అభివృద్ధి కోసమే తాకట్టు

ABN , First Publish Date - 2021-06-14T09:12:08+05:30 IST

‘‘కొవిడ్‌ 19 వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.19 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భూములు తనఖా పెట్టకుండా, పన్నులు

అభివృద్ధి కోసమే తాకట్టు

కొవిడ్‌ ప్రభావంతో 19 వేల కోట్ల ఆదాయానికి గండి

కేంద్రం నిధులిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: ముత్తంశెట్టి 


విశాఖపట్నం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్‌ 19 వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.19 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భూములు తనఖా పెట్టకుండా, పన్నులు పెంచకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? విశాఖలో భూముల అమ్మకాలపై బీజేపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే ఈ రోజు భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చేదికాదు’’ అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.


ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే విశాఖకు రైల్వే జోన్‌ను వెంటనే తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ తీసుకురావాలన్నారు. ఆలయాల భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పరిపాలన రాజధాని ఏర్పాటుకు సరిపడ భూములు విశాఖలో ఉన్నాయన్నారు. 


‘పల్లా’ కుటుంబీకుల ఆక్రమణలో ప్రభుత్వ భూములు

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబీకులు గాజువాక ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. వాటిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. 


ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోండి: పల్లా

గాజువాక, జూన్‌ 13: ‘‘మేం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదు. 40 ఏళ్ల క్రితం నుంచి ఆ భూములు మా ఆధీనంలోనే ఉన్నాయి. భూమి హక్కు పత్రాలూ మా వద్ద ఉన్నాయి. అవి పక్కా జిరాయితీ భూములు’’ అని పల్లా శ్రీనివాసరావు సోదరుడు శంకరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను కబ్జా చేశామని ఆరోపణలు చేయడం అధికార పార్టీ నేతలకు తగదన్నారు. జాయింట్‌ సర్వే చేయాలన్నారు. ఒకవేళ తమ ఆధీనంలో ప్రభుత్వ భూమి వుంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని వారం రోజుల నుంచి డిమాండ్‌ చేస్తున్నా ఎందుకు సర్వే చేయించడం లేదని శంకరరావు ప్రశ్నించారు.

Updated Date - 2021-06-14T09:12:08+05:30 IST