ఆంక్షలు.. ఆశలు

ABN , First Publish Date - 2020-05-05T11:28:56+05:30 IST

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెల రోజులుగా

ఆంక్షలు.. ఆశలు

లాక్‌డౌన్‌పై  ప్రజల్లో టెన్షన్‌

నిబంధనల సడలింపు కోసం నిరీక్షణ

సీఎం కేసీఆర్‌ ప్రకటనపై ఉత్కంఠ


భూపాలపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో  నెల రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. పైగా క్వారంటెన్లన్నీ ఖాళీ అయ్యాయి. కంటైన్మెంట్‌ జోన్లు కూడా ఎత్తివేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపు ఇచ్చింది. వీటిని అమలు చేయాలా.. వద్దా? అని మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  


కరోనా వైరస్‌ కారణంగా  నలభై రోజులుగా ప్రజ లు ఇంటికే పరిమితమయ్యారు. మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన కేసుల మినహా  ఇప్పటి వరకు కొత్తగా కేసు లు నమోదు కాలేదు. ములుగు జిల్లాలో పస్రా, ఏటూరునాగారానికి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే భూపాలపల్లి పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడికి కరోనా రాగా, అతడి నుంచి అతడి భార్య, కూతురికి కూడా  సోకింది. రెండు జిల్లాలో మొత్తం ఐదుగురు కరోనా బారిన పడ్డారు. అయితే.. వీరిలో నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. సింగరేణి కార్మికుడికి మాత్రం వైద్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఇప్పటికే ములుగును కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించారు. పస్రా, ఏటూరునాగరం, భూపాలపల్లి పట్టణంలో సింగరేణి మిలీనియం క్వార్టర్స్‌, రాంనగర్‌, సుభా్‌షకాలనీల్లో అమలవుతున్న కంటైన్మెంట్‌ జోన్‌ ఆదివారం ఎత్తివేశారు. దీంతో నెల రోజుల తర్వాత  స్థానికులకు కొంత ఊరట లభించింది. 


సడలింపా.. పొడిగింపా..?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిరువ్యాపారులు, కూలీలు, నిరుపేదల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా గ్రీన్‌జోన్‌లో, భూపాలపల్లి అరేంజ్‌ జోన్‌లో ఉ న్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించినప్పటికీ కొన్ని సడలింపులు ప్రకటించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే స్థానికులకు కొం త ఊరట కలుగుతుంది. చిరువ్యాపారాలతో పాటు భవన నిర్మాణాలు, ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. అలాగే చిరువ్యాపారులు కూడా ఆం క్షలకు అనుగుణంగా తమ వ్యాపారాలను నిర్వహించుకునే వీలు ఉంటుంది. ప్రైవేటు,  ప్రభుత్వ వాహనాల ను పరిమితికి లోబడి నడుపుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని వ్యాపారాలను నిర్వహిచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


ఇక గ్రీన్‌ జోన్‌లో ఉన్న ములుగు జిల్లాలో మద్యం కూడా అ మ్ముకునేందుకు ఆంక్షలను సడలించింది. దీంతో దీని అమలు కోసం మద్యం ప్రియులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్నారు. అయితే.. కేంద్ర ఇచ్చిన సడలింపులను కేసీఆర్‌ కొనసాగిస్తారా.. లేక కొత్త నిబంధనలు విధిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. 7వ తేదీతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ముగిసిపోనుంది. దీంతో లాక్‌డౌన్‌ పొడిగింపుతో పాటు ఇతర అంశాలపై  మంగళవారం జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో తీసుకునే నిర్ణయం కోసం గ్రీన్‌, ఆరేంజ్‌ జోన్లలోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-05-05T11:28:56+05:30 IST