ఒక్క కిలో లక్ష రూపాయలు.. ఈ పంట వేస్తే కనకవర్షం గ్యారెంటీ..!

ABN , First Publish Date - 2021-04-01T21:08:54+05:30 IST

పేరు హాప్ షూట్. కిలో ధర ఏకంగా లక్షల రూపాయాలు. వైరల్ అవుతున్న రైతు కథనం

ఒక్క కిలో లక్ష రూపాయలు.. ఈ పంట వేస్తే కనకవర్షం గ్యారెంటీ..!

ఇంటర్నెట్ డెస్క్: వ్యవసాయం దైవాధీనంగా మారిపోయిన రోజులు ఇవి. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు.. అన్ని కుదురి పంట చేతికందినా.. మార్కెట్లో లాభదాయకమైన ధర లభిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి! ఇటువంటి స్థితిలో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నం చేశాడు ఓ బీహారీ రైతు అమరేష్ సింగ్. హాప్ షూట్ అనే పంట వేయడం ద్వారా కనకవర్షం కురిసే మార్గం వేసుకున్నాడు. అంత లాభదాయక పంట అసలు మనదేశంలో ఉందా.. అని మీరు సందేహిస్తే తప్పు పట్టాల్సిందేమీ ఉండదు. ఎందుకుంటే ఈ పంట ఉత్తరఅమెరికా, ఐరోపాలో ఎక్కువగా పండిస్తుంటారు. పేరు హాప్ షూట్. కిలో ధర ఏకంగా లక్షల రూపాయలు. అవును.. మీరు చదువుతున్నది నిజమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా హాప్ షూట్ పేరుపొందింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు ట్విటర్‌లో వెల్లడించారు. యావత్ దేశంలో తొలిసారిగా అమెరేష్ ఈ పంట వేశారట. అయితే..భారత రైతుల స్థితిగతులను మార్చే శక్తి ఈ పంటకు ఉందంటూ సుప్రీయ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రకంపనలు సృష్టిస్తోంది.


హాప్ షూట్ అంటే..

ఈ పంటను ఒకప్పుడు మాదకద్రవ్యంగా భావించేవారు. అయితే..దీని ఉపయోగాల గురించి మరిన్ని పరిశోధనలు జరిగిన అనంతరం హాప్ షూట్‌ను బీర్ తయారీలో వినియోగిస్తున్నారు. దీని ద్వారా బీర్ మరింత వగరుగా, కాస్తంత చేదుగా మారుతుందని చెబుతున్నారు. హాప్ షూట్‌లో బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు..ఇవి కాస్తంత రుచిగా కూడా ఉండటంతో షెఫ్‌లు కొన్ని రకాల వంటకాల్లో దీన్ని వినియోగిస్తారట.


ఇంతఖరీదు ఎందుకంటే..

బీర్ తయారీలో వినియోగిస్తున్న హాప్ షూట్‌కు ఇంతటి ధర ఎందుకని ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమే ఉంది. అసలు ఈ పంటను పండించడం చాలా శ్రమతో కూడుకున్నదట. ఈ మొక్కకు ఉండే టెండ్రిల్స్(తీగలు) ఏరాలంటే..వెన్ను విరిగినంత పనౌతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా చిన్నగా ఉండే ఇవి ఓ క్రమపద్ధతి అంటూ లేకండా పెరుగుతాయట. సైజు కూడా చిన్నదిగా ఉండటంతో..ఓ చిన్న క్యారీగా బ్యాగు నింపాలన్నా కూడా గంటల సమయం పడుతుందని, నడుములు పడిపోయేలాగా వంగుతూ వీటిని ఏరాల్సి ఉంటుందని ఈ పంటను పండించేవారు చెబుతారు. ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికీ నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. 



Updated Date - 2021-04-01T21:08:54+05:30 IST