బెడ్డు ఇస్తారా.. ఇక్కడే చావమంటారా..?

ABN , First Publish Date - 2021-05-11T06:24:18+05:30 IST

బెడ్డు ఇస్తారా.. ఇక్కడే చావమంటారా.. అంటూ కరోనా బాధితులు కంగారు పుట్టించారు. సూపర్‌ స్పెషాలిటీ కొవిడ్‌ ఆస్పత్రికి సోమవారం ఉదయం నుంచి పాజిటివ్‌ బాధితులు ఎక్కువ మంది తరలి వచ్చారు. బెడ్డు కోసం హెల్ప్‌ డెస్క్‌ వద్దకు వెళ్లి, వేడుకున్నారు.

బెడ్డు ఇస్తారా.. ఇక్కడే చావమంటారా..?

సూపర్‌ స్పెషాలిటీలో బాధితుల పడిగాపులు

చేతులెత్తేసిన డాక్టర్లు, సిబ్బంది

జిల్లా ఆస్పత్రిలోనూ అదే దుర్భరస్థితి

అనంతపురం వైద్యం, మే10: బెడ్డు ఇస్తారా.. ఇక్కడే చావమంటారా.. అంటూ కరోనా బాధితులు కంగారు పుట్టించారు. సూపర్‌ స్పెషాలిటీ కొవిడ్‌ ఆస్పత్రికి సోమవారం ఉదయం నుంచి పాజిటివ్‌ బాధితులు ఎక్కువ మంది తరలి వచ్చారు. బెడ్డు కోసం హెల్ప్‌ డెస్క్‌ వద్దకు వెళ్లి, వేడుకున్నారు. బెడ్లు ఖాళీ లేవని మరో చోటికి వెళ్లాలని సమాధానం ఇచ్చారు. అప్పటికే దాదాపు 50 మంది వరకు కరోనా బాధితులకు పల్స్‌ రేట్‌ తగ్గుతూ వచ్చింది. 80లోపే కొందరికి ఉండగా.. మరికొందరికి 60కు పడిపోయింది. హెల్ప్‌ డెస్క్‌ వద్ద ఉన్న సిబ్బంది పల్స్‌ చూసి భయపడి ఇక్కడే ఉంటే ఎలా మరో చోటుకి వెళ్లాలనీ, బెడ్లు లేవనీ, తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు బెడ్డు ఇవ్వండి.. లేదంటే ఇక్కడే చస్తాంలే అంటూ అక్కడే కూర్చున్నారు. కొందరు ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోయారు. అయినా డాక్టర్లు, సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు సైతం ఏ మాత్రం వారి పట్ల కరుణ చూపలేదు. బెడ్లు లేవనీ, చేర్చుకోలేమని చెప్పి తప్పించుకున్నారు. కొందరు తీవ్ర అస్వస్థతకు లోనవటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు బాధిత వర్గాలు వాపోయాయి. ఇక జిల్లా ఆస్పత్రిలోనూ సోమవారం దయనీయ పరిస్థితే కనిపించింది. అనంతపురం నగరం అదర్శ్‌నగర్‌కు చెందిన మల్లమ్మ అనారోగ్యంతో కొవిడ్‌ ఓపీ వద్దకు రాగా.. వైద్యులు అడ్మిట్‌ చేసుకుని, చికిత్స అందించారు. ఆక్సిజన కూడా పెట్టారు. అయినా, ఆమె మరణించింది. దీంతో ఆమె భర్త ధర్మానాయక్‌.. డాక్టర్లు, సిబ్బంది సకాలంలో వైద్య సేవలందించలేదని ఆక్సిజన లేని సిలిండర్‌ను పెట్టారని అందుకే తన భార్య చనిపోయిందంటూ ఓపీ కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమవుతూ ఆరోపించాడు. చాలామంది బెడ్లు లేక పడిగాపులు కాస్తూ కనిపించారు. మరికొందరు నేలపైనే ఉండి చికిత్సలు పొందుతూ కనిపించారు. కుర్చీల్లో కూర్చోబెట్టి ఆక్సిజన అందిస్తూ వైద్య చికిత్సలు చేస్తూ వైద్యులు, సిబ్బంది కనిపించారు.


Updated Date - 2021-05-11T06:24:18+05:30 IST