దారుణం.. రోగికి ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి సెక్యురిటీ గార్డు!

ABN , First Publish Date - 2021-06-08T01:14:06+05:30 IST

పాకిస్థాన్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో తాజాగా దారుణం జరిగింది. అక్రమార్జనకు అలవాటు పడిన ఓ వ్యక్తి

దారుణం.. రోగికి ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి సెక్యురిటీ గార్డు!

లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలోగల ఓ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. అక్రమార్జనకు అలవాటు పడిన ఓ వ్యక్తి తాను డాక్టర‌ునంటూ నమ్మబలికి ఓ రోగికి శస్త్రచికిత్స చేశాడు. ఆ తరువాత..బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆదివారం నాడు ఆమె మృతి చెందింది. సదరు నిందితుడు గతంలో ఆదే ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవాడు. లంచాలు మరిగిన అతడిని ఆస్పత్రి యాజమాన్యం రెండేళ్ల క్రితమే తొలగించింది. షమీనా బేగం అనే వృద్ధురాలి వీపుపై గాయంతో బాధపడుతుండటంతో శస్త్రచికిత్స చేసి నయం చేస్తానని నిందితుడు ఆమె బంధువులకు చెప్పాడు. వారు అందుకు అంగీకరించడంతో.. కొంత డబ్బు తీసుకుని అతడు రెండు వారాల క్రితం ఆ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స చేశాడు. ఆ సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో ఓ టెక్నీషియన్ కూడా ఉన్నాడు.


అనంతరం.. రెండు సార్లు బాధితురాలి ఇంటి వెళ్లిన నిందితుడు ఆమె గాయానికి కట్టుకట్టి వచ్చాడు. ఈ క్రమంలో ఆమె పరిస్థితి మరింత దిగజారీ ఆదివారం నాడు ఆమె మృతి చెందింది. ఆమె భౌతికదేహం ప్రస్తుతం మార్చరీలో ఉంది. వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఆమె ఏ కారణంతో మృతిచెందిందో నిర్ధారించాల్సి ఉంది. ‘‘ఇది చాలా పెద్ద ఆస్పత్రి, ఇక్కడ ఏ డాక్టర్ ఏం చేస్తున్నాడో, ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రతిక్షణం గమనించడం కుదరదు కదా.’’ అని సదరు ఆస్పత్రి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ గార్డును పోలీసుల అదుపులోకి అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా వారు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అయితే..పాకిస్థాన్ ప్రభుత్వాస్సత్రుల్లో పరిస్థితులు నిత్యం అల్లకల్లోలంగా ఉంటాయని, పని జరగాలంటే అక్కడి రోగులు, వారి బంధులు ఆస్పత్రి సిబ్బందికి లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందనేది స్థానిక మీడియా కథనం.

Updated Date - 2021-06-08T01:14:06+05:30 IST