హోటల్‌కు వెళ్తున్న భార్యపై అనుమానంతో...

ABN , First Publish Date - 2020-11-12T17:40:13+05:30 IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఆ ఇంటి పెద్ద

హోటల్‌కు వెళ్తున్న భార్యపై అనుమానంతో...

  • చిన్నారులను బలిగొన్న అనుమానం
  • భార్యాపిల్లలపై పలుగుతో దాడి 
  • కుమార్తెలు మృతి, అర్ధాంగి పరిస్థితి విషమం


చెన్నై : కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఆ ఇంటి పెద్ద ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. కుటుంబ పోషణ కోసం అతని భార్య ఓ హోటల్‌లో పనికి వెళ్తుండగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకుని చివరకు భార్యాపిల్లలపై దాడికి పాల్పడిన సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. వివరాలిలా... తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాత్తూర్‌ సమీపం రాయంపేటకు చెందిన చేనేత కార్మికుడు మురుగన్‌ (38), దేవిక (28) దంపతులకు మీనా (10), శివాని (8) అనే కుమార్తెలున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మీనా 5వ తరగతి, శివాని 3వ తరగతి చదువుతు న్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చేనేత పరిశ్రమ స్తంభించడంతో మురుగన్‌కు జీవనోపాధి లేక కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న దేవిక పాఠశాల కూడా మూతపడడంతో ఓ హోటల్‌లో పనికి చేరింది.


ఇదిలా ఉండగా.. భార్య ప్రవర్తనపై అనుమానించిన మురుగన్‌ తరచు ఆమెతో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో, మంగళవారం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి, పనికి వెళ్లొద్దంటూ భార్యను  హెచ్చరించి మురుగన్‌ బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన మురుగన్‌  నిద్రిస్తున్న చిన్నకుమార్తె శివానిపై గడ్డపారతో దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. దీనిని గమనించిన దేవిక, మీనా పెద్దగా కేకలు వేయడంతో మురుగన్‌ వారిని కూడా గడ్డపారతో కొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి స్పృహతప్పారు. చుట్టుపక్కల వారు వెళ్లి వారిని తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో మీనా మృతిచెందింది. దేవిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అరవింద్‌, ఏఎస్సీ కిరణ్‌స్తుతి, డీఎస్పీ అన్నాదొరై, శిక్షణ డీఎస్పీ సురేష్‌ పాండియన్‌, ఇన్‌స్పెక్టర్‌ మహాలక్ష్మి సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కీల్‌పెన్నత్తూర్‌ పోలీసులు కేసు నమోదుచేసి మురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-11-12T17:40:13+05:30 IST