నిర్లక్ష్యమే కొంపముంచుతోంది

ABN , First Publish Date - 2020-08-11T10:35:41+05:30 IST

జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయంలోపు కొవిడ్‌ బాధితుల్లో 11మంది మృతిచెందారు.

నిర్లక్ష్యమే కొంపముంచుతోంది

హాస్పటల్‌ ఐసోలేషన్‌ అంటే భయం 

హోమ్‌ ఐసోలేషన్‌లో నిర్లక్ష్యం 

వ్యాధి తీవ్రత, ప్రాణాలు కోల్పోవటంలోనూ అదే ప్రధానం 

ఒంగోలులో మళ్లీ లాక్‌డౌన్‌ 

అదే దారిలో మరికొన్ని పట్టణ ప్రాంతాలు 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయంలోపు కొవిడ్‌ బాధితుల్లో 11మంది మృతిచెందారు. గడిచిన 7రోజుల్లో అయితే 54. అధికారికంగా ఇప్పటివరకు మొత్తం కొవిడ్‌ మృతులు 123. ఆదివారం రాత్రి 7గంటలలోపు మరికొందరు మృత్యువాత పడ్డారు. గడచిన 24గంటల్లో అధికారికంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 700కిపైగా ఉంది. ఇదంతా అధికారిక సమాచారం. ప్రభుత్వం గుర్తించని మృతులు అంతకు రెట్టింపు ఉన్నారు. ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుని పొలోమని పక్క జిల్లాలు, పక్క రాష్ర్టాల్లో, జిల్లాలోని ప్రభుత్వ అనుమతులు లేని వైద్యశాలల్లో కూడా చికిత్సపొందుతున్న పాజిటివ్‌ల సంఖ్య రెట్టింపే ఉంది.


ఇక వైద్యశాలలో చేరేందుకు బాధితులు జంకుతుండగా వసతుల లేమి అంతకుమించిన నిర్లక్ష్యంతో హోమ్‌ క్వారంటైన్‌ విధానాన్ని బాధితులు తుంగలో తొక్కుతున్నారు. ఇదంతా ప్రజల నిర్లక్ష్యం లేక భయంతో వ్యాధి విజృంభిస్తుందనటానికి కారణమైతే ఇప్పటికే అదుపుతప్పుతున్న పరిస్థితిని యంత్రాంగం అసలు కట్టడి చేయగలుగుతుందా లేదా అన్న అనుమానాలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో కాస్తంత వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి చికిత్స కోసం వేచి ఉండే బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఒంగోలులోని రిమ్స్‌ ఆవరణలోనే పడకలు లభించక ఏరోజు చూసినా వందలాదిమంది బాధితులు చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే పాజిటివ్‌ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోవటం, మృతులు పెరిగిపోవటానికి ప్రజల నిర్లక్ష్యం కూడా తోడైంది. ఆంధ్రజ్యోతి బృందం జరిపిన ఓ పరిశీలనలో ఈ విషయం తేటతెల్లమైంది.


లాక్‌డౌన్‌ల విధింపుతో వ్యాధి విస్తరణ తగ్గినప్పటికీ ఇటు వ్యాపారులు అటు వినియోగదారులు కొంతమేర ఇబ్బందిపడిన మాట కూడా వాస్తవం. అయితే వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గిన ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులపై వత్తిడి తేవటం వారు తదనుగుణంగా వ్యాపారాల నిర్వహణకు అవకాశాన్ని ఇచ్చారు. దీంతో  దుకాణల్లో పనిచేసేవారు, ఆ షాపుల్లో గంటలకొద్దీ ఉండి వస్తువులు కొనుగోలు చేసినవారు కరోనా బాధితులుగా మారిపోతున్నారు. ఆ షాపుల నిర్వాహకుల్లో అత్యధికమంది కరోనా బాధితులయ్యారు. అలా ఒంగోలులో వందమంది వ్యాపారులు బాధితులయ్యారు. కందుకూరులో కరోనా బాధితులుగా మృతిచెందిన వారిలో కిరాణ షాపుల నిర్వాహకులు, కూరగాయల వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు.


ఐసోలేషన్‌ అంటే భయం.. హోమ్‌ క్వారంటైన్‌ అంటే నిర్లక్ష్యం

ప్రభుత్వ, ప్రైవేటువైద్యశాలల్లో చేరి చికిత్స పొందేందుకు ఇప్పటికీ చాలామంది జంకుతున్నారు. నిజానికి చికిత్సపరంగా ఒంగోలులోని ప్రభుత్వ వైద్యశాల (రిమ్స్‌) అద్భుతంగా ఉంది. కానీ భయం వెంటాడుతోంది. అక్కడ చేరిన చాలామంది బాధితుల్ని కుటుంబసభ్యులు పట్టించుకోకపోవటం. దీనికితోడు అక్కడ పరపతి ఉన్నవారికి దొరికే పడకలు, గదులు కానీ వైద్యసౌకర్యం కానీ పరపతి లేనివారికి దొరకకపోవటం, భోజన సదుపాయంలోనూ లోపాలు వెరసి అక్కడ చేరేందుకు చాలామంది జంకుతున్నారు. మరోవైపు ప్రైవేటు వైద్యశాలలో చేరితే భారీగా పడుతున్న బిల్లు భారాన్ని మోయలేకపోతున్నారు. వెరసి ఐసోలేషన్‌కి వెళ్లేందుకు అనేకమంది జంకుతున్నారు. ఆ నిర్లక్ష్యమే చాలామంది కొంపముంచుతోంది. ఒంగోలు సమీప గ్రామంలో శనివారం మృతిచెందిన ఓ యువకుని ఉదంతం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. జ్వరం వచ్చి పదిరోజులు గడిచినా ఆయన వైద్యశాల వైపు వెళ్లలేదు. శనివారం రాత్రికి ఒక్కసారిగా ఊపిరాడని పరిస్థితి. అప్పుడు పరుగులు తీసినా ఏ వైద్యశాల వారూ చేర్చుకోలేదు. చివరికి మృత్యువాతపడ్డారు.


సోమవారం పరీక్షలు చేస్తే అతని తల్లికీ పాజిటివ్‌ అని వచ్చింది. అన్నీ తెలిసిన ఓ యువకుడు కూడా పాజిటివ్‌ అని చెప్పుకునేందుకు కూడా భీతిల్లి జ్వరంతో ఇబ్బందిపడి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని మృత్యువాత పడక తప్పలేదు. ఇదే సమయంలో 34 ఏళ్ల ఓ యువకుడు తనకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే రిమ్స్‌లో చేరాడు. మూడు రోజులపాటు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉన్న అతను నాల్గవ రోజు శ్వాస సమస్య, నీరసం, ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవటం లాంటి ఇబ్బందులకు గురయ్యాడు. వెంటనే వైద్యులు అతడిని ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్‌ పెట్టి పూర్తిస్థాయి చికిత్స ఇవ్వటంతో కోలుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణే నిర్లక్ష్యంగా ఉండేవారికి, ముందు జాగ్రత్తపడేవారికి వ్యత్యాసం ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేస్తుంది. ఇక హోమ్‌ ఐసోలేషన్‌కి ఇచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవన్న భావనతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించటం బాధితులు పెరిగిపోవటానికి కారణమవుతోంది.

Updated Date - 2020-08-11T10:35:41+05:30 IST