కవ్వించే అమ్మాయిలు.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇస్తారు!

ABN , First Publish Date - 2021-04-22T17:15:24+05:30 IST

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కథ మొదలెడతారు. కవ్వించే మాటలతో కైపెక్కిస్తారు. అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్‌కి తీసుకెళ్లి ట్విస్ట్ ఇస్తారు. కవ్వించే కన్నెలు

కవ్వించే అమ్మాయిలు.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇస్తారు!

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కథ మొదలెడతారు. కవ్వించే మాటలతో కైపెక్కిస్తారు. అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్‌కి తీసుకెళ్లి ట్విస్ట్ ఇస్తారు. కవ్వించే కన్నెలు... ఏబీఎన్‌ ప్రత్యేక కథనం..


హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివే ఓ యువకుడు సొంతూరుకు వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులో ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్న మరో యువకుడు తన భవిష్యత్తు నాశనమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కే చెందిన ఓ ఈవెంట్‌ మేనేజర్‌ 10 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్‌కు చెల్లించాడు. ఇక, జీడిమెట్లలో ఇంజనీరింగ్‌ చదువుతున్న మరో యువకుడు కూడా తనను రక్షించాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటనలన్నీ  వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా.. అన్నింటికీ ఒకే లింకుంది. ఒకే ముఠా బరితెగింపు ఉంది. ఆ ఎపిసోడ్‌ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఏబీఎన్‌ క్రైమ్‌ బ్యూరో అందిస్తున్న రియల్‌ క్రైమ్‌స్టోరీస్‌లో చూద్దాం... 

 

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతున్నాడు. ఉన్నట్టుండి.. ఓ రోజు సొంతూరెళ్లాడు. పొలానికి వెళ్లి.. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ పరిశీలిస్తే భయంకరమైన వాస్తవం బయటపడింది. 

 

బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఓ రోజు సోషల్‌ మీడియాలో అనుకోకుండా తారసపడిన యువతితో క్లోజ్‌ ఫ్రెండ్‌షిప్‌ చేశాడు. ఆ యువకుడు తేరుకునేలోపే అంతా జరిగిపోయింది. బ్లాక్‌మెయిల్‌ దందా మొదలయ్యింది. అదంతా మోసమని గ్రహించిన యువకుడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్‌ మేనేజర్‌ సోషల్‌ మీడియా ఫ్రెండ్‌తో చాటింగ్‌ చేశాడు. ఆ తర్వాత సీన్‌ వీడియోకాల్‌కు మారింది. మరుసటిరోజునుంచే టార్చర్‌ మొదలయ్యింది. బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడిపోయి రెండు విడతలుగా పది లక్షల రూపాయలు వాళ్లుచెప్పిన అకౌంట్‌లో జమచేశాడు. అయినా, వేధింపులు తగ్గకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

 

ఇక, హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ కూడా ఇలాగే బుట్టలో పడ్డాడు. బ్లాక్‌మెయిలర్లు బెదిరించినా డబ్బులు లేకపోవడంతో పోలీసులను శరణుకోరాడు. ఇంట్లో కూడా తెలియకుండా తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.

 

ఇవన్నీ వాస్తవంగా జరిగిన సంఘటనలే. వీళ్లంతా సోషల్ మీడియా కంత్రీగాళ్ల బాధితులే. సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్న యువకులే. అయితే, అందరూ ఒకే ముఠా బారిన పడ్డ అమాయకులు. తెలిసీ తెలియక ఉచ్చులో చిక్కుకున్నారు. ప్రాంతాలు వేరైనా ఒకే తరహా ముఠాచేతిలో వీళ్లు మోసపోయారు. కొంపముంచిన కేటుగాళ్ల ఆట పట్టించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 

 

నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలం కోస్లీ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌.. హైదరాబాద్‌ పంజాగుట్టలోని హాస్టల్‌లో ఉంటూ హోటల్‌మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. ఇటీవల శ్రీకాంత్‌కు ఓ ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఆ నెంబర్‌కు కాల్‌ చేసిన శ్రీకాంత్‌తో అవతలినుంచి ఓ యువతి మాట్లాడింది. మొదట ఫోన్‌కాల్స్‌తో మొదలైన పరిచయం, వీడియో కాల్స్‌ దాకా వెళ్లింది. న్యూడ్‌గా మారి వీడియో కాల్‌ మాట్లాడేలా ఆ యువతి రెచ్చగొట్టింది. అలా.. ఒంటిమీద నూలుపోగు లేకుండా శ్రీకాంత్‌ మాట్లాడిన వీడియోకాల్‌ను రికార్డ్‌ చేసిన యువతి తన గ్యాంగ్‌తో కలిసి బ్లాక్‌మెయిల్‌ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే, న్యూడ్‌ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించింది. లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేయగా.. తనవద్ద ఉన్న 24 వేల రూపాయలను వాళ్లు చెప్పిన అకౌంట్‌లో జమచేశాడు శ్రీకాంత్‌. అయినా, వాళ్ల వేధింపులు ఆగకపోవడంతో.. ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయాడు. వాళ్లు అన్నంతపనీ చేస్తే తన పరువు పోతుందని భయపడ్డాడు. గత మార్చి 27వ తేదీన హైదరాబాద్‌ నుంచి నేరుగా తమ స్వగ్రామం వెళ్లాడు. పొలానికి వెళ్లి.. పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని తండ్రి గమనించి.. చికిత్స నిమిత్తం తొలుత నిజామాబాద్‌కు, ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. కానీ, చికిత్సపొందుతూ శ్రీకాంత్‌ చనిపోయాడు. 

 

హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్‌కు కూడా ఇలాగే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. తాను ముంబైలో మోడల్‌నంటూ పరిచయం చేసుకున్న యువతి అతనితో చాటింగ్‌ కొనసాగించింది. తర్వాత సీన్‌ వీడియోకాల్స్‌కు మారింది. అవతల కనిపిస్తున్న యువతి రెచ్చగొట్టడంతో మనోడు కూడా ఆమెను అనుసరించాడు. దుస్తులు విప్పేశాడు.  అయితే, ఈవెంట్‌ మేనేజర్‌ వీడియోకాల్‌ను అవతలినుంచి రికార్డ్‌ చేశారు. అలా.. సేవ్ చేసిన వీడియోలను వాట్సప్ ద్వారా పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్  మెయిల్‌కు పాల్పడ్డారు. అంతేకాదు.. అతని ఫ్రెండ్స్‌ అందరికీ ఆ వీడియోలు పంపిస్తామన్నారు. దీంతో, భయపడిపోయిన ఈవెంట్‌ మేనేజర్‌ 5 లక్షల రూపాయల చొప్పున రెండుసార్లు వాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇలా మొత్తం 10 లక్షల రూపాయలు ఇచ్చినా.. వాళ్ల బెదిరింపులు ఆగలేదు. దీంతో, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

బెంగళూరులోని భత్తరహళ్లికి చెందిన యువకుడు ఐఏఎస్ సాధించాలనే ధ్యేయంతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. ఓ అమ్మాయి నుంచి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు. కానీ, ఆ పరిణామమే అతని ప్రాణాలు తీసింది. తన సెల్‌నెంబర్‌ షేర్‌ చేసిన యువతి.. తొలుత వాయిస్‌కాల్స్‌, ఆ తర్వాత వీడియోకాల్స్‌ వైపు తీసుకెళ్లింది. ఆ క్రమంలోనే అమ్మాయి ఒంటిమీద నూలుపోగు లేకుండా దుస్తులన్నీ విప్పేసింది. యువకుడిని కూడా రెచ్చగొట్టింది. దీంతో, అమ్మాయి చెప్పినట్లు చేశాడు. కానీ, ఉదయానికే అతని వాట్సప్‌కు ఆవీడియోలు షేర్‌ చేసింది అవతలి గ్యాంగ్‌. భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. అది సైబర్‌నేరగాళ్ల పనే అని ఆలస్యంగా గ్రహించిన యువకుడు.. తన భవిష్యత్తు నాశనమైందనుకొని.. ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

ఇక, హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇలాంటి ఘటనే నమోదయ్యింది. కొంపల్లికి చెందిన ఇంజనీరింగ్‌ చదివే యువకుడికి ఓ డేటింగ్‌ యాప్‌లో యువతి పరిచయమయ్యింది. వీడియోకాల్స్‌లో యువకుడిని రెచ్చగొట్టి దుస్తులు లేకుండా చేసి.. అతనికి తెలియకుండా వీడియో రికార్డ్‌ చేసింది. ఆ తర్వాత ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో, ఆ యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో కూడా తెలియకుండా తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.


- సప్తగిరి గోపగోని, చీఫ్ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.



Updated Date - 2021-04-22T17:15:24+05:30 IST