18 గ్రామాలు.. ఆరుగురే సిబ్బంది

ABN , First Publish Date - 2021-05-08T05:52:11+05:30 IST

మారుమూల గ్రామాలకు సేవలందించే వైద్యశాల సిబ్బంది కొరతతో కొట్టుబిట్టాడుతున్నది. కరోనా కమ్ముకొస్తున్నవేళ సదుపాయాలులేక ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. దుబ్బాక మండలం రామక్కపేట పీహెచ్‌సీలో వైద్యసిబ్బంది కొరతతో సేవలకు ఆటంకం కలుగుతున్నది. ఉన్నవారు అదనపు బాద్యతలు నిర్వర్తించినా ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోవడంలేదు. రామక్కపేట పీహెచ్‌సీ పరిధిలో 18 గ్రామాలు, 7 సబ్‌సెంటర్లు ఉన్నాయి.

18 గ్రామాలు.. ఆరుగురే సిబ్బంది
రామక్కపేట పీహెచ్‌సీ భవనం

అదనంగా 7 సబ్‌సెంటర్లు

ఒక్కొక్కరికి 4 గ్రామాల బాధ్యత

తీవ్రమైన పనిఒత్తిడిలో  రామక్కపేట పీహెచ్‌సీ సిబ్బంది

కరోనావేళ శక్తికిమించిన భారం


దుబ్బాక, మే 7: మారుమూల గ్రామాలకు సేవలందించే వైద్యశాల సిబ్బంది కొరతతో కొట్టుబిట్టాడుతున్నది. కరోనా కమ్ముకొస్తున్నవేళ సదుపాయాలులేక ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. దుబ్బాక మండలం రామక్కపేట పీహెచ్‌సీలో వైద్యసిబ్బంది కొరతతో సేవలకు ఆటంకం కలుగుతున్నది. ఉన్నవారు అదనపు బాద్యతలు నిర్వర్తించినా ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోవడంలేదు. రామక్కపేట పీహెచ్‌సీ పరిధిలో  18 గ్రామాలు, 7 సబ్‌సెంటర్లు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రతీ సబ్‌సెంటర్‌కు ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉండాల్సినచోట ఆస్పత్రిలో ప్రస్తుతం కేవలం ఆరుగురు ఏఎన్‌ఎంలు మాత్రమే ఉన్నారు. ఒక్కరికీ నాలుగు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించారు.పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌, హెల్త్‌అసిస్టెంట్‌, హెచ్‌వో, స్టాఫ్‌నర్సు మాత్రమే ఉన్నారు. ల్యాబ్‌టెక్నీషియన్‌ లేకపోవడంతో హెల్త్‌అసిస్టెంటే ల్యాబ్‌టెక్నీషియన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రోగులు వస్తే, స్టాఫ్‌నర్సు, హెల్త్‌అసిస్టెంట్‌ స్వయంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యపరీక్షలు, చికిత్స, ఇతర సేవలందించేందుకు తప్పనిసరిగా రోజూ ఇద్దరు ఏఎన్‌ఎంలో సేవలందిచాల్సి ఉంటుంది.  దీంతో రోజూ నలుగురు మాత్రమే క్షేత్రస్థాయిలో సేవలందిస్తారు. పీహెచ్‌సీ పరిధిలో 26 మంది ఆశా వర్కర్లు ఉన్నప్పటికీ వారు కేవలం ఏఎన్‌ఎంకు సహాయకులుగానే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో గర్భిణులు ప్రసవాల కోసం దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి, సిద్దిపేట జీహెచ్‌సీ కి తరలిస్తున్నారు.


అదనపు బాధ్యతలతో సతమతం

గ్రామాల్లో సేవలందించాల్సిన ఏఎన్‌ఎంలకు కరోనా పరీక్షల బాధ్యతలను అప్పగించడంతో సమస్యలు తప్పడంలేదు. కరోనా వ్యాక్సినేషన్‌ కూడా ఏఎన్‌ఎంలే చేస్తున్నారు. ప్రతీవారం గర్భిణులకు వైద్యసేవలు, చిన్నారులకు టీకాలు వేయడం తదితర బాధ్యతలకు అదనంగా ఈ సేవలు అందిస్తున్నారు. హోంఐసోలేషన్‌, క్వారంటైన్‌ పర్యవేక్షణ కూడా వీరికే అప్పగించారు. ఉన్న ఆరుగురు ఏఎన్‌ఎంలు 18 గ్రామాల్లో కరోనా పరిస్థితులను తెలుసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు గ్రామాల్లో శానిటేషన్‌, ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి పరీక్షలు చేసే బాధ్యతలు కూడా ఏఎన్‌ఎంలే నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో ఏఎన్‌ఎంలపై విపరీతమైన పనిభారం పడుతున్నది. అటు గ్రామాల్లో సేవలందించడం, కరోనా సేవలు, ఆస్పత్రిలో విధులతో కంటిమీద కునుకులేకుండా పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రతీరోజు ఒక్కో ఏఎన్‌ఎం 4 గ్రామాల్లో పర్యటించి, రోజువారీ నిర్వర్తించాల్సిన పనులను చూసుకుని అనంతరం ఆస్పత్రిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని కేటాయించాలని ప్రజలు, పీహెచ్‌సీ సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2021-05-08T05:52:11+05:30 IST