Advertisement
Advertisement
Abn logo
Advertisement

అధిక ఫీజుల ఆస్పత్రులకు 10 రెట్ల జరిమానా

ఇతర ఆస్పత్రులు భయపడేలా చర్యలుండాలి

వేటు కాదు, డబ్బులు వాపస్‌ ఇప్పించాలి

కరోనాకు బలైన టీచర్లకు సాయం చేశారా?

కొవిడ్‌ గరిష్ఠ ఫీజులతో తాజా జీవో ఇవ్వండి

మూడో వేవ్‌కు సిద్ధం కాకుంటే దెబ్బతింటాం

అధిక ఫీజులు, మందులపై హైకోర్టు వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సలో కార్పొరేట్‌ ఆస్పత్రులు చేసిన దోపిడీకి 10 రెట్లు జరిమానా విధించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలు ఉల్లంఘించాలంటేనే మరో ఆస్పత్రి భయపడేలా చర్యలు ఉండాలని పేర్కొంది. అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై వేటు వేయడం కన్నా అవి వసూలు చేసిన సొమ్మును బాధితులకు తిరిగి ఇప్పించేలా చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించకుండా అరకొర సమాచారం ఎందుకు చెబుతున్నారని హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టులో చెప్పిన వివరాలను అఫిడవిట్‌లో ఎందుకు పొందుపర్చలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ఎన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు? ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్‌ ఏ విధంగా సమకూర్చుకుంటున్నాయి.


బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయా? థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మందులు తదితర వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వండి’’ అని ప్రజారోగ్యశాఖ డైరెకర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావును ఆదేశించింది. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు వసూలు చేసే గరిష్ఠ ఫీజులను నిర్దేశించే తాజా జీవో జారీ చేయాలని స్పష్టం చేసింది. అందులో పడకలు, నర్సింగ్‌ చార్జీలు, సీటీ స్కాన్‌, ఇతర టెస్టులకు ఫీజుల వివరాలు పొందుపర్చాలని తెలిపింది. లేని పక్షంలో ఎందుకు జీవో జారీచేయలేక పోయారో వివరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్‌ వేయడంతోపాటు ఆన్‌లైన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రంలో పిల్లలకు అందించే వైద్య సేవలు మెరుగుపర్చాలి. థర్డ్‌ వేవ్‌ను నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న చర్యలేమిటో వివరించాలి. అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు/కార్పొరేట్‌ ఆసుపత్రులు తమ తప్పు తెలుసుకుని సరిచేసుకుంటే వారి లైసెన్సులు పునరుద్ధరించాలి. ఆపత్కాలంలో చికిత్స అందించే ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేస్తే వాటిలో చికిత్స పొందే వారు ఇబ్బంది పడతారు. ఆయా ఆసుపత్రులు విధించే చార్జీలు భరించగలిగే వారు అక్కడే చికిత్సలు పొందుతారు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.


లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందిపడుతున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు నెలకు రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్న మాదిరిగానే రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు ఆర్థిక సహాయం అందించే విషయంపై పౌర సరఫరాలశాఖ అఫిడవిట్‌ వేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారినపడి మరణించిన ఉపాధ్యాయులను కరోనా వారియర్స్‌గా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశించింది. ఎంతమంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు? ఎంత మంది మరణించారు? వారికి ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చారో వివరిస్తూ విద్యాశాఖ మరో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి వైద్యం అందించాలని, మరణించిన వారిని కరోనా వారియర్స్‌గా గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని’’  మే 17న తామిచ్చిన ఉత్తర్వులను అమలుపర్చాలని ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమాకోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.


రాష్ట్రానికి ఒక్క ఆస్పత్రే ఎలా సరిపోతుంది?

