రెస్టారెంట్లు ఢమాల్‌!

ABN , First Publish Date - 2021-05-04T15:30:33+05:30 IST

కరోనా రెండవ దశ హోటల్‌..

రెస్టారెంట్లు ఢమాల్‌!

నో సిట్టింగ్‌... ఓన్లీ ప్యాకింగ్‌

పడిపోయిన ఆక్యుపెన్సీ

పెరిగిన హస్పిటల్‌ ప్యాకింగ్‌

అమ్మకాలు  ఆ.. 3 గంటలే


విజయవాడ(ఆంధ్రజ్యోతి): కరోనా రెండవ దశ హోటల్‌ రంగంపై మరోసారి పంజా విప్పింది. లాక్‌డౌన్‌లో తిన్న దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా రెండో దశ రింగ్‌లు తిప్పేస్తోంది. లాక్‌డౌన్‌ తరువాత ఇటీవలే కస్టమర్లు బయటికొస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండటంతో రెస్టారెంట్లు ఖాళీ అయిపోయాయి. సీట్లు నిండటం లేదు. విజయవాడలో 1200 రెస్టారెంట్‌, హోటల్స్‌ ఉన్నాయి. ఒక్కో హోటల్లో సెల్ఫ్‌సర్వీ్‌సతో పాటు 30నుంచి 50 మంది కూర్చునే సౌకర్యం ఉంది. రెండు మూడు వారాల క్రితం వరకు కళకళలాడింది. ఇప్పుడు 10సీట్లు నిండటం కష్టంగా మారింది. కొత్తగా వస్తున్న పాజిటివ్‌ కేసులను చూసి హాయిగా రెస్టారెంట్లలో కూర్చుని తినాలంటేనే భయపడిపోతున్నారు. 


అన్ని ఆసుపత్రి ఆర్డర్లే!

రెస్టారెంట్లలో, హోటళ్లలో సీటింగ్‌ లేకపోయినా ఆర్డర్ల విషయంలో వ్యాపారులకు ఉపశమనం లభిస్తోంది. కొన్ని రోజులుగా ఆసుపత్రి నుంచి వచ్చే ఆర్డర్లు బాగా పెరిగాయి. బెంజిసర్కిల్‌, బీసెంట్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, సూర్యారావుపేట ప్రాంతాల్లోని రోజుకు 50 నుంచి 100 వరకు ఆసుపత్రి పార్శిల్సే వస్తున్నాయి. ఇక్కడ ఆసుపత్రులు అధికంగా ఉండటం, బాధితులు ఈ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటంతో వారి బంధువులు పార్శిళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నక్కల రోడ్డు, విజయటాకీస్‌ రోడ్డు, బెంజిసర్కిల్‌ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో బాధితుల సహయకులకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో హోటల్‌ ఆహారమే దిక్కవుతోంది. ఈ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్‌లోనే జరగుతున్నాయి. 


ఉదయం ఆ 3 గంటలే వ్యాపారం

రెస్టారెంట్లు ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. వాస్తవానికి తెల్లవారుజామున 5గంటలకు షెట్టరు ఎత్తితే రాత్రి 11గంటలకే దించుతారు. ఈ సమయంలోనే మొత్తం వ్యాపారం సాగుతుంది. ఇప్పుడు మాత్రం కేవలం ఉద యం 3గంటల పాటే ఉంటుంది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పార్శిల్స్‌ ఆర్డర్లు నడుస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత ఖాళీగానే ఉంటున్నామని యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం రాత్రి 10 నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. తాజాగా బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారానికి అనుమతి. దీంతో హోటల్స్‌ అన్నీ 11 గంటలకు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమయం తమ వ్యాపారానికి సరిపోదని వ్యాపారులు చెబుతున్నారు. తాము ఆహార పదార్ధాలు తయారు చేసుకోవటానికే నాలుగైదు గంటలు పడుతుందని, ఇలా అయితే వ్యాపారం ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం 12 గంటల పాటు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 


కనీసం 12 గంటల సమయం ఇవ్వాలి: మణి, గుడ్‌ మార్నింగ్‌ హోటల్‌ అధినేత

ఏడాది కాలంగా హోటల్‌ వ్యాపారం ఏమాత్రం బాగోలేదు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందన్న సమయంలో మళ్లీ ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం వ్యాపారం ఉదయం మాత్రమే సాగుతోంది. రాత్రి ఏమీ జరగటం లేదు. కర్ఫ్యూ వలన రాత్రి 9 గంటలకు వ్యాపారం ఆపేస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి అంటున్నారు. ఈ సమయం మాకు సరిపోదు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి..


Updated Date - 2021-05-04T15:30:33+05:30 IST