ఏమి దుర్మార్గం?

ABN , First Publish Date - 2020-09-29T06:25:42+05:30 IST

ఏదో సాధించాము, దేనికో గర్వపడాలి- అని చెప్పుకుంటున్నప్పుడల్లా, చెప్పుతో కొట్టినట్టు ఒక వాస్తవం మన కళ్లు తెరిపిస్తుంది. ఆదర్శాలు ఆకాశంలో ఉన్నాయేమో, ప్రగల్భాలు...

ఏమి దుర్మార్గం?

ఏదో సాధించాము, దేనికో గర్వపడాలి- అని చెప్పుకుంటున్నప్పుడల్లా, చెప్పుతో కొట్టినట్టు ఒక వాస్తవం మన కళ్లు తెరిపిస్తుంది. ఆదర్శాలు ఆకాశంలో ఉన్నాయేమో, ప్రగల్భాలు పరుగులు తీస్తున్నాయేమో కానీ, హీనత్వం, నీచత్వం మాత్రం ఈ సంఘాన్ని వదలడం లేదు. కులాంతరం చేసుకున్నారని యువతీయువకులను తల్లిదండ్రులే వేధించడం, చివరకు ప్రాణాలు తీయడం, ఏమి దుర్మార్గం? పుట్టుకతో ఏదో ఆధిక్యం సంక్రమించిందని, దానికి భంగం వాటిల్లుతోందని, కులానికి, వంశానికి ఉన్న పరువును కాపాడుకోవాలని చెబుతూ హంతకులుగా మారుతున్న ఈ మనుషులను ఏమని పిలవాలి? 


పోయిన గురువారం నాడు దారుణ హత్యకు గురి అయిన హేమంతకుమార్‌ ఈ కులోన్మాద హత్యల పరంపరలో మొదటి వాడు కాదు. తరతరాలుగా, శతాబ్దాలు సహస్రాబ్దాలుగా సాగుతున్న హననం ఇది. ఇప్పటి సామాజిక, సాంస్కృతిక వాతావరణం చూస్తుంటే రానున్న వందలాది ఏళ్లు కూడా ఈ వ్యాధి నయమయ్యేట్టు లేదు. ప్రపంచమంతా పదిలక్షలమందిని చంపిన కరోనా వైరస్‌ కూడా, కలిగినవాళ్లను కొద్దిగా కనికరించిందేమో కానీ, జాతి మతం కులం అంటూ వివక్ష పాటించలేదు. మన దేశంలోని కులవ్యవస్థ వైరస్‌ కంటె నీచమైనది, ప్రమాదకరమైనది. 


గత జూన్‌ మాసంలోనే గద్వాల జిల్లాలో ఒక బాలిక వేరే కులం అబ్బాయిని ప్రేమించి, అతని వల్ల గర్భవతి అయిందన్న కోపంతో తల్లిదండ్రులే హతమార్చారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన గద్ది కుమార్‌, భువనగిరి జిల్లాకు చెందిన నరేశ్‌ అంబోజి, పెద్దపల్లి జిల్లాకు చెందిన మంథని మధుకర్‌ - ఇవన్నీ కులోన్మాద హత్యలే. ఇక మిర్యాల గూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య ఎంతటి కలకలాన్ని, ప్రజాగ్రహాన్ని కలిగించిందో తెలిసిందే. ఈ హత్యల వెనుక మన సమాజంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ప్రధాన కారణమన్నది నిజమే. దానితో పాటు వ్యవస్థాగత జాడ్యాలు మరికొన్ని కూడా పనిచేస్తున్నాయి. 


తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లను తమ ఆధ్వర్యంలో, తమ ఇష్టం మేరకు చేయాలని అనుకుంటారు. ప్రేమాభిమానాల వల్ల, పిల్లల శ్రేయస్సు కోరి ఇట్లా అనుకుంటారని భావించడం సరికాదు. పితృ స్వామిక ఆలోచనల చట్రంలో భాగంగానే, కుటుంబం మీద కుటుంబ పెద్ద ఆధిపత్యం ఉండాలన్న సంప్రదాయం ప్రకారమే అటువంటి ఆలోచనలు స్థిరపడ్డాయి. తల్లిదండ్రులను ధిక్కరించి పెళ్లిళ్లు చేసుకోవడం- కుటుంబాన్ని, పితృస్వామ్యాన్ని, ఆ మేరకు కాదనడమే. ఒకే కులం వారి మధ్య కూడా ఈ స్వతంత్ర వివాహాలు ఘర్షణను సృష్టిస్తాయి. అయితే, సాధారణంగా, ఆ ఘర్షణ ప్రాణాలు తీసుకునేంత తీవ్రంగా ఉండదు. 


