తూర్పు మన్యంలో నిరాశ.. lokesh పర్యటనతో చిగురించిన ఆశ..

ABN , First Publish Date - 2021-09-15T19:09:26+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన వైసీపీలో గుబులు పుట్టిస్తోందా? లోకేశ్‌కు నిర్వాసితులు బ్రహ్మరథం పట్టారా? ముఖ్యమంత్రి జగన్‌పై లోకేశ్

తూర్పు మన్యంలో నిరాశ..  lokesh పర్యటనతో చిగురించిన ఆశ..

వివిధ సమస్యలతో నిర్వాసితులు సతమతం..

లోకేశ్ పర్యటనలో గోడువెళ్లబోసుకున్న వైనం..

నిర్వాసితులకు అండగా ఉంటామన్న లోకేశ్..

వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్న లోకేశ్ పర్యటన


తూర్పు గోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన వైసీపీలో గుబులు పుట్టిస్తోందా? లోకేశ్‌కు నిర్వాసితులు బ్రహ్మరథం పట్టారా? ముఖ్యమంత్రి జగన్‌పై లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయా? నిస్తేజంగా ఉన్న టీడీపీ క్యాడర్‌లోనూ లోకేశ్ పర్యటన నూతన ఉత్తేజం నింపిందా? లోకేశ్ పర్యటన తర్వాత తూర్పు మన్యంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఏమిటో.. ‘ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడర్‌లో చూద్దాం..


ముంపు గ్రామాలపై వైసీపీ నిర్లక్ష్యం..

వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పు మన్యం ప్రజలకు గత రెండేళ్లుగా చేదు అనుభవం చవిచూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ముంపు గ్రామాలను నిర్లక్ష్యం చేయటాన్ని నిర్వాసితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం గోదావరి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం సరైన సహాయక చర్యలు చేపట్టకపోవటంతో గిరిపుత్రులు కొండలపై తలదాచుకుని నరకయాతన అనుభవించారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గోదావరికి వరుసగా వరదలు వచ్చాయి. వరదల వల్ల నష్టపోయిన బాధితుల కోసం ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం కూడా నిర్వాసితులకు అందని దయనీయ పరిస్థితులు తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాలతో పాటు రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోని ముంపు గ్రామాల్లో నెలకొంది.


నిర్వాసితుల్లో ఆందోళన..

ప్రభుత్వం పునరావాస కాలనీలు నిర్మించకుండానే బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించటం, జేసీబీలతో ఇళ్లను కూలగొట్టడం వంటి పరిస్థితులు నిర్వాసితుల్లో భయాందోళనకు దారితీశాయి. నిర్మాణాలు పూర్తయిన పునరావాస కాలనీల్లో సరైన సదుపాయాలు లేకపోవటం వల్ల నిర్వాసితులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొంతమంది నిర్వాసితులకు ఇప్పటివరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు.


పునరావాస కాలనీల నిర్మాణం పూర్తికాలేదు. నిర్వాసితులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి, స్థానిక ఎంపీ, జిల్లాకు చెందిన మంత్రులు మొహం చాటేయటంతో సమస్యల గోడు వినేనాథులెవరంటూ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తమకు న్యాయం జరగదన్న నిరాశతో తూర్పుమన్యంలో నిర్వాసితులు కాలం గడుపుతున్నారు.


సమస్యలు తెలుసుకున్న లోకేశ్..

ప్రభుత్వ ధోరణితో నిర్లక్ష్యానికి గురవుతున్న తూర్పు మన్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండు రోజుల పాటు పర్యటించారు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్ పురం, చింతూరులలోని ముంపు గ్రామాలతో పాటు రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లోని ముంపు గ్రామాల పునరాస కాలనీల్లో లోకేశ్ పర్యటించి నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. నిర్వాసితులు తమ గోడును లోకేశ్‌కు వివరించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం పది లక్షల రూపాయలు ఇప్పటివరకు విడుదల చేయలేదని నిర్వాసితులు లోకేశ్ పర్యటనలో గగ్గోలు పెట్టారు. వరదల సమయంలో పునారావాసం కల్పించలేదనీ, కనీసం వాటర్ ప్యాకెట్లు ఇవ్వలేదనీ, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.


అండగా ఉంటామని హామీ..

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో తీవ్ర ఆవేదనతో ఉన్న నిర్వాసితులకు లోకేశ్ పర్యటన మనో ధైర్యాన్ని నింపింది. నిర్వాసితులకు అండగా ఉంటాం, ప్రభుత్వం నుంచి చట్టప్రకారం రావాల్సిన పునరావాస ప్యాకేజీ.. ప్రతీ నిర్వాసితుడికి అందేవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని లోకేశ్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. తూర్పు మన్యంలో నిర్వాసితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిర్వాసితులతో లోకేశ్ మమేకం కావటం, ముఖ్యమంత్రి జగన్‌పై లోకేశ్ ఘాటుగా విమర్శలు చేయటం వంటి పరిణామాలు ప్రస్తుతం తూర్పు మన్యంలో హాట్ టాపిక్‌గా మారాయి.


నాయకుల్లో ఉత్తేజం తెచ్చిన పర్యటన..

ఇక లోకేశ్‌ పర్యటన తర్వాత జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అధికారుల్లోనూ కదలిక వచ్చింది. లోకశ్ పర్యటన పుణ్యమా అంటూ ప్రభుత్వం దిగొచ్చి తమకు న్యాయం చేస్తుందన్న ఆశ నిర్వాసితుల్లో మళ్లీ వ్యక్తమవుతోంది. మరోవైపు వరుసగా రెండు సార్లు రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్‌లోనూ లోకేశ్ పర్యటన నూతనోత్తేజాన్ని నింపింది. కరోనా బారిన పడి మృతి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇవ్వటం క్యాడర్‌లో మనోధైర్యాన్ని నింపింది.


లోకేశ్ పర్యటనకు విశేష స్పందన..

రంపచోడవరం నియోజకవర్గంలో ఇన్నాళ్లు యాక్టివ్‌గా లేని టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా లోకేశ్ పర్యటనలో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో లోకేశ్ పర్యటన రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద తూర్పు మన్యంలో రెండు రోజుల పర్యటన లోకేశ్ వ్యక్తిగత ఇమేజ్‌ను మరింత పెంచిందన్న చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-09-15T19:09:26+05:30 IST