నల్గొండ/నిడమనూరు : అన్నప్రాసనకోసం వెళ్తూ ఓ కుటుంబం అనంతలోకాలకు పయనమైంది. నిడమనూరు మండలకేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సర్పంచ్ తరి శ్రీనివాస్(32)తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన కొల్లి నాగరాజు పుచ్చకాయల వ్యాపారం చేస్తుంటాడు. మిర్యాలగూడకు చెందిన టాటాఎస్ వాహనాన్ని కిరాయికి తీసుకొని చండూరు వెళ్లి పుచ్చకాయలు కొనుగోలు చేసి తిరిగి ముప్పారం వెళుతున్నాడు.
అదే సమయంలో మిర్యాలగూడ నుంచి హాలియా వెళ్తున్న బియ్యం లోడు లారీ టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టి సుమారు 50అడుగుల దూరం లాక్కెళ్లి డివైడర్‌ను దాటింది. అదే సమయంలో నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో అత్తగారింట్లో అన్నప్రాసన కార్యక్రమానికి బైక్‌పై భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్తున్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ బైక్ ప్రమాదవశాత్తు లారీ కిందకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య విజయ(30) శ్రీనివాస్ కుమార్తె విద్యశ్రీ(5), కుమారుడు కన్నయ్య(3) మృత్యువాతపడ్డారు.