కాబూల్‌లో దిన దిన గండం.. త్వరగా స్వదేశానికి తీసుకెళ్లమని నలుగురు భారత ప్రొఫెసర్ల మోర

ABN , First Publish Date - 2021-08-18T23:42:27+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి పాగ వేయడంతో అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే చాలా మంది స్వదేశాలకు తరలిపోతున్నారు.

కాబూల్‌లో దిన దిన గండం.. త్వరగా స్వదేశానికి తీసుకెళ్లమని నలుగురు భారత ప్రొఫెసర్ల మోర

కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు తిరిగి పాగ వేయడంతో అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే చాలా మంది స్వదేశాలకు తరలిపోతున్నారు. ఇంకా చాలా మంది విదేశీయులు అక్కడే చిక్కుకుని ఉన్నారు. ఇలాగే కాబూల్‌లోని బక్తర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నలుగురు భారత ప్రొఫెసర్లు కూడా యూనివర్శిటీ క్యాంపస్‌లో చిక్కుకున్నారు. తాజాగా ఈ నలుగురు ప్రొఫెసర్లు తమను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకెళ్లమని భారత ప్రభుత్వానికి మోర పెట్టుకుంటున్నారు. పరిస్థితి చేయిదాటక ముందే భారత్‌కు తరలించాలని వారు కోరుతున్నారు. తాలిబన్లు హస్తగతం చేసుకున్న కాబూల్‌లో దిన దిన గండంగా గడుపుతున్నట్లు ప్రొఫెసర్లు వాపోయారు. 


"మేము ఇప్పటివరకు ప్రతి భారతీయ ఫోరంను సంప్రదించడం జరిగింది. మమ్మల్ని వెంటనే స్వదేశానికి తరలించడానికి ప్రభుత్వం ఏదైనా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. నేను రెండు రోజులుగా యూనివర్శిటీ క్యాంపస్ నుండి బయటకు రాలేదు. ప్రతిసారీ క్యాంపస్ బయట గొడవ జరిగినప్పుడు నా గుండె ఒక్కసారి జారీపోతోంది" అని మహ్మద్ అసీఫ్ షా అనే ప్రొఫెసర్ కాబూల్‌లోని ఉద్రిక్త పరిస్థితులను తెలియజేశారు. కాశ్మీర్‌కు చెందిన అసీఫ్ షా యూనివర్శిటీలో గత నాలుగేళ్లుగా ఎకనామిక్స్ బోధిస్తున్నారు.


"సోమవారం భారత్‌కు వచ్చేందుకు అంతా సిద్ధం చేసుకున్నా. టికెట్ బుక్ చేసుకున్న కొద్దిసేపటికే అంతా మారిపోయింది. కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి గంట సమయం పట్టింది. తీరా అక్కడికెళ్లి చూస్తే జనసందోహం. కాబూల్‌లోని జనం మొత్తం అక్కడే కనిపించారు. విమానం కూడా క్యాన్సిల్ అయింది. దాంతో వేరే దారిలేక తిరిగి యూనివర్శిటీ క్యాంపస్‌కు వచ్చేశాను" అని కాబూల్ విమానాశ్రయంలోని సోమవారం నాటి పరిస్థితులను అసీఫ్ షా వివరించారు. అక్కడి సర్కార్ ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆయన రెండు నెలల క్రితమే అఫ్ఘానిస్థాన్ తిరిగి వెళ్లినట్లు చెప్పారు. కరోనా కారణంగా తన కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చేసిన అసీఫ్.. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్‌లైన్ పరీక్షల కోసం రెండు నెలలకు గాను తిరిగి అఫ్ఘాన్ వెళ్లడంతో చిక్కుకుపోయారు. లక్కీగా కుటుంబాన్ని స్వదేశంలోనే వదిలి వెళ్లడం అసీఫ్‌కు కొంత ఉపశమనం. 


బిహార్ రాష్ట్రానికి చెందిన మరో ప్రొఫెసర్ సయ్యద్ అబిద్ హుస్సేన్ యూనివర్శిటీలో మార్కెటింగ్ టీచ్ చేస్తారు. ఆయన కూడా అఫ్ఘాన్‌లోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉండలేమంటూ వెంటనే భారత్‌కు తరలించాలని కోరుతున్నారు. ఇప్పటికే భారత ఎంబసీ, కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించినట్లు హుస్సేన్ చెప్పారు. దీంతో తమను కాబూల్ నుంచి సాధ్యమైనంత త్వరగా భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకెళ్తోందనే నమ్మకం ఉందని అన్నారు.


అలాగే కాశ్మీర్‌కు చెందిన మరో ప్రొఫెసర్ అదిల్ రసూల్ కూడా కాబూల్‌ యూనివర్శిటీలో చిక్కుకుపోయారు. రసూల్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు. పరిస్థితి ఇంకా దిగజారకముందే తమను కాబూల్ నుంచి భారత్‌కు తీసుకెళ్లాలని ఆయన కోరుతున్నారు. 2017 నుంచి బక్తర్ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు రసూల్. మరో ప్రొఫెసర్‌ జార్ఖండ్‌కు చెందిన అఫ్రోజ్ అలాం. ఆయన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌. క్యాంపస్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని అఫ్రోజ్ పేర్కొన్నారు. ప్రతిరోజు భయం భయంగా గడుస్తోందని, వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తరలించాలని అన్నారు.         

Updated Date - 2021-08-18T23:42:27+05:30 IST