న ‌నిర్మాణ కంపెనీలో ప‌నికి కుదిరాడు. గోబ‌రికి నెల‌కు 1100 దిర్హామ్స్ జీతం అని చెప్పిన యాజ‌మాన్యం న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు చిల్లిగ‌వ్వ కూడా చెల్లించ‌లేదు. అనంత‌రం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అత‌ని సాల‌రీని 1100 దిర్హామ్స్ నుంచి 700 దిర్హామ్స్ త‌గ్గించేసిన యాజ‌మాన్యం.. పైగా డ‌బుల్ షిఫ్ట్ ప‌ని చేయాల‌ని చెప్పింది. ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేసిన‌, మ‌ళ్లీ తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు రెండో షిఫ్ట్ ఉండేది. అప్ప‌టికే ఏడు నెల‌ల జీతం రావాల్సి ఉంది. కానీ న‌యా పైసా కూడా అతని చేతికి అంద‌లేదు. దాంతో మేలో గోబరి ఆ ఉద్యోగాన్ని వ‌దిలేశాడు. అప్ప‌టి నుంచి వేరే ఉద్యోగం కోసం వెతికిన ఫ‌లితం లేకుండా పోయింది. దాంతో రోజు మొత్తం పార్కులో ఉంటే... రాత్రుళ్లు అబుధాబి బ‌స్‌స్టాండ్‌లో ప‌డుకునే వాడు. ఇలా రెండు నెల‌లు ఓ కేఫ్ య‌జ‌మాని ఇచ్చే భోజనం, పాదాచారులు ఇచ్చే డ‌బ్బుల‌తో వెళ్ల‌దీశాడు. 


ఈ క్ర‌మంలో గోబ‌రి దుస్థితి గురించి ప్ర‌వాసుల సంఘానికి తెలిసింది. దీంతో ప్ర‌వాసి వీటీవీ దామోదరన్ మ‌ద్ద‌తుతో అజంతా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ పట్నిని గోబ‌రి క‌లిశాడు. ఆ సమ‌యంలో మాసిపోయిన బట్ట‌లు, గ‌డ్డంతో క‌నిపించిన గోబ‌రిని చూసిన ప‌ట్ని చ‌లించిపోయారు. వెంట‌నే అత‌నికి కొత్త బట్ట‌‌లు కొనిచ్చారు. అలాగే సెలూన్ తీసుకెళ్లి క‌టింగ్‌, షేవింగ్ చేయించారు. అనంత‌రం గోబ‌రి ఉండేందుకు తాత్కాలికంగా వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు. ల‌క్నోకు స్పెష‌ల్ ఫ్లైట్‌లో అత‌నికి టికెట్ దొరికే వ‌ర‌కు వ‌స‌తి, భోజ‌న స‌దుపాయం క‌ల్పిస్తాన‌ని ప‌ట్ని చెప్పారు. అంతేగాక త‌న‌కు తెలిసిన ఇత‌ర భార‌త ప్ర‌వాస‌ సంఘాల సాయంతో 4900 దిర్హామ్స్‌(రూ.ల‌క్ష‌) పొగు చేసి గోబ‌రికి అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం అత‌ని చేతికి ఇచ్చారు. ఇక త‌న‌ను ఈ ఆప‌ద స‌మ‌యంలో ఆదుకున్న ప్ర‌వాసుల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని గోబ‌రి తెలిపాడు. వారు లేక‌పోతే ఇవాళ నేను లేన‌ని స్వ‌దేశానికి వ‌చ్చేందుకు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న గోబ‌రి చెప్పుకొచ్చాడు.    

Updated Date - 2020-07-08T17:14:38+05:30 IST