Abn logo
Oct 15 2021 @ 00:59AM

విద్యార్థుల నుంచి ఆదరణ లేని ఆనర్స్‌

  • నిజాం కాలేజీలో నిండని సీట్లు.. కోఠి కాలేజీలో ఒక్కటే భర్తీ
  • బేగంపేట, సిటీ కాలేజీల్లో నామమాత్రంగా అడ్మిషన్లు
  • అకడమిక్‌ షెడ్యూల్‌పై విద్యార్థుల ఆందోళన


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్‌ కోర్సుకు విద్యార్థుల నుంచి ఆదరణ లభించలేదు. దోస్త్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ఈ కోర్సులో చేరారు. ఒక్కో కాలేజీలో 60 సీట్లతో నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట, కోఠి విమెన్స్‌ కాలేజీల్లో కోర్సును ప్రారంభించారు. అయితే నిజాం కాలేజీలో 33 మందే చేరారు. సిటీ కాలేజీ, బేగంపేట విమెన్స్‌ కాలేజీల్లో అడ్మిషన్లు నామమాత్రంగానే అయ్యాయి. కోఠి విమెన్స్‌ కాలేజీలో ఒకే ఒక్క విద్యార్థిని చేరారు. సిలబస్‌ రూపకల్పన, ఫ్యాకల్టీ తదితర అంశాల్లో స్పష్టత, సన్నద్ధత లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొత్త కోర్సును ప్రకటించి ప్రచారం కల్పించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా దోస్త్‌ కౌన్సెలింగ్‌ చివరలో దీన్ని ప్రకటించారు. అలాగే కోర్సు సిలబస్‌ను ఇంతవరకు ఖరారు చేయలేదు. కోర్సు నిర్వహణపై సంబంధిత యూనివర్సిటీ, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల అభిప్రాయాలను విద్యామండలి తీసుకోలేదని తెలిసింది. 


దోస్త్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ఆయా కాలేజీల్లో ఇతర సీట్లన్నీ నిండాయి. మూడో విడత కౌన్సెలింగ్‌ మధ్యలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పద్ధతిలో బీఏ ఆనర్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోలేదు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు కావడంతో రూ.23 వేలు ఫీజు చెల్లించాలి. దోస్త్‌ మొదటి దశ నోటిఫికేషన్‌లోనే కోర్సును ప్రకటించి ఉంటే సీట్లు మిగిలే పరిస్థితి ఉండేది కాదని ఓ ప్రొఫెసర్‌ తెలిపారు. కాగా, సిలబస్‌ను రూపొందించాలని ఉస్మానియా వర్సిటీ అకడమిక్‌ విభాగానికి ఉన్నత విద్యామండలి ఆదేశాలిచ్చిన్నట్టు తెలిసింది. అయితే పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఫ్యాకల్టీ నామమాత్రంగా ఉండటంతో సిలబస్‌ ప్రిపరేషన్‌తో తమకు సంబంధం లేదని చేతులెత్తేసినట్టు తెలిసింది.  ఆయా కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకే అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అకడమిక్‌ షెడ్యూల్‌ విడుదలలో జాప్యంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.