నిచ్చెనమెట్ల కులవ్యవస్థ అని ఎందుకు అంటామంటే, ఇందులో ప్రతి ఒక మెట్టుకూ ఒక కిందిమెట్టు, ఒక పైమెట్టు ఉంటాయి. చాలా ఎత్తున ఉన్న పై మెట్టుకు, అన్నిటి కంటె కింది మెట్టుకు మధ్య ప్రేమ-పెళ్లి వంటి సమానీకరణ ప్రయత్నం జరిగినప్పుడు, ప్రతిస్పందనలు ఎగువ కులం నుంచి అత్యంత తీవ్రంగా ఉంటాయి. పెద్ద కులాల అమ్మాయిలు, దళిత యువకుల మధ్య ప్రేమ ఏర్పడి, వివాహం దాకా వెళ్లే క్రమంలో కానీ, వెళ్లాక కానీ- అందులోని ఎగువ కులం కుటుంబం దాన్ని అవమానంగా భావించి, హత్యలకు పాల్పడడం జరుగుతోంది. ఇందులో, పురుషాధిపత్య కోణం కూడా ఉంటుంది. పెద్ద కులాల యువకులు, చిన్నకులాల అమ్మాయిలను ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే పెద్దగా తీవ్ర పరిణామాలు ఉండడం లేదు. అదే, పెద్ద కులాల అమ్మాయిలను చిన్నకులాల అబ్బాయిలు ప్రేమిస్తే దాన్ని సహించడం లేదు. 


నాలుగు వర్ణాలు అని చెప్పినా, అసంఖ్యాక కులాలు ఉన్నాయి. కులాల మధ్య హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇందులో కులాధిక్యంతో పాటు, భూమి వల్ల, డబ్బు వల్ల సమకూరే అదనపు అధికారం కూడా జతకూడినప్పుడు ఆ శ్రేణి అహంభావానికి హద్దులు ఉండవు. ఆర్థికంగా ఆధిక్యం లేకపోయినా, కులం పెద్దదైనప్పుడు కూడా కులాంతర సంబంధాలను అవమానంగా పరిగణించడం చూస్తాము. కూటికి పేద అయినా, కులానికి కాదు- అంటున్నారంటే, వారిలో ఆభిజాత్యానికి పునాది ఎక్కడున్నదో అర్థమవుతుంది. ఆధునిక పరిణామాల వల్ల, ఈ నిచ్చెనమెట్లు గతంలో ఉన్న మాదిరిగానే ఉండకపోవచ్చు. సాంప్రదాయికంగా కింది శ్రేణికి చెందిన కులం కూడా భూస్వామ్య ప్రభావంతో, డబ్బు ప్రభావంతో పై శ్రేణికి చేరుకోవచ్చు. ప్రణయ్‌ను హత్య చేయించినవారు స్పష్టంగా సామాజికంగా హెచ్చు కులానికి చెందినవారు. హేమంత్ విషయంలో ఆ స్పష్టత లేదు. సాంప్రదాయికంగా చూస్తే, అమ్మాయి పక్షం వారు కించపడవలసిన సామాజిక నేపథ్యం కాదు హేమంత్ ది. కానీ, ఇక్కడ ఆధిక్యాల నిర్వచనాలలో కొంత మార్పు వచ్చినట్టుంది.


దేశంలో కులనిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక మార్గమని పెద్దలు చేసిన నిర్దేశంలో అర్థం ఉన్నది. ఇప్పుడు కులాంతర వివాహాలు, ప్రేమలు కూడా వివిధ కులాల మధ్య ఎంతో కొంత సాంస్కృతిక సమతూకం ఏర్పడిన తరువాతనే జరుగుతున్నాయి. చదువులో సంపాదనలో సరిసమానుల మధ్య కూడా వివాహానికి కులాలు అడ్డు అయితే ఎట్లా? ఇన్ని గోడలు ఇట్లా మనుషులను విడదీస్తూ ఉంటే, హిందువుల ఐక్యతను కోరుతున్న పెద్దలు ఏమి చేస్తున్నట్టు? నూటికో కోటికో జరిగే మతాంతర వివాహాలను అడ్డుకోవడానికి ఉద్యమాలు చేసే బదులు, కులాల ప్రమేయంలేకుండా హిందువులందరిలో అంతర్‌  వివాహాలు జరిగేట్టు నడుం కట్టువచ్చు కదా? పోలీసుల వల్ల, చట్టాల వల్ల కట్టడి అయ్యే అహంకారాలూ, హత్యాకాండలూ కావివి. సామాజిక ఉద్యమమే మార్గం. 

Updated Date - 2020-09-29T06:25:42+05:30 IST