నిరుడు లాక్‌డౌన్‌ సందర్భంగా దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యాల్లో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు హాజరయ్యారు. ‘‘థర్డ్‌ వేవ్‌ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర మొత్తానికి నీలోఫర్‌ హాస్పిటల్‌ ఒక్కదాన్నే నోడల్‌ ఆసుపత్రిగా గుర్తిస్తే అవసరాలు తీరుతాయా?’’ అని ధర్మాసనం ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై చర్చలు జరిపి తగిన సూచనలు చేసిందని డాక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి చికిత్సలు అందించడం కోసం 1,539 పడకలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయవాది ఎల్‌ రవిచందర్‌ జోక్యంచేసుకుంటూ... బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు సిద్ధం చేసిన పడకల్లో 970 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని, సుమారు 600 పడకలు రాష్ట్ర మొత్తానికి ఉన్నాయని,  ఇవి స్థానిక అవసరాలకు సరిపోవన్నారు. సీజే కల్పించుకుంటూ... థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మందులు సమకూర్చుకోకపోతే మనం దెబ్బతింటామని హెచ్చరించారు. చికిత్సలకు అవసరమైన పడకలు సిద్ధం చేస్తున్నామని, 40,105 పడకలు అందుబాటులోకి వచ్చినట్లు శ్రీనివాస్‌ తెలిపారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలనూ ఆక్సిజన్‌ బెడ్‌లుగా మార్చినట్లు ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ యూనిట్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా అనుమతి కోరే ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ యూనిట్లు ఉంటేనే అనుమతిస్తున్నామని, ఇప్పటికే ఉన్నవాటికి నెలలో ఆక్సిజన్‌ యూనిట్లు సమకూర్చుకోవాలని సూచించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. శివార్లలోని పాశమైలారంలో 200 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంగల యూనిట్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 


1,250 ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే ఇంజక్షన్లను కేటాయించిన విఽధంగా ఎందుకు సరఫరా చేయడం లేదని కేంద్రం తరఫున హాజరైన ఏఎస్జీ టి. సూర్యకరణ్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే ఇంజక్షన్లకు సంబంధించి 11,320 వాయల్స్‌ను తెలంగాణకు కేటాయించినట్లు ఏఎస్జీ తెలిపారు. 1,250 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్స అందించేందుకు అనుమతించామని డాక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నామని, కొందరు తమ తప్పును సరిదిద్దుకుని అధికంగా వసూలు చేసిన డబ్బులు వెనక్కు ఇచ్చారని చెప్పారు. ఈ విధంగా మొదటి వేవ్‌లో సుమారు రూ.3 కోట్లు బాధితులకు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. రెండో వేవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 174 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, 22 ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. 


బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకోసం ఈఎన్టీ ఆసుపత్రిని నోడల్‌ ఆసుపత్రిగా గుర్తించామని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 800 పడకలు బ్లాక్‌ ఫంగస్‌ రోగుల చికిత్సకు సిద్ధం చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 85శాతం కేసులు వస్తున్నాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి చికిత్స కోసం 72 ప్రైవేటు ఆసుపత్రులను అనుమతించామన్నారు. ఈ వ్యాజ్యాల్లో న్యాయవాదులు చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పౌరసరఫరాలశాఖ, విద్యాశాఖలు వేర్వేగా అఫిడవిట్లు దాఖలుచేయాలని స్పష్టం చేసింది.

అనుమతుల రద్దుపై న్యాయపోరాటం

డీహెచ్‌ ఆఫీసుకు ఆస్పత్రుల ఎండీల క్యూ

కొవిడ్‌ చికిత్సకు అనుమతులు రద్దు అయిన కార్పొరేట్‌  ఆస్పత్రుల ఎండీలు ప్రజారోగ్య సంచాలకుడి(డీహెచ్‌) కార్యాలయం  చుట్టూ తిరుగుతున్నారు.  కొవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలుచేశారన్న ఫిర్యాదుల ఆధారంగా పలు ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులలో కొవిడ్‌ చికిత్సకు అనుమతిని  మంగళవారం రద్దు చేసిన విషయం  తెలిసిందే. ఈ నేపథ్యంలో కిమ్స్‌ ఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు, సన్‌షైన్‌ ఎండీ డాక్టర్‌ గురవారెడ్డి తదితరులు బుధవారం  కోఠీలోని ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయంలో డీహెచ్‌ డాక్టర్‌ గడల శ్రీనివాసరావును కలిశారు. తమ ఆస్పత్రులకు మంచి పేరుందని, దాన్ని పోగొట్టవద్దని కోరారు. అనుమతుల రద్దుపై ఆరా తీశారు. తమ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్న రోగుల బిల్లుల వివరాలను డీహెచ్‌కు అందజేశారు. అనంతరం డాక్టర్‌ గురవారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ వైద్య చికిత్స లైసెన్స్‌ రద్దుపై న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనా మూడోదశ వస్తే చికిత్స కొనసాగించడానికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 

Advertisement
Advertisement