Advertisement
Advertisement
Abn logo
Advertisement

కందిపైనే ఆశలు

  • అధిక వర్షాలనూ తట్టుకున్న పంట
  • కాత దశలో చేన్లు.. ముమ్మరంగా సస్యరక్షణ 
  • కందితోనైనా నష్టాలను పూడ్చుకోవాలని రైతుల ఆశ

మోమిన్‌పేట/బషీరాబాద్‌: వానాకాలం ఫసల్‌ ముగిసింది. పత్తి, సోయాబీన్‌, పెసర, మినుము పంటలు చేతికొచ్చాయి. ఇప్పటికే పెసర, జొన్న, మినుము పంటల నూర్పిడి పూర్తయింది. అంతర పంటగా సాగైన కంది కూడా కోత దశకు వచ్చింది. వర్షాలు ఎక్కువ కురిసినా పత్తిలో అంతర పంటగా వేసిన కందికి మేలే చేసింది. కందికాయ గట్టి పడేందుకు ఈ తేమ ఉపయోగపడనుంది. రైతులు తడులు అందించాల్సిన అవసరం లేకుండా పోయింది. పత్తిలో జరిగిన నష్టాన్ని కంది అయినా భర్తీ చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కంది పంటపై సస్యరక్షణ చేపడుతూ కాపాడుకుంటున్నారు. 


  • కాతకొచ్చిన కంది.. రైతుల సస్యరక్షణ చర్యలు

మోమిన్‌పేట మండలంలో అంతర పంటగా కంది 5,400 ఎకరాల్లో వేశారు. ప్రభుత్వాలు కందికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,300 నిర్ణయించాయి. రైతువేదికల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తమకు రవాణా భారం తగ్గుతుందని రైతులు అంటున్నారు. బషీరాబాద్‌ మండలంలో 22,650 ఎకరాల్లో సాగవుతున్న కంది పంట ఆశాజనకంగా ఉంది. కాత దశలో పంట ఉంది. చీడపీడల నుంచి పంట రక్షణకు రైతులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని కోరుతున్నారు. 


  • కంది పంట ఆశాజనకంగా ఉంది

ఈ సంవత్సరం కంది పంట ఆశాజనకంగా ఉంది. భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. పత్తిలో అంతరపంటగా వేసిన కంది బాగుంది. పత్తి, కంది, వరి పంటలే కాకుండా ప్రత్యామ్నాయ మెట్ట పంటలు, కూరగాయలు, చిరుధాన్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి

- రాధ, వ్యవసాయాధికారి, మోమిన్‌పేట


  •  రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. భారీ వర్షాలతో వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పత్తి బాగా పండితే ఎకరానికి 10-12క్వింటాళ్లు వచ్చేది. ఇప్పుడు రెండు క్వింటాళ్లు కూడా రాలేదు. ప్రభుత్వాలు ఎకరానికి రూ.10వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

- బి.మశ్చేందర్‌, రైతు, టేకులపల్లి

Advertisement
Advertisement