హోరాహోరీ

ABN , First Publish Date - 2021-10-18T04:48:49+05:30 IST

వైరా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు హోరాహోరీ తలపడుతున్నారు. టీఆర్‌ఎస్‌, సీపీఎం ఒక కూటమిగా, కాం

హోరాహోరీ
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ప్రతిష్టాత్మకంగా మత్స్యపారిశ్రామిక సంఘం ఎన్నికలు

భారీగా ఓటర్లకు నగదు పంపిణీ

వైరా, అక్టోబరు 17: వైరా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అభ్యర్థులు హోరాహోరీ తలపడుతున్నారు. టీఆర్‌ఎస్‌, సీపీఎం ఒక కూటమిగా, కాంగ్రెస్‌ ఒంటరిగా తమ ప్యానెల్‌ అభ్యర్థులను బరిలో నిలిపి విజయం కోసం హోరాహోరీ తలపడుతున్నారు. ఇదే క్రమంలో ఓటర్లకు కరెన్సీ నోట్లు భారీగా పంపిణీ చేశారు. ఇతరత్రా ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ఎన్నిక జరుగుతోంది. వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లోని 11గ్రామాలకు చెందిన 900మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. ఒక్కో ఓటరు తొమ్మిదేసి ఓట్లు వేయాల్సి ఉంది. ఏకగ్రీవ ఎన్నిక కోసం మొదట్లో ప్రయత్నాలు జరిగాయి. టీఆర్‌ఎస్‌, సీపీఎం, కాంగ్రెస్‌ మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది. మొదట టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి, కాంగ్రెస్‌ ఉపాధ్యక్ష పదవి, సీపీఎం కార్యదర్శి పదవి తీసుకొనేలా మొదలైన చర్చలు కొలిక్కిరాకుండానే విఫలమయ్యాయి. దాంతో టీఆర్‌ఎస్‌, సీపీఎం జట్టు కట్టాయి. టీఆర్‌ఎస్‌ ఆరు డైరెక్టర్ల పదవులతోపాటు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను, సీపీఎం మూడు డైరెక్టర్‌ పదవులతోపాటు కార్యదర్శి పదవిని తీసుకొనేలా ఒప్పందం కుదిరింది. ఈ కూటమి నుంచి టీఆర్‌ఎస్‌కు చెందిన షేక్‌ రహీం, షేక్‌ ఉద్దండు, గాదె నర్సింహారావు, షేక్‌.సైదులు, మంకెన నర్సింహారావు, షేక్‌ చాంద్‌మియా, సీపీఎం నుంచి పగిడిపల్లి కాటయ్య, షేక్‌.రహీం, చింతనబోయిన రామారావు పోటీలో ఉన్నారు. షేక్‌ రహీం అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి ఆవుల నాగేశ్వరరావు, కంకణాల వెంకటేశ్వర్లు, గరిక వెంకటేశ్వర్లు, చింతనబోయిన కృష్ణ, తాటిక్రింది గోవిందరావు, మంకెన అచ్చయ్య, మంగరాయి రామకృష్ణ, షేక్‌.జానిమియా, జి.రత్తయ్య పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమి నుంచి దాదాపు 700మందికిపైగా ఓటర్లకు ఆదివారం రాత్రి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 200మందికిపైగా ఓటర్లకు నగదు పంపిణీ చేశారని చర్చించుకుంటున్నారు. ప్రత్యరి కాంగ్రెస్‌ కూడా తమ ఆర్థిక వనరుల మేరకు ఎంతోకొంత కొంతమంది ఓటర్లకైనా డబ్బు పంచేందుకు సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. రూ.వెయ్యి నుంచి రూ.రెండువేల వరకు డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారనే చర్చ సర్వత్రా నెలకొంది.

నేడు చేపల సొసైటీ ఎన్నికలు

 వైరా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారి టి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పూర్తిచేశారు. తొమ్మిది మంది డైరెక్టర్లకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి. వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లోని 11గ్రామాలకు చెందిన 900మంది మత్స్యకారులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జనరల్‌ కేటగిరిలో ఎనిమిది మంది, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఒక డైరెక్టర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. జనరల్‌ కేటగిరిలో 23మంది అభ్యర్థులతో బ్యాలెట్‌ ముద్రించారు. వీరిలో ఎనిమిది మంది అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో నలుగురు అభ్యర్థులతో ఒక బ్యాలెట్‌ ముద్రించారు. ఈ నలుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాల్సి ఉంటుంది. తమకు చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు 900మంది ఓటు వేయాల్సి ఉంటుంది. 225మంది ఓటర్లకు ఒకటి చొప్పున నాలుగు పోలింగ్‌ బూతులను ఏర్పాటుచేశారు. వైరా పాత లంబాడీ తండా సమీపంలో నిర్మించిన రైతువేదికలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నిక జరుగుతుంది. భోజనాల అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. 18న ఎన్నికైన తిమ్మిది మంది డైరెక్టర్లలో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా, ఇంకొకరిని కార్యదర్శిగా 19వతేదీన ఎన్నుకుంటారు.

 

Updated Date - 2021-10-18T04:48:49+05:30 IST