వండితే ఈ పాత్రల్లోనే వండాలి..

ABN , First Publish Date - 2020-10-11T15:46:35+05:30 IST

మట్టి పరిమళం మనకు కొత్త కాదు. మట్టి కుండలే మానవ నాగరికతను పరిపుష్టం చేశాయి. నేడు లోహపాత్రలు వచ్చాక.. తిరిగి మట్టి వైపు

వండితే ఈ పాత్రల్లోనే వండాలి..

మేఘాలయలోని ఒక రెస్టారెంట్‌..మట్టికుండల్లో తెచ్చిన వేడి వేడి బిర్యానీ, ఎర్రటి మట్టి ప్లేట్లలో ఉడెన్‌ స్పూన్లతో వడ్డిస్తున్నారు. మట్టి గ్లాసుల్లోని నీళ్లు తాగుతున్నారు. రుచి అమోఘం, ఆ నీరు అమృతతుల్యం. ‘‘ఇంత అద్భుతమైన మట్టి పాత్రలు ఎక్కడ తయారయ్యాయి’’ అనడిగారు పర్యాటకులు.. ఆంధ్రా తూరుపు కనుమల్లోని మంత్రజోల (విజయనగరం జిల్లాలోని కురుపాం) గ్రామం..   అలా.. దేశమంతా పాకింది.. 


మట్టి పరిమళం మనకు కొత్త కాదు. మట్టి కుండలే మానవ నాగరికతను పరిపుష్టం చేశాయి. నేడు లోహపాత్రలు వచ్చాక.. తిరిగి మట్టి వైపు చూస్తున్నారంతా. అసలు మట్టి పాత్ర మర్మం తెలుసుకోవాలంటే.. టెర్రకోట పాత్రల నిపుణుడు ఖలీల్‌ బాబును కలవాలి. విజయనగరం, బాబామెట్టలో దీన్నొక కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నాడాయన. అక్కడ అడుగుపెడితే టీ కప్పుల నుండి డిన్నర్‌ సెట్ల వరకు అన్నిరకాల వంటపాత్రలు ఆకర్షిస్తాయి. నీళ్లసీసాలు, ఇడ్లీ ప్లేట్‌లు, కుక్కర్లు, పాన్‌లు, ట్రేలు, మట్టిగ్లాసులు, భోజన ప్లేట్లు.. ఇలా దొరకని సామగ్రి లేదు. వీటిని కొనేందుకు ప్రజలే కాదు, అత్యాధునిక రెస్టారెంట్ల ప్రతినిధులు సైతం వస్తుంటారిక్కడికి.

పూర్వం మట్టి కుండలే వంట పాత్రలు. ఆ తరువాత ఇనుము, అల్యూమినియం, స్టీలు పాత్రలు వచ్చాక మట్టిని మరిచిపోయారు. అందులోనూ నాణ్యమైన మట్టి పాత్రలు కూడా దొరకడం లేదు. వీటికి ఎందుకింత ప్రత్యేకత అంటే - కుండలో వండిన ఆహారంలో ఐరన్‌, ఫాస్పరస్‌, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. మూత గట్టిగా పెట్టడం వల్ల పోషకాలు ఆవిరి కావు. ఉష్ణోగ్రత, ఆవిరి అన్నివైపులా పరచుకోవడంతో వంటకం సంపూర్ణంగా ఉడుకుతుంది. దీని వల్ల నూనె శాతం తక్కువ అవుతుంది. కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వండితే ఏ పదార్థమైనా రుచిగాను, పోషకభరితంగానూ తయారవుతుంది. మట్టికి క్షార గుణం ఉండటం వల్ల ఆహారంలోని ఆమ్ల గుణాలు నశిస్తాయి. మట్టి పాత్రల్లో వండిన ఆహారం అంత త్వరగా చల్లారదు. వండిన చాలా సేపటికి తిన్నాసరే.. తాజాదనం కోల్పోదు. వేళలు గడిచినా చెడిపోదు. మట్టి పాత్రలకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. వాటికి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు ఖలీల్‌బాబు. ఆయన తండ్రి సూఫీ యోగి. ‘‘ఆయనే నాకు ప్రేరణ. అందుకే సేవాదృక్ఫథంతోనే ఈ పనిచేస్తున్నాను.  కొందరు మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నాను. మట్టి పాత్రల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును కొంత ‘వెలుగు’ అనే వృద్ధాశ్రమానికి కేటాయిస్తున్నాం.. ’’ అన్నారు. టెర్రకోట పాత్రలను చేయడానికి శుద్ధమైన మట్టి అవసరం. ఆ మట్టిని గుజరాత్‌, దిల్లీ, గజపతినగరం నుంచి తీసుకొస్తున్నారు. ‘టెర్రకోట అంటే కాల్చిన మట్టి అనర్థం. ఇదొక లాటిన్‌ పదం. మట్టిని కాల్చితే ఎరుపు, గోధుమ, నలుపు, నారింజ రంగుల్లోకి మారుతుంది. దాన్ని రకరకాల అచ్చుల్లోకి పోసి పాత్రల్లా మలిచాక.. 1100 డిగ్రీల సెంటీగ్రేడు వరకు కాలుస్తాం. అప్పుడు పాత్రలు అవుతాయి..’’ అన్నారు తయారీదారులు. మట్టి కళ ప్రాచుర్యం పొందితే మనుషులకే కాదు, పర్యావరణానికీ మంచిది.


 గాలి, నీరు లాగే పొలాల్లో రసాయనాల వాడకం వల్ల మట్టి కూడా కలుషితం అవుతోంది. అలాంటి మట్టితో చేసిన మట్టి పాత్రలు మంచివి కావు. ఖనిజాలు, బీ12 వంటి విటమిన్లు సహజంగానే ఉండే మట్టితో మాత్రమే పాత్రలు చేయాలి. అయితే ఇలా తయారు చేసిన పాత్రలు మెరిసేందుకు ఎటువంటి రంగులు పూయకూడదు. అలా పూస్తే.. మట్టి పాత్రలకున్న సూక్ష్మ రంధ్రాలు పూడుకుపోయి.. అందులోని సుగుణాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేసిన మట్టి వంట పాత్రలు ఆరోగ్యానికి మంచివే. 

           - డా.భవానీ,

        నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌

- శ్యాంమోహన్‌, 9440595858 

Updated Date - 2020-10-11T15:46:35+05:30 IST