నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2022-03-11T06:22:42+05:30 IST

సీఎం కేసీఆర్‌ భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

- రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

- జిల్లాలో 1,063 పోస్టులు

- కోచింగ్‌ కేంద్రాలు, గ్రంథాలయాలకు యువత పరుగులు

- పుస్తకాలతో కుస్తీ

జగిత్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఖాళీల వివరాలను వెల్లడిస్తూ ఉద్యోగాల భర్తీకి ఆమోద ముద్ర వేశారు. తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగులు, యువత, విద్యావంతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక సమయం వృథా చేయకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సర్కారు అడుగులు వేయడంతో ప్రిపరేషన్‌పై యువత దృష్టి సారిస్తోంది. ఉద్యోగాలు సాధించుకోవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సువర్ణఅవకాశాలు అని భావిస్తున్నారు. 

ఫ బాసర జోన్‌ పరిధిలో 2,328 పోస్టులు...

జగిత్యాల జిల్లా బాసర జోన్‌ పరిధిలోకి వస్తుంది. జోనల్‌ పోస్టులు 2,328 ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంబంధిత పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు నుంచి గెజిటెడ్‌ అధికారి వరకు ఈ పోస్టులున్నాయి. వీటన్నింటిని జోనల్‌ పరిధిలో భర్తీ చేస్తారు. వీటితో పాటు మల్టీజోన్‌ పరిధిలో 6,370 పోస్టులున్నాయి. ఈ జోనల్‌ పరిదిలో గ్రూప్‌-1 క్యాడర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో ఖాళీగా 1,063 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారు. జిల్లా పరిధిలోనే ఎంపిక కమిటీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లో అటెండరు నుంచి మొదలుకొని జూనియర్‌ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు ఇతర  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ జిల్లా పరిధిలో భర్తీ చేయనున్నారు.

 12,520 మంది నిరుద్యోగులు.. 

జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయంలో 12,520 మంది నిరుద్యోగులు వివిధ అర్హతలతో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత యేడాది చివరి నాటికి జిల్లాలోని ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌లో 12,520 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. ఇందులో ఎస్సీలు 2,324, ఎస్టీలు 295, బీసీలు 8,874, మహిళలు 5,696 మంది ఉన్నారు. జిల్లాలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిలో పదో తరగతి పూర్తి చేసిన వారు 1,827 మంది, ఇంటర్‌ 2,035, డిగ్రీ 6,597, టైపిస్ట్‌ 71, బీఈడీ 686, ఎస్‌జీబీటీ(సెకండరీ గ్రేడ్‌ టీచర్‌) 175, ఎల్‌సీఈ(లైసెన్సిటీవ్‌ ఇన్‌ సివిల్‌ ఇంజనీర్‌) 8, ఎల్‌ఎంఈ 11, ఎల్‌ఈఈ 30, ఇతర డిప్లోమా 7, ఐటీఐ 383, పారామెడికల్‌ 129, అన్‌స్కిల్డ్‌ 297, ఇతరులు 264 మంది ఉపాధి కల్పనా కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

ప్రిపరేషన్‌కు కసరత్తులు..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ నుండడంతో జిల్లాలోని గ్రంథాలయాలు, కోచింగ్‌ కేంద్రాలకు నిరుద్యోగులు పరుగులు తీస్తున్నారు. ప్రిపరేషన్‌పై కసరత్తులు చేపడుతున్నారు. హైద్రాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో గల కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లిసైతం ప్రిపేర్‌ కావడంపై దృష్టి సారిస్తున్నారు. మెరుగైన శిక్షణనుపొందడంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాలకు మరింత తాకిడి పెరిగే అవకాశాలున్నాయి. అధికారులు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఇతర పుస్తకాలు, వసతులను కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ-లైబ్రరీలను సైతం అందుబాటులోకి తేవాలన్న అభిప్రాయాలను యువత వెల్లడిస్తోంది.

 వయో పరిమితి పెంపుతో...

ప్రభుత్వం వివిధ వర్గాలకు ఉద్యోగ నియామకాల వయస్సును పెంచడం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తోంది. ఉద్యోగాల భర్తీలో ఓసీలకు 44 సంవత్సరాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 49 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడంతో ఆ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఉద్యోగాల్లో సైతం 95 శాతం స్థానిక జిల్లా వారికే కేటాయించనుండడం సైతం నిరుద్యోగుల్లో ఆశలు నింపుతోంది. స్థానికత అమలుతో జిల్లా వాసులకు ఎక్కువ పోస్టులు దక్కనున్నట్లు భావిస్తున్నారు. జోనల్‌, మల్టీజోనల్‌ ఉద్యోగాలకు ఇతర ప్రాంతాల అభ్యర్థులు పోటీ పడవచ్చు. సాధారణంగా వివిధ శాఖల్లో జిల్లా స్థాయి, జోనల్‌ స్థాయిల్లో నియామకాలను ప్రభుత్వం చేపడుతోంది. జిల్లా స్థాయిలో అటెండరు, రికార్డు అసిస్టెంటు, జూనియర్‌ అసిస్టెంటు తదితర పోస్టులుంటాయి. జోనల్‌ స్థాయిలో సీనియర్‌ అసిస్టెంటు, సూపరింటెంటెండ్‌ ఉద్యోగాలు ఉంటాయి. శాఖలను బట్టి జోనల్‌ వ్యవస్థలో నియామకాలు మారుతుంటాయి. మల్టీ జోనల్‌ వ్యవస్థలో గ్రూప్స్‌ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో తగిన న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

 టీఆర్‌ఎస్‌ నేతల సంబరాలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు సంబరాలు జరుపుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిదిలోని పలు మండలాల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, గులాబీ నేతలు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. పలు ప్రాంతాల్లో మిఠాయిలు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌లలో కాంట్రాక్టు లెక్చరర్లు పాలాభిషేకం చేశారు.

ఫ సీఎం కేసీఆర్‌ను కలిసిన నేతలు..

ఉద్యోగాల భర్తీకై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2022-03-11T06:22:42+05:30 IST