చీరకట్టులో అదరగొడుతోంది...

ABN , First Publish Date - 2020-10-08T05:30:00+05:30 IST

సరదా కోసం, పాకెట్‌ మనీ కోసం నేర్చుకున్న హూలా హూప్‌ డ్యాన్స్‌ ఇప్పుడు ఆమెకు కెరీర్‌ అయింది. ఢిల్లీకి చెందిన 24ఏళ్ల ఇష్నా కుట్టీ ఈ మధ్య చీరకట్టుతో హూప్‌ డ్యాన్స్‌ స్టెప్పులేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో ‘శారీ ఫ్లో’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో పోస్ట్‌ చేసింది...

చీరకట్టులో అదరగొడుతోంది...

సరదా కోసం, పాకెట్‌ మనీ కోసం నేర్చుకున్న హూలా హూప్‌ డ్యాన్స్‌ ఇప్పుడు ఆమెకు కెరీర్‌ అయింది. ఢిల్లీకి చెందిన 24ఏళ్ల ఇష్నా కుట్టీ ఈ మధ్య చీరకట్టుతో హూప్‌ డ్యాన్స్‌ స్టెప్పులేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో ‘శారీ ఫ్లో’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో పోస్ట్‌ చేసింది. ‘హూలా హూప్‌ డ్యాన్స్‌కు ప్రొఫెషనల్‌ ఆర్ట్‌గా గుర్తింపు తీసుకువస్తాను’ అంటున్న ఆమె విశేషాలివి...


‘‘చీరకట్టుకొని హూప్‌ డ్యాన్స్‌ చేయడానికి కారణం ఉంది. మనదే శ సంస్కృతిలో ఎంతో వైవిధ్యం ఉంది. ఒక్కో ప్రాంతంలోని మహిళల చీరకట్టు ప్రత్యేకంగా ఉంటుంది. చీరలో డ్యాన్స్‌ చేయడం సౌకర్యంగా, సంతోషంగా ఉందని చెప్పాలనే ఆలోచనతోనే ‘శారీ ఫ్లో’ వీడియో చేశాను. ఈ వీడియోను ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా చూశారు. నాకు హూప్‌ డ్యాన్స్‌ మీద ఇష్టం ఎలా పెరిగిందంటే... నేను యూట్యూబ్‌లో హూప్‌ డ్యాన్స్‌ వీడియో ఒకటి చూశాను. పదేళ్ల క్రితం హూప్‌ డ్యాన్స్‌ గురించి తెలుసుకున్నా. గత ఆరేళ్లుగా ఈ డ్యాన్స్‌ను సాధన చేస్తున్నా. ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నా. హూపింగ్‌లో నాకు నచ్చేది ఏమంటే ఎవరైనా తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఇంతకుముందు నా జీవితంలో ఒక్కసారి కూడా డ్యాన్స్‌ చేయలేదు. హూపింగ్‌ మీద మొదట్లో ఇష్టం ఉండకపోయేది. హూప్‌ డ్యాన్స్‌ను ఒక హాబీగా, పాకెట్‌ మనీ కోసం నేర్చుకున్నా. కానీ కొద్దిరోజుల్లోనే హూప్‌ డ్యాన్స్‌ మీద ఇష్టం పెరిగింది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీ నుంచి సైకాలజీ డిగ్రీ చదివిన తరువాత పూర్తిస్థాయిలో హూప్‌ డ్యాన్స్‌ మీద దృష్టి పెట్టాను.


ఇందులోనూ రకాలున్నాయి

దేశవ్యాప్తంగా పలుచోట్ల నేను హూప్‌ డ్యాన్స్‌ వర్క్‌షాప్స్‌ నిర్వహించాను. 20 నుంచి 30 మంది బ్యాచ్‌గా ఉన్నవాళ్లకు నేర్పించాను. ఇప్పుడు మనదగ్గగర వందల సంఖ్యలో హూప్‌ డ్యాన్సర్స్‌ ఉన్నారు. హూపింగ్‌ అనేది ఒక  ‘ఫ్లో ఆర్ట్‌’. డ్యాన్స్‌లో కదా జాజ్‌, హిప్‌ హాప్‌ ఉన్నట్టే ఇందులో జగ్లింగ్‌, పోయ్‌ స్పిన్నర్స్‌, స్లాక్లిన్నింగ్‌, అక్రో యోగా రకాలున్నాయి. శారీలో హూప్‌ డ్యాన్స్‌ ఇంతకుముందు చాలామంది చేసి ఉంటారు. అయితే నాకుంటూ ప్రత్యేకత ఉండాలనే ఆలోచనతో విభిన్న రకాల ఆర్ట్‌ఫామ్స్‌ను చూపించాలనుకున్నా. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. శారీతో హూప్‌ డ్యాన్స్‌ చేయాలనే ఆలోచన అనుకోకుండా వచ్చింది. వెంటనే శారీ ఫ్లో యాష్‌ట్యాగ్‌తో కొన్ని వీడియోలు చేయాలనుకున్నా. ‘ఢిల్లీ 6’ సినిమాలోని ‘జెండా పూల్‌’ పాట వింటూ చీర కట్టుతో హూప్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


హూప్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తా

నా శారీ హూప్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయ్యే సమయానికి నేను హూప్‌ ఫ్లో కంపెనీ రిజిస్టర్‌ చేసే పనిలో ఉన్నా. వచ్చే వారంలో ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నా. హూప్‌ ఫెస్టివల్స్‌ నిర్వహి ంచి, హూప్‌ డ్యాన్సర్లలో జోష్‌ నింపాలనుకుంటున్నా. హూప్‌ డ్యాన్స్‌ ఇంకా చాలామందికి తెలియదు. వారందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నా. చాలామంది నన్ను అడుగుతుంటారు ‘హూప్‌ డ్యాన్స్‌ బాగుంది సరే. ఇంతకీ నువ్వు ఏం చేస్తావు?’ అనే వారందరికీ నేనేంటో, నా ప్రత్యేకత ఏంటో తెలిసేలా చేయాలనుకుంటున్నా’’. 

Updated Date - 2020-10-08T05:30:00+05:30 